హోమ్ /వార్తలు /క్రీడలు /

FIFA World Cup 2022 : ఇంగ్లండ్, నెదార్లాండ్స్ అదుర్స్.. ఇరాన్, సెనగల్ బెదుర్స్.. యూఎస్- వేల్స్ మ్యాచ్ డ్రా..

FIFA World Cup 2022 : ఇంగ్లండ్, నెదార్లాండ్స్ అదుర్స్.. ఇరాన్, సెనగల్ బెదుర్స్.. యూఎస్- వేల్స్ మ్యాచ్ డ్రా..

PC : FIFA

PC : FIFA

FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్ కప్ లో రెండో రోజు జరిగిన మూడు మ్యాచులు కూడా అభిమానుల్ని అలరించాయి. ఇక, రెండో రోజు ఫలితాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగించే విధంగా ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2022) ప్రారంభం అయింది. ఇక, ఆరంభం మ్యాచులో ఈక్వెడార్ 2-0 తేడాతో ఆతిథ్య ఖతార్ ను ఓడించి.. టోర్నీని ఘనంగా ప్రారంభించింది. ఇక, రెండో రోజు జరిగిన మూడు మ్యాచులు కూడా అభిమానుల్ని అలరించాయి. ఫస్ట్ మ్యాచులో ఇంగ్లండ్ విజేతగా నిలవగా.. ఆఖరి మ్యాచులో నెదర్లాండ్ విక్టరీ కొట్టింది. ఇక, యూఎస్ఏ.. వేల్స్ మధ్య హోరాహోరీగా సాగిన రెండో మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది.

ఖలిఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన గ్రూప్‌బి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-2 గోల్స్ తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ప్రథమార్ధంలో ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. ఇటు ఇరాన్ అటు ఇంగ్లండ్ వరుస దాడులతో ఆకట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. తొలి అర్ధ గంటలో ఇరు జట్లకు ఒక్క గోల్ కూడా లభించలేదు.

అయితే 35వ నిమిషంలో ఇగ్లండ్ యువ సంచలనం జూడ్ బెల్లింగ్‌హామ్ జట్టుకు నిరీక్షణకు తెరదించుతూ జట్టుకు తొలి గోల్‌ను సాధించి పెట్టాడు. అద్భుత ఆటను కనబరిచిన బెల్లింగ్‌హామ్ కళ్లు చెదరే గోల్‌ను సాధించాడు. ఆ వెంటనే బుకాయో సాకా ఇంగ్లండ్‌కు రెండో గోల్ అందించాడు. 43వ నిమిషంలో సాకా ఈ గోల్ నమోదు చేశాడు. ఇక ప్రథమార్ధం చివరి నిమిషంలో రహీం స్టెర్టింగ్ ఇంగ్లండ్‌కు మరో గోల్ అందించాడు.

దీంతో తొలి హాఫ్‌లో ఇంగ్లండ్ 30 ఆధిక్యంలో నిలిచింది. ఇక ద్వితియార్ధం 62వ నిమిషంలో సాకా తన రెండో గోల్‌ను సాధించాడు. 71వ నిమిషంలో మార్కొస్ రష్‌ఫోర్డ్, 89వ నిమిషంలో జాక్ గియాలిష్ చెరో గోల్ చేశారు. ఇక ఇరాన్ తరఫున మెహదీ తరెమి రెండు గోల్స్ చేశాడు. 65వ నిమిషంలో తొలి గోల్ చేసిన మెహదీ చివరి నిమిషంలో రెండో గోల్ సాధించాడు.

ఇక.. వేల్స్, అమెరికా మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. హోరాహోరీగా సాగిన పోరులో రెండు జట్లు చెరో గోల్ చేశాయి. దీంతో 1-1 తేడాతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 82వ నిమిషంలో వేల్స్ కెప్టెన్ గారెత్ బేల్ పెనాల్టీని గోల్ గా మలిచాడు. దీంతో.. మ్యాచ్ డ్రాగా ముగిసింది. లేకపోతే.. అమెరికా జట్టు విజేతగా నిలిచి ఉండేది. అనుభవజ్ఞులైన వేల్స్ టీమ్ ను .. యువరక్తంతో నిండిన యూఏస్ జట్టు సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఓ సమయంలో చెమటలు పట్టించింది కూడా. ఫస్ట్ హాఫ్ లో తిమోతీ వీహ్ చేసిన గోల్ యూఏస్ జట్టును ఆధిక్యంలో నిలిపింది. అయితే.. సెకండాఫ్ లో చివరి నిమిషాల్లో వేల్స్ కెప్టెన్ గోల్ చేయడంతో ఆ జట్టు బతికిపోయింది.

ఇక రాత్రి జరిగిన చివరి గేమ్ లో నెదర్లాండ్స్ ఆఖరి నిమిషాల్లో రెండు గోల్స్ చేసి సెనెగల్‌ను 2-0తో ఓడించింది. నెదర్లాండ్ రైజింగ్ స్టార్ కోడి గక్పో మరియు డేవి క్లాసెన్ రెండు గోల్స్ తో తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఫస్ట్ హాఫ్ వరకు కూడా రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. పటిష్టమైన నెదర్లాండ్స్ ను గోల్స్ చేయకుండా సెనెగల్ ఆటగాళ్లు అడ్డుకున్నారు. అయితే, చివరి నిమిషాల్లో రెండు గోల్స్ చేసి.. మ్యాచ్ తో పాటు మూడు పాయింట్లు కైవసం చేసుకుంది నెదర్లాండ్స్ జట్టు.

First published:

Tags: England, FIFA, FIFA World Cup 2022, Foot ball, Netherlands, USA

ఉత్తమ కథలు