FIFA World Cup 2022 : ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup) 2022లో మరో సంచలనం నమోదైంది. నాలుగు రోజుల క్రితం జరిగిన పోరులో మాజీ చాంపియన్ జర్మనీ (Germany)పై జపాన్ (Japan) అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో 2-1 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది జపాన్. అయితే తాజాగా కొస్టారికా చేతిలో చావు దెబ్బ తింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కొస్టారికా జట్టు 1-0 గోల్ తేడాతో తన కంటే బలమైన జపాన్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో జపాన్ ప్రిక్వార్టర్స్ అవకాశాలు క్లిష్టం అయ్యాయి. తర్వాతి దశకు అర్హత సాధించాలంటే జపాన్ తన చివరి లీగ్ మ్యాచ్ లో స్పెయిన్ పై తప్పకుండా నెగ్గాల్సి ఉంది.
మరోవైపు స్పెయిన్ తో జరిగిన తమ తొలి మ్యాచ్ లో కొస్టారికా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఏకంగా 0-7 గోల్స్ తేడాతో ఆ మ్యాచ్ లో ఓడింది. ఫుట్ బాల్ ఇలా ఓడటం అంటే అది జట్టును మానసికంగా క్రుంగదీస్తుంది. అయితే ఆ ఓటమి నుంచి బౌన్స్ బ్యాక్ అయిన కొస్టారికా జపాన్ పై గెలుపుతో నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆట 81 నిమిషంలో ఫుల్లర్ గోల్ చేసి కొస్టారికా విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం జపాన్ దే. అయినప్పటికీ గోల్ చేయడంలో విఫలం అయ్యింది. ఇక తమకు రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కొస్టారికా గోల్ చేసి విజేతగా నిలిచింది.
Costa Rica break through to beat Japan!@adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) November 27, 2022
ఈ మ్యాచ్ లో జపాన్ ఏకంగా 13 సార్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్ పై దాడులు చేస్తే.. కొస్టారికా మాత్రం నాలుగు సార్లు మాత్రమే చేసింది. బంతి నియంత్రణ 57 శాతం జపాన్ చేతిలోనే ఉండగా.. కొస్టారికా కేవలం 43 శాతం మాత్రమే ఉంది. అయితే కీలక సమయంలో గోల్ చేసిన కొస్టారికా విజేతగా నిలిచింది.
జర్మనీకి డూఆర్ డై మ్యాచ్
గ్రూప్ ‘ఈ’లో ఉన్న జర్మనీ డూఆర్ డై మ్యాచ్ కు సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ లో స్పెయిన్ తో తలపడనుంది. జపాన్ చేతిలో ఊహించని రీతిలో ఓడిన జర్మనీ.. ప్రిక్వార్టర్స్ కు చేరాలంటే స్పెయిన్ పై తప్పుకుండా నెగ్గాల్సి ఉంది. గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా జరిగే ఇతర మ్యాచ్ ల్లో మోరాకోతో బెల్జియం (భారత కాలమానం ప్రకారం సాయంత్రం గం. 6.30 నుంచి).. కెనడాతో క్రొయేషియా (భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 9.30 నుంచి) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లను స్పోర్ట్స్ 18 చానెల్ తో పాటు జియో సినిమాలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA, FIFA World Cup 2022, Germany, Japan, Spain