ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022) హోరాహోరీగా సాగుతుంది. ఈ మెగాటోర్నీలో ఇప్పటికే చాలా సంచలనాలు నమోదు అయ్యాయి. ఇప్పుడు నాకౌట్ దశలో అసలు సిసలైన సంచలనం నమోదైంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్.. షూటౌట్లో ఘోరంగా తడబడి ఇంటిముఖం పట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో క్రొయేషియా 1-1 (4-2)తో సాంబా జట్టును ఓడించింది. మ్యాచ్ అదనపు సమయం వరకు సాగినా.. ఇరుజట్లూ అక్కడ కూడా సమానమైన గోల్స్ చేయడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. క్రొయేషియా రక్షణ శ్రేణి చాలా బలంగా నిలబడి బ్రెజిల్‌కు చెక్ పెట్టింది. ఆ జట్టు గోల్ కీపర్ లివకోవిచ్ నిర్ణీత సమయంలోనే కాక.. పెనాల్టీ షూటౌట్లోనూ అదరగొట్టి మ్యాచ్ హీరోగా నిలిచాడు. దీంతో.. బ్రెజిల్ జట్టుకు క్రొయేషియా పెనాల్టీ షూటౌట్లో 4-2తో షాకిచ్చింది. దీంతో... ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో పోరాటాన్ని అణువణువున ఒంట పట్టించుకున్న క్రొయేషియా టైటిల్ వేటలో మరింత ముందడుగు వేసింది.
మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లూ గోల్స్ కొట్టలేకపోగా.. అదనపు సమయంలో తలో గోల్ సాధించాయి. బంతిపై ఇరు జట్లూ సమానంగా నియంత్రణ సాధించినా.. మ్యాచ్‌లో గోల్ లక్ష్యంగా ఎక్కువ షాట్లు ఆడింది బ్రెజిలే. నెయ్మార్ సహా బ్రెజిల్ ఆటగాళ్లు పలుమార్లు బంతిని నెట్లోకి పంపేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. కానీ, క్రొయేషియా రక్షణ శ్రేణి అడ్డుగోడగా నిలవడంతో బ్రెజిల్ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
Croatia advance to the Semi-final! ????@adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022
పెనాల్టీ షూటౌట్ సాగిందిలా..
తొలి ప్రయత్నంలో వ్లాసిచ్ గోల్ కొట్టి క్రొయేషియాను ఆధిక్యంలో నిలపగా.. రోడ్రిగో విఫలమవడం బ్రెజిల్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. రోడ్రిగో నెట్ కొట్టిన షాట్‌ను సరిగ్గా అంచనా వేసిన లివకోవిచ్ అద్భుత డైవ్‌తో ఆపేశాడు. తర్వాతి రెండు ప్రయత్నాల్లో ఇరు జట్లూ విజయవంతమయ్యాయి. నాలుగో ప్రయత్నంలో ఓర్సిచ్ గోల్ కొట్టి క్రొయేషియాను 4-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లగా.. మార్కినో కొట్టిన షాట్ ఎడమవైపు గోల్ బార్‌ను తాకి బయటికి వచ్చేయడంతో బ్రెజిల్ కథ ముగిసింది.
అంతకుముందు నిర్ణీత సమయం, ఇంజురీ టైంలో ఇరు జట్లూ గోల్స్ కొట్టలేకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. కాసేపటికే నెయ్మార్ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 106వ నిమిషంలో క్రొయేషియా బాక్స్ చివర్లో బంతిని చేజిక్కించుకున్న నెయ్మార్.. మెరుపు గోల్ కొట్టాడు. అయితే ఈ ఆనందం పది నిమిషాల్లో ఆవిరి అయింది. 115వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు పెట్కోవిచ్ స్కోరు సమం చేశాడు. పెట్కోవిచ్ కొట్టిన షాటే రీబౌండ్ అయి రాగా.. తిరిగి దాన్ని ఓర్సిచ్అతడివైపు నెట్టాడు. ఈసారి పెట్కోవిచ్ ఏ తప్పూ చేయకుండా గోల్ కొట్టేశాడు.
Livakovic: Endgame
— FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022
ఇక, ఫిఫా ప్రపంచకప్ సెమీస్‌లో క్రొయేషియా అడుగుపెట్టడం ఇది మూడో సారి. వరుసగా రెండో సారి. మొదటగా 1998లో సెమీస్ చేరింది. 2014 (సెమీస్‌లో ఓటమి) మినహా గత అయిదు ప్రపంచకప్‌ల్లో బ్రెజిల్ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించడం ఇది నాలుగో సారి. ఫిఫా ప్రపంచకప్‌లో నాలుగింటికి నాలుగు సార్లు క్రొయేషియా పెనాల్టీ షూటౌట్లో విజేతగా నిలిచింది. మరోవైపు బ్రెజిల్ నాలుగింటిలో మూడు విజయాలు అందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brazil, FIFA World Cup 2022, Foot ball, Football