ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ (Australia Vs England) క్రికెట్ జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ (Ashes Series) లో ఆసీస్ దుమ్మురేపింది. యువ బౌలర్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) నాయకత్వంలోని ఆసీస్ 146 పరుగుల తేడాతో ఐదో టెస్టులో విజయం సాధించింది. దీంతో ఐదు టెస్ట్ ల సిరీస్ 4-0 తేడాతో గెలుచుకుని శభాష్ అన్పించుకుంది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీలో ఎంజాయ్ చేస్తూ సంతోషంలో మునిగితేలారు. వీళ్లు ఆనందంతో తాగితే... ఇంగ్లండ్ క్రికెటర్లు ఓటమి బాధతో బాటిళ్లు చేతబట్టారు. ఏదైనా సరే ఓ లిమిట్ లో వరకే కదా సాఫీగా సాగేది. ఒక్కసారి అదుపు తప్పితే ఇక అంతే సంగతులు. విమర్శల పాలు కాక తప్పదు. ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏకంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి హోటల్ నుంచి వెళ్లగొట్టే దుస్థితి తెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకెళితే.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, పేసర్ జేమ్స్ అండర్సన్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు అలెక్స్ క్యారీ, నాథన్ లయన్, ట్రావిస్ హెడ్ సహా పలువురు ఆటగాళ్లు హోటల్లో పీకల్‌దాక తాగి రచ్చ చేశారు. వారి అల్లరికి విసిగిపోయిన హోటల్లోని ఇతరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు స్వీట్ వార్నింగ్ ఇచ్చి ఆటగాళ్లను అక్కడి నుంచి పంపించేసారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
"మీ అల్లరి మరీ ఎక్కువైంది. తొందరగా ప్యాక్ చేసుకోవాలి. అందుకే మేమిక్కడి వచ్చాం. వెళ్లి నిద్రపోండి.. థాంక్యూ.." అంటూ అక్కడికి వచ్చిన ఓ పోలీసు.. క్రికెటర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులు అలా హెచ్చరించడంతో ఆటగాళ్లు ఒక్కొక్కరు మెల్లగా అక్కడ్నుంచి జారుకున్నారు.
The first and last time #Hobart will host an #Ashes test… ‘Bit too loud’ .. Awesome pic.twitter.com/zdZ4dmcsf6
— Matt de Groot (@mattdegroot_) January 18, 2022
ఇక ఇదే విషయమై టాస్మానియా పోలీసులు స్పందిస్తూ.. " క్రౌన్ ప్లాజా హోబర్ట్ నుంచి సోమవారం ఉదయం ఫిర్యాదు అందింది. కొంతమంది తాగిన మత్తులో అక్కడ రభస చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వాళ్లు చెప్పారు. ఉదయం 6 గంటలకు అక్కడికి వెళ్లిన మా పోలీసులు వాళ్లను అక్కడ్నుంచి పంపించారు.అంతకుమించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.." అని తెలిపారు. కాగా ఇప్పటికే సిరీస్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న రూట్.. ఈ ఘటనతో విమర్శల పాలయ్యాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే.. ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనపై ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) విచారణకు ఆదేశించింది.ఇక సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు క్రేజ్ ఉందని, ఆటగాళ్లను చాలా మంది యువత ఆరాధ్య దైవంగా భావిస్తుందని, అలాంటి స్టార్ క్రికెటర్లు ఇలా హద్దులు ధాటి ప్రవర్తిస్తే వారు ఎలా అర్థం చేసుకుంటారు? అనే విమర్శలు వస్తున్నాయి. సోయి మరిచేదాకా తాగి, ఇబ్బందులు తెచ్చుకోవద్దని ఇరు జట్ల అభిమానులు తమ ఆటగాళ్లకు సూచిస్తున్నారు.ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. వరుసగా మూడు విజయాలతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకున్న కమిన్స్ సేన.. నాలుగో టెస్ట్ డ్రా అయినా చివరి మ్యాచ్‌లో గెలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.