ఆసియా జట్టు జపాన్ శుభారంభం

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో కొలంబియాను ఓడించిన తొలి ఆసియా దేశపు జట్టుగా జపాన్ అరుదైన రికార్డు సృష్టించింది.

news18
Updated: June 19, 2018, 11:16 PM IST
ఆసియా జట్టు జపాన్ శుభారంభం
ఫిఫా వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లో కొలంబియాపై 2-1 తేడాతో జపాన్ విజయం
  • News18
  • Last Updated: June 19, 2018, 11:16 PM IST
  • Share this:
యూరోపియన్ దేశాల హవా సాగుతున్న ఫిఫా ప్రపంచకప్‌-2018లో ఆసియా జట్టు జపాన్‌ శుభారంభం చేసింది. గ్రూపు-హెచ్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కొలంబియాను 2-1తో జపాన్ చిత్తుగా ఓడించింది. గ్రూప్ ఫ్యావరెట్‌గా బరిలోకి దిగిన కొలంబియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్‌ ఆరంభమైన మూడో నిమిషంలోనే పెనాల్టీ ప్రాంతంలో కొలంబియా ఆటగాడు సాంచెజ్‌ బంతిని ఉద్దేశపూర్వకంగా చేతితో అడ్డుకొన్నాడు. దీంతో రిఫరీ రెడ్‌కార్డు చూపించడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా రెడ్ కార్డుని ఎదుర్కొన్న ఆటగాడిగా సాంచెజ్ చెత్త రికార్డును సృష్టించుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ అంతా కొలంబియా జట్టు కేవలం 10 మందితోనే మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి నెలకొంది.

అద్భుత పోరాటం ప్రదర్శించిన జపాన్ జట్టు పెనాల్టీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. జపాన్‌ మిడ్‌ఫీల్డర్‌ షింజి కగవా పెనాల్టీని గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాతి నుంచి మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. బంతిని నియంత్రణలో ఉంచుకునేందుకు ఇరు జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. 59 శాతం మేర జపాన్ జట్టు బంతిని తమ నియంత్రణలో ఉంచుకుని కొలంబియా గోల్ ‌పోస్ట్‌పై దాడి చేసింది. ఈ క్రమంలోనే 39వ నిమిషంలో కొలంబియా మిడ్‌ఫీల్డర్‌ క్విన్‌ట్రో నేరుగా ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచి 1-1కి స్కోరు సమం చేశాడు.

ఆ తర్వాత ద్వితీయార్థంలోనూ మ్యాచ్‌ హోరాహోరీగానే సాగింది. అయితే 73వ నిమిషంలో జపాన్‌ ఫార్వర్డ్‌ర్‌ ఒసాకో హెడర్‌ గోల్‌తో జపాన్‌ ఆధిక్యాన్ని 2-1కి చేర్చాడు. మ్యాచ్‌ను సమం చేయడానికి కొలంబియా మ్యాచ్ చివర్లో జోరు పెంచినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు మ్యాచ్‌ సమయం కూడా ముగియడంతో జపాన్‌ తొలిసారిగా కొలంబియాపై 2-1తో గెలిచినట్లయింది. మొత్తంగా జపాన్ 14 సార్లు గోల్‌ కోసం ప్రయత్నించగా.. కొలంబియా 8 సార్లు మాత్రమే ఆ ప్రయత్నం చేసింది.  ఆసియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు.
Published by: Janardhan V
First published: June 19, 2018, 9:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading