ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup) 2022లో మూడో రోజు పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన అర్జెంటీనా (Argentina) జట్టుకు తొలి మ్యాచ్ లోనే భారీ షాక్ తగిలింది. తనకంటే తక్కువ ర్యాంక్ జట్టు అయిన సౌదీ అరేబియా (Saudi Arabia) చేతిలో అర్జెంటీనా చిత్తయ్యింది. గ్రూప్ ‘సి’లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో 51వ ర్యాంక్ సౌదీ అరేబియా 2-1తో అర్జెంటీనాపై గెలుపొందింది.
ఇక, డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ అదిరే విజయంతో టోర్నీని ఆరంభించింది. ఫ్రాన్స్ జట్టు 4-1 తేడాతో ఆస్ట్రేలియా టీంను చిత్తుగా ఓడించింది. తమ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను ఘనంగా చాటుకుంది. గ్రూప్-డీలో భాగంగా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆరంభంలోనే ఆసీస్ జట్టు తొలి గోల్ చేసింది. దీంతో ఫ్రాన్స్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆట మొదలైన 9వ నిమిషంలోనే ఆసీస్ ప్లేయర్ క్రెగ్ గుడ్‌విన్ అద్భుతమైన గోల్ చేశాడు. దీంతో ఆ జట్టు ఫ్రాన్స్‌పై 1-0 ఆధిక్యం సాధించింది.
అయితే ఆస్ట్రేలియా సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఈ ఒత్తిడి నుంచి వెంటనే తేరుకున్న ఫ్రాన్స్.. 27వ నిమిషంలో తొలి గోల్ చేసింది. ఆడ్రియన్ రాబియట్ ఈ గోల్ సాధించాడు. దీంతో రెండు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. మరో ఐదు నిమిషాల తర్వాత ఫ్రాన్స్ స్టార్ ఆలివియర్ గిరోడ్ మరో గోల్ చేశాడు. ఈ గోల్ సాయంతో ఫ్రాన్స్ ఈ మ్యాచ్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే స్కోరుతో మ్యాచ్ తొలి అర్ధభాగం ముగిసింది.
సెకండ్ హాఫ్‌లో పూర్తి ఆదిపత్యం ప్రదర్శించిన ఫ్రాన్స్ జట్టు మంచి కమాండ్ కనబరిచింది. మంచి అవకాశాలు సృష్టించుకుంది. అయితే ఇవేమీ చివరకు ఫలించలేదు. అలాంటి సమయంలో 68వ నిమిషంలో ఎంబాపే అద్భుతమైన హెడర్‌తో మరో గోల్ చేశాడు. దీంతో 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఫ్రాన్స్. ఇది జరిగిన ఐదు నిమిషాల వ్యవధిలోనే మరోసారి ఆలివియర్ గిరోడ్ సత్తా చాటాడు. మరో గోల్ చేశాడు. ఇదే ఈ మ్యాచ్‌లో చివరి గోల్. దీంతో ఆరంభంలో ప్రత్యర్థిదే పైచేయి అయినప్పటికీ చివరకు ఫ్రాన్స్ జట్టు విజయకేతనం ఎగురవేసింది.
ఇక, నిన్న జరిగిన మరో రెండు మ్యాచులు డ్రాగా ముగిశాయి. గ్రూప్ సిలో భాగంగా మెక్సికో, పోలెండ్ ల మధ్య జరిగిన మధ్య 0-0 తేడాతో టైగా ముగిసింది. రెండు జట్లు గోల్స్ కోసం ప్రయత్నించనప్పటికీ .. డిఫెన్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో చివరికి మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో.. రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. గ్రూప్ -డిలో భాగంగా డెన్మార్క్, ట్యూనీషియాల మధ్య జరిగిన మ్యాచ్ కూడా టైగా ముగిసింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA, FIFA World Cup 2022, Foot ball, Lionel Messi