FIFA World Cup 2022 : ఖతర్ (Qatar) వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup) 2022 ఆఖరి దశకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ పోరుతో ప్రపంచకప్ మహా సంగ్రామానికి తెరపడనుంది. టైటిల్ ఫైట్ లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ (France)తో మెస్సి సారథ్యంలోని అర్జెంటీనా (Argentina) తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి గం. 8.30లకు జరుగుతుంది. బలాబలాల విషయంలో ఇరు జట్లు కూడా సమంగా కనిపిస్తున్నాయి. అర్జెంటీనాకు కెప్టెన్ మెస్సీ బలం. అయితే ఫ్రాన్స్ మాత్రం సమష్టిగా ఆడుతుంది. అర్జెంటీనాతో పోలిస్తే ఫ్రాన్స్ లో మ్యాచ్ విన్నర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం జరిగే ఫైనల్ సాకర్ అభిమానులను అలరించడం ఖాయం.
ఫ్రాన్స్ శిబిరంలో ఆందోళన
ఫైనల్ కు ముందు ఫ్రాన్స్ శిబిరంలో ఆందోళన నెలకొని ఉంది. టోర్నీ ఆరంభానికి ముందు పోగ్బా, బెంజెమా లాంటి ప్లేయర్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. సెమీఫైనల్ కు ముందు కొందరు ప్లేయర్లు అనారోగ్యం బారిన పడ్డారు. ఇక తాజాగా అర్జెంటీనాతో జరిగే ఫైనల్ మ్యాచ్ కు ముందు మరికొంత మంది ప్లేయర్లు వైరల్ ఫ్లూ బారిన పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రాన్స్ ఆటగాళ్లలో డిఫెండర్ రఫేల్ వారానే, ఇబ్రహీం కొనాటే, కింగ్స్‌లీ కొమన్ లో ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో వాళ్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనలేదు. ఫ్రాన్స్ డిఫెన్స్ లో వారానే కీలకం. దాంతో ఫ్రాన్స్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫ్లూ కాబట్టి మరికొంతమంది ప్లేయర్లు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఇది ఫ్రాన్స్ విజయావకాశాలను దెబ్బ తీసే అవకాశం ఉంది.
ఇక మరోవైపు టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ లో సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా అనూహ్యంగా ఓడింది. అయితే ఆ తర్వాత వరుసగా విజయాలను నమోదు చేసి ఫైనల్ కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ పై పెనాల్టీ షూటౌట్ లో నెగ్గిన అర్జెంటీనా.. సెమీస్ లో క్రొయేషియాను చిత్తు చిత్తుగా ఓడించింది. మెస్సి అన్నీ తానై జట్టును నడిపిస్తున్న విధానం అమోఘం. గోల్స్ చేడంలో.. ఇతరులను గోల్స్ చేపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు అటు ఫ్రాన్స్ (1998,2018) ఇటు అర్జెంటీనా (1978, 1986)లు రెండీసి సార్లు ప్రపంచకప్ విజేతలుగా నిలిచాయి. ఆదివారం జరిగే ఫైనల్లో ఏ జట్టు నెగ్గినా తమ వారి ఖాతాలో మూడో టైటిల్ చేరడం ఖాయం. అర్జెంటీనా నెగ్గితే మెస్సి అభిమానులు పండుగ చేసుకోవడం ఖాయం.
ముఖాముఖి
ముఖాముఖి పోరులో అర్జెంటీనా ఆధిక్యంలో ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 12 అంతర్జాతీయ మ్యాచ్ లను ఆడింది. ఇందులో అర్జెంటీనా ఆరు సార్లు నెగ్గింది. ఫ్రాన్స్ కేవలం 3 సార్లు మాత్రమే విజయాన్ని నమోదు చేసింది. మరో మూడు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA, FIFA World Cup 2022, France, Lionel Messi, Qatar