FIFA World Cup 2022 : ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup) 2022లో పోర్చుగల్ (Portugal) బోణీ కొట్టింది. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా జరిగిన పోరులో దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) నాయకత్వంలోని పోర్చుగల్ 3-2 గోల్స్ తేడాతో ఘనా (Ghana)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో పోర్చుగల్ ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి. దాంతో ఈ జట్టు గ్రూప్ ‘హెచ్’లో తొలి స్థానానికి చేరుకుంది. నమోదైన ఐదు గోల్స్ కూడా రెండో అర్ధ భాగంలోనే కావడం విశేషం. పోర్చుగల్ తరఫున క్రిస్టియానో రొనాల్డో (65వ నిమిషంలో) పెనాల్టీని గోల్ గా మలిచాడు. ఫెలిక్స్ (78వ నిమిషంలో), లెయో (80వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఘనా తరఫున అయ్యూ (73వ నిమిషంలో), బుకరి (89వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు.
ఆట ఆరంభం నుంచే పోర్చుగల్ ఎక్కువగా బంతిని తన దగ్గరే ఉంచుకుంది. తొలి అర్ధ భాగంలో దాదాపుగా 75 శాతం బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకుంది. ఈ క్రమంలో ఒకటి రెండు సార్లు గోల్ చేసే అవకాశం వచ్చినా పోర్చుగల్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. రొనాల్డో కూడా గోల్ చేసే సులభమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అయితే రొనాల్డో ఒక గోల్ చేసినా అది ఫౌల్ గా రిఫరీ ప్రకటించాడు. ఇక తొలి అర్ధ భాగంలో ఘనా ఎక్కువగా డిఫెన్స్ కే పరిమితం అయ్యింది.
Which team surprised you the most today?#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) November 24, 2022
ఇక రెండో భాగంలో ఘనా దూకుడు ప్రదర్శించింది. పోర్చుగల్ పేలవ డిఫెన్స్ ను పలుమార్లు ఛేదిస్తూ గోల్ చేసేలా కనిపించింది. అయితే త్రుటిలో ఆ అవకాశాలు చేజారాయి. ఇక 65వ నిమిషంలో ఘనా ప్లేయర్ ఆ జట్టు డి బాక్స్ లో రొనాల్డోను దురుసుగా అడ్డుకున్నాడు. దాంతో పోర్చుగల్ కు పెనాల్టీ లభించింది. పెనాల్టీని రొనాల్డో ఎటువంటి తప్పు చేయకుండా గోల్ గా మలిచి పోర్చుగల్ కు ఆధిక్యాన్ని ఇచ్చాడు. అయితే కాసేపటికే ఘనా కెప్టెన్ అయ్యూ గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఈ సమయంలో రెచ్చిపోయిన పోర్చుగల్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి పోర్చుగల్ కు తిరుగులేని ఆధిక్యాన్ని ఇచ్చింది. అయితే చివర్లో బుకారి గోల్ చేసి పోర్చుగల్ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాడు. చివర్లో పోర్చుగల్ గోల్ కీపర్ కోస్టా దాదాపుగా ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఘనా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. దాంతో ఊపిరి పీల్చుకున్న పోర్చుగల్ మ్యాచ్ ను విజయంతో ముగించింది.
ఇక ఇతర మ్యాచ్ ల్లో.. గ్రూప్ ‘హెచ్‘లో భాగంగా దక్షిణ కొరియా, ఉరుగ్వే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కూడా గోల్స్ చేయడంలో విఫలం అయ్యాయి. దాంతో మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. గ్రూప్ ‘ఎఫ్‘లో భాగంగా జరిగిన తొలి పోరులో స్విట్జర్లాండ్ జట్టు 1-0తో కెమరూన్ పై గెలుపొందింది. ఇక అర్ధ రాత్రి దాటాక జరిగిన మరో మ్యాచ్ లో బ్రెజిల్ 2-0 గోల్స్ తేడాతో సెర్బియాపై నెగ్గింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brazil, Cristiano Ronaldo, FIFA World Cup 2022, Serbia, Switzerland