ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World Cup 2022)లో ప్రిక్వార్టర్స్ లో డచ్ జట్టు (Netherlands) అదుర్స్ అన్పించింది. గ్రూప్ దశలో సాధారణ ప్రదర్శనతో నిరాశపర్చినా నెదర్లాండ్స్.. కీలకమైన నాకౌట్ మ్యాచులో జూలు విదిల్చింది. ఆద్యంతం అద్భుతమైన ఆటతో అమెరికా(USA)ను మట్టికరిపించి.. క్వారర్స్ ఫైనల్ లో సగర్వంగా అడుగుపెట్టింది. అమెరికాపై ఆధిపత్యం చలాయిస్తూ 3-1తో ఆ జట్టును చిత్తు చేసింది. మెంఫిస్ డిపే (10వ), డాలీ బ్లైండ్ (45+1), డెంజల్ డమ్‌ఫ్రైస్ (81వ) గోల్స్ చేయగా.. అమెరికా తరఫున హజీ రైట్ (76వ) ఏకైక గోల్ సాధించాడు. రెండు గోల్స్‌కు బాటలు వేసిన డమ్‌ఫ్రైస్.. మూడో గోల్ చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చా డు. ఈ ఓటమితో అమెరికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచకప్ టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు క్వార్టర్స్ చేరడం ఇది ఏడోసారి. అమెరికా జట్టు 2002లో మాత్రమే క్వార్టర్స్ ఆడింది.
గ్రూపు దశలో చక్కటి ప్రదర్శన చేసిన అమెరికా.. నెదర్లాండ్స్ దూకుడు ముందు నిలవలేకపోయింది. మ్యాచ్ ఆరంభమైన మూడో నిమిషంలో అమెరికా స్టార్ ఫులిసెక్కు సువర్ణావకాశం లభించింది. కానీ, అతడు కొట్టిన కిక్‌ను డచ్ కీపర్ నోపర్ సమర్ధవంతంగా అడ్డుకొన్నాడు. కానీ, క్రమంగా ఒత్తిడి పెంచిన ఆరెంజ్ ఆర్మీ 10వ నిమిషంలో మెంఫిస్ డిపే గోల్‌తో పైచేయి సాధించింది. డమ్‌ఫ్రైస్ ఇచ్చిన చక్కటి పాసింగ్ తో డిపే నేరుగా గోల్‌లోకి కొట్టాడు. ఆ తర్వాత స్కోరు సమం చేసేందుకు అమెరికా శతవిధాల ప్రయత్నించినా.. డచ్ డిఫెన్స్‌ను ఏమార్చలేక పోయింది. నెదర్లాండ్స్ రక్షణ శ్రేణి.. అద్బుతంగా రాణించడంతో అమెరికా పప్పులు ఉడకలేదు.
???????? USA had its opportunities but it's ???????? Netherlands who advance to the #Qatar2022 Quarter-finals! See #USA v #NED highlights on FIFA+
— FIFA World Cup (@FIFAWorldCup) December 3, 2022
మ్యాచ్ సాగేకొద్దీ బంతిని ఎక్కువగా తమ అధీనంలోనే ఉంచుకొన్న నెదర్లాండ్స్.. అమెరికాను సెల్ఫ్ డిఫెన్స్ లో పడేసింది. ఫస్టాఫ్ స్టాపేజ్ (45+1) టైమ్‌లో మరో గోల్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఈసారి డమ్‌ఫ్రైస్ పాస్‌ను బ్లైండ్ నెట్లోకి పంపడంతో నెదర్లాండ్స్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో.. ఫస్టాఫ్ ముగిసే సమయానికే పటిష్టమైన ఆధిక్యంలో నిలిచింది.
అయితే, సెకాండాఫ్ లో అమెరికన్లు దూకుడు పెంచినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరంభమైన ఐదు నిమిషాలకే డచ్ ప్లేయర్ డమ్‌ఫ్రైస్ గోల్ చేసినంత పని చేశాడు. యూఎస్ పెనాల్టీ ఏరియాలో అతడు కొట్టిన కిక్‌ను జిమ్మర్మెన్ ఆపే ప్రయత్నంలో తడబడినా.. కీపర్ టర్నర్ లిప్తపాటులో బంతిని అడ్డుకున్నాడు. అయితే, 75వ నిమిషంలో అమెరికా గోల్ చేసింది. ఫులిసెక్ క్రాస్.. రైట్ కాలికి తగిలి గోల్లో పడింది. ఇదే జోరులో యూఎస్ మరిన్ని దాడులు చేసినా.. 81వ నిమిషంలో బ్లైండ్ ఇచ్చిన క్రాస్‌ను డమ్‌ఫ్రైస్ గోల్‌లోకి పంపడంతో నెదర్లాండ్స్ 3-1తో నిలిచింది. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకుంటూ ముందంజ వేసింది. ఈ గెలుపుతో ప్రపంచకప్ టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు క్వార్టర్స్ చేరడం ఇది ఏడోసారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA, FIFA World Cup 2022, Football, Netherlands, USA