ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో అసలు సిసలు సమరాలకు రంగం సిద్ధమైంది. కప్పు వేటలో ఇక మిగిలింది ఎనిమిది జట్లే. వాటి మధ్య క్వార్టర్స్ పోరుకు సమయం ఆసన్నమైంది. గెలిచిన జట్టు టైటిల్ వేటలో ముందంజ వేస్తే..ఓడినవాళ్లు నిరాశగా ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి. ఇప్పటికే పలు అగ్రశ్రేణి జట్లు జర్మనీ, బెల్జియం, ఉరుగ్వే నిష్క్రమించగా, తొలి క్వార్టర్స్‌లో బ్రెజిల్, క్రొయేషియా మధ్య శుక్రవారం పోరు జరుగనుంది. ఇక, అర్ధరాత్రి జరిగే రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను అర్జెంటీనా ఢీ కొట్టనుంది. ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్.. ఆరో కప్ వేటలో టాప్ గేర్‌లో సాగుతోంది. తొలి క్వార్టర్ఫైనల్లో బ్రెజిల్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. గత టోర్నీ రన్నరప్ క్రొయేషియాను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. గాయం నుంచి కోలుకొని నెమార్ రీఎంట్రీ ఇవ్వగా.. రిచర్లిసన్, వీనీసియస్ లాంటి ఉడుకు రక్తంతో బ్రెజిల్ దూకుడుగా కనిపిస్తోంది.
మరోవైపు వెటరన్ ఆటగాళ్లతో క్రొయేషియా కొంత కష్టంగా క్వార్టర్స్ బెర్త్ దక్కించుకొంది. మోద్రిచ్ కేంద్రకంగా జట్టు ఆట సాగుతున్నా.. అటాకింగ్ బలహీనంగా ఉంది. వరల్డ్‌కప్‌లో ఇరుజట్లూ రెండుసార్లు తలపడగా.. రెండింటిలోనూ బ్రెజిల్ నెగ్గింది. ప్రిక్వార్టర్స్‌లో జపాన్ అదిరే ఆటతో సవాలు విసిరినా.. షూటౌట్లో ఆ జట్టుకు చెక్ పెట్టి ముందంజ వేసింది క్రొయేషియా.
ఇక హాట్ ఫేవరెట్ జట్టు బ్రెజిల్ అంచనాలకు తగ్గట్లే ఆడుతోంది.చివరి గ్రూప్ మ్యాచ్‌లో కామెరూన్ చేతిలో ఓటమిని మినహాయిస్తే ఆ జట్టు అదరగొట్టింది. ప్రిక్వార్టర్స్‌లో దక్షిణ కొరియాపై చెలరేగి ఆడి 4-1తో విజయం సాధించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో గాయపడ్డాక కోలుకుని గత మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన స్టార్ ఆటగాడు నెయ్మార్ గోల్ కొట్టడమే కాక మొత్తంగా చక్కటి ప్రదర్శన చేశాడు. వినిసియస్, రిచర్లిసన్ కూడా ఫామ్‌లో ఉన్నారు.
మరోవైపు మోద్రిచ్, పెరిసిచ్, క్రమారిక్ లాంటి స్టార్లు క్రొయేషియా జట్టుకు కీలకం. ఫిఫా టోర్నీల్లో భాగంగా గతంలో ఇరుజట్లు ఇప్పటివరకు 4సార్లు తలపడగా.. 3సార్లు బ్రెజిల్ గెలుపొందగా.. ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. 2014మెగా టోర్నీలో 3-1తో, 2018లో 2-0తో బ్రెజిల్ జట్టు క్రొయేషియాపై విజయం సాధించింది.
అర్జెంటీనా వర్సెస్ నెదర్లాండ్స్
మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో తలపడనున్న అర్జెంటీనా, నెదర్లాండ్స్ సమవుజ్జీలే కావడంతో హోరాహోరీ తప్పకపోవచ్చు. సెమీస్ లో చోటు కోసం జరిగే మ్యాచ్‌లో మూడుసార్లు ఫైనలిస్టు డచ్ టీమ్‌తో రెండుసార్లు చాంపియన్ అర్జెంటీనా అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, మ్యాచ్ మొత్తం అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ.. నెదర్లాండ్ డిఫెన్స్ మధ్యే ప్రధానంగా నడిచే అవకాశం ఉంది. వరల్డ్‌కప్‌లో ఇరుజట్లూ ఐదుసార్లు తలపడగా, చెరో రెండు మ్యాచ్‌లు నెగ్గాయి. ఓ మ్యాచ్ డ్రా అయింది.
మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు కాబట్టి ఈసారైనా అతడి కప్పు కల నెరవేర్చాలని జట్టు కోరుకుంటోంది. తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో షాక్ తిన్నాక.. గొప్పగా పుంజుకుని వరుసగా విజయాలు సాధిస్తూ క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది అర్జెంటీనా. మెస్సితో పాటు అల్వారెజ్, మార్టినెస్ కూడా ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ప్రిక్వార్టర్స్‌లో అదిరిపోయే గోల్‌తో ఉర్రూతలూగించిన మెస్సి.. ఈ మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శనను రిపీట్ చేస్తాడని. నెదర్లాండ్స్‌కు ప్రస్తుత టోర్నీలో ఇప్పటిదాకా ఓటమే లేదు. అయితే గ్రూప్ దశలో ఆ జట్టు ప్రదర్శన మరీ గొప్పగా ఏమీ లేదు. ప్రిక్వార్టర్స్‌లో అమెరికా నుంచి గట్టి పోటీ ఎదురైనా.. ఘనవిజయం సాధించడం డచ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. నెదర్లాండ్స్ డంఫ్రీస్, డీపే, గాక్పో లాంటి స్టార్లపై ఆశలు పెట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brazil, FIFA World Cup 2022, Football, Lionel Messi, Netherlands