FIFA World Cup 2022 : అప్పటికే 90 నిమిషాల నిర్ణీత సమయం ముగిసింది. రిఫరీ 9 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. దానిలోనూ 7 నిమిషాల ఆట పూర్తయ్యింది. మరో రెండు నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో తనకంటే బలమైన వేల్స్ (Wales)పై ఇరాన్ (Iran) జట్టు పంజా విసిరింది. ఎవరూ ఊహించని విధంగా రెండు గోల్స్ చేసి ఫిఫా ప్రపంచకప్ (FIFA World cup 2022)లోనే బిగ్ షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘బి‘లో భాగంగా జరిగిన ఈ పోరులో ఇరాన్ 2-0 గోల్స్ తేడాతో వేల్స్ కు భారీ షాక్ ఇచ్చింది. డ్రా చేసుకుంటే చాలు గెలిచినంత సంబరాలు చేసుకుందామనుకున్న ఇరాన్ అభిమానులను ఆకాశంలో విహరించేలా చేసింది.
ఏ విధంగా చూసుకున్నా గ్యారెత్ బేల్ నాయకత్వంలోని వేల్స్ ఇరాన్ కంటే కూడా ఎన్నో రెట్టు బలంగా ఉంది. ఇంగ్లండ్ తో జరిగిన తమ తొలి మ్యాచ్ లో ఇరాన్ ఏకంగా 2-6 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అమెరికాతో జరిగిన తొలి గ్రూప్ మ్యాచ్ ను వేల్స్ 1-1తో గ్రా ముగించింది. ప్రిక్వార్టర్స్ కు చేరాలంటే ఇరాన్ పై నెగ్గడం వేల్స్ కు చాలా ముఖ్యం. అలాంటి మ్యాచ్ లో వేల్స్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇరు జట్లు కూడా గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. తొలి అర్ధ భాగంలో ఒక్క గోల్ కూడా నమోదు కాకుండానే ముగిసింది. ఇక రెండో అర్ధ భాగంలోనూ ఇరు జట్లు గోల్ కోసం విఫలయత్నం చేశాయి. అయితే వేల్స్ కు 86వ నిమిషంలో భారీ షాక్ తగిలింది. గోల్ కోసం వేల్స్ గోల్ పోస్ట్ వైపు దూసుకొచ్చిన ఇరాన్ ప్లేయర్ కరీమ్ ను వేల్స్ గోల్ కీపర్ దురుసుగా అడ్డుకున్నాడు. దాంతో రిఫరీ వేల్స్ గోల్ కీపర్ కు రెడ్ కార్డు ఇచ్చాడు. ఇక్కడి నుంచి మిగిలిన సమయాన్ని వేల్స్ 10 మందితోనే ఆడింది.
— Golazoz (@golazoz_) November 25, 2022
అదనపు సమయం 8వ నిమిషంలో (90+8వ నిమిషంలో) చెస్మి గోల్ చేసి ఇరాన్ కు 1-0 ఆధిక్యం ఇచ్చాడు. కాసేపటికే రెజాయిన్ (90 + 11వ నిమిషంలో) మరో గోల్ చేసి ఇరాన్ కు తిరుగులేని విజయాన్ని అందజేశాడు. చివరి నిమిషాల్లో గోల్స్ సమర్పించుకుని ఓడిన వేల్స్ అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. వేల్స్ తర్వాతి రౌండ్ కు చేరుకోవడం దాదాపు కష్టమే. తన తదుపరి మ్యాచ్ లో వేల్స్ పటిష్ట ఇంగ్లండ్ తో ఆడాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA World Cup 2022, Football, Iran, Qatar