సినిమా స్టార్లు, క్రికెటర్ ప్లేయర్స్‌ను నేరుగా కలవాలని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఛాన్స్ దొరికితే సెల్ఫీలు తీసుకుంటారు. ఆటోగ్రాఫ్‌లు అడుగుతారు. అలాంటిది మన టేబుల్ పక్కనే క్రికెటర్స్ అంతా కూర్చొని భోజనం చేస్తుంటే.. ! ఎంతో బాగుంటుంది కదా..! ఈ సీన్‌ను చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అచ్చం ఇలాంటి అనుభవమే ఓ అభిమానికి ఎదరయింది. ఇండియన్ క్రికెటర్లు తన పక్కనే కూర్చొని భోజనం చేస్తున్నాడని తెలిసి ఉబ్బితిబ్బిపోయాడు. ఆ సంతోషంలో వారి రెస్టారెంట్ బిల్లును కూడా ఇతడే కట్టాడు. ప్రస్తుతం ఆ వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బాక్సింగ్ డే టెస్ట్‌లో విజయం తర్వాత టీమిండియా క్రికెటర్లు కాస్త రిలాక్స్ అయ్యారు. మ్యాచ్ అనంతరం మెల్బోర్న్ వీధుల్లో తిరిగారు. ఓ రెస్టారెంట్‌కు వెళ్లి తమకు ఇష్టమైన ఫుడ్‌ను లాగించేశారు. ఐతే ఆ హోటల్లో వారు కూర్చున్న టేబుల్ పక్కనే నవలదీప్ సింగ్ అనే ఇండియన్ కూర్చున్నాడు. టీమిండియా క్రికెటర్లు అక్కడే ఉన్నారని తెలిసి అతడు ఎంతో సంతోషపడ్డాడు. వారు భోజనం చేస్తుండగా వీడియో తీశాడు. అందులో రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, నవదీప్ సైని కనిపించారు. ఐతే వారి భోజనం ఇక పూర్తయిందనుకున్న సమయంలో.. నవల్దీప్ సింగ్ నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి బిల్లు కట్టాడు. ఈ విషయం క్రికెటర్లకు తెలియదు.
తాను కట్టిన బిల్లు ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నవల్దీప్ సింగ్. మా సూపర్ స్టార్స్‌కు నేను చేయగలిగింది ఇదే అని పేర్కొన్నాడు.
భోజనం పూర్తయ్యాక టీమిండియా క్రికెటర్లు కౌంటర్ వద్దకు వెళ్లి బిల్లు కట్టేందుకు ప్రయత్నించారు. ఐతే మీ బిల్లును ఆ వ్యక్తి కట్టాడని నవల్దీప్ సింగ్ వైపు చూపించారు హోటల్ సిబ్బంది. అనంతరం రోహిత్ శర్మ తన దగ్గరకు వచ్చి.. డబ్బులు తీసుకో బ్రదర్, బాగోదు అని చెప్పినట్లు నవల్దీప్ తెలిపాడు. రిషబ్ పంత్ తనను హగ్ చేసుకున్నాడని తెలిపాడు. క్రికెటర్లను కలుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. లంచ్ స్పాన్సర్ చేసినందుకు అందరూ థ్యాంక్స్ చెప్పినట్లు ట్విటర్లో వివరించాడు.
Published by:Shiva Kumar Addula
First published:January 02, 2021, 09:09 IST