Cricket: క్రికెట్ లో హాట్ టాపిక్ గా అవినీతి ఆరోపణలు..ఆ ఉదంతంతో మసకబారిన కీర్తి..

ప్రతీకాత్మక చిత్రం

Cricket: క్రీడల్లో బుకీల ప్రయత్నాలు, ఆటగాళ్లను ప్రలోభాలకు గురిచేయడం వంటివి కొత్త కాదు. కానీ వీటి గురించి బయటకు తెలిసిన ప్రతిసారీ గొప్ప వ్యక్తులుగా చెలామనీ అవుతున్న వ్యక్తులే మోసాలకు పాల్పడుతున్నట్టు ప్రజలకు తెలుస్తోంది. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం మొదటిసారి బయటపడింది. అప్పట్లో ఎంతోమంది ప్రముఖ క్రికెటర్ల పేర్లు బయటకు వచ్చాయి.

  • Share this:
(Ayaz Memon, Indian Writer)

ప్రపంచ క్రికెట్‌లో మరోసారి అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ వార్తలు దుమారం లేపుతున్నాయి. జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్‌ హీత్ స్ట్రీక్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ- ఐసీసీ ఎనిమిది సంవత్సరాలు నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక నియమాలను అతడు ఐదుసార్లు ఉల్లంఘించినట్లు సంస్థ తేల్చింది. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సైతం అతడు సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ స్ట్రీక్ ఒప్పుకున్న తరువాత ఐసీసీ అతడిపై నిషేధం విధించింది. ఈ క్రమంలో అందరి దృష్టి ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై పడింది. లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతిని నిరోధించడం వంటి అంశాలపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో అవినీతి రహస్యంగా కొనసాగుతోందని చాలామంది భావిస్తున్నారు. హీత్ స్ట్రీక్ 2017 సెప్టెంబర్ నుంచి 15 నెలల కాలంలో ఐదుసార్లు ఐసీసీ అవినీతి నిరోధక నియమాలను ఉల్లంఘించాడని సంస్థ తేల్చింది. ఈ సమయంలో అతడు వివిధ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఆఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్, 2018లో బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్, 2018లో ఆఫ్గానిస్థాన్, జింబాబ్వే సిరీస్, ఐపీఎల్‌- 2018 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో అతడు ఐసీసీ అవినీతి నిరోధక నియమాలను ఉల్లంఘించాడని తేలింది. ఈ ఆరోపణలను ముందు నుంచి కొట్టిపారేస్తున్న స్ట్రీక్, ఎట్టకేలకు ఇవన్నీ నిజాలేనని ఒప్పుకున్నాడు.

* పాతుకుపోయిన అవినీతి
ఐపీఎల్‌తో పోలిస్తే హీత్ స్ట్రీక్ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించిన ఇతర మ్యాచ్‌ల పరిధి, ప్రభావం తక్కువగా ఉంది. కానీ క్రికెట్‌లో అవినీతి లోతుగా పాతుకుపోయిందని ఈ ఉదంతం నిరూపిస్తోంది. క్రికెట్‌ ప్రపంచంలో ఎక్కడ వీలైతే అక్కడ నియమాల ఉల్లంఘన, అవినీతి, ఫిక్సింగ్ జరుగుతున్నాయని ఈ సంఘటన చెబుతోంది. బూకీలతో సంప్రదింపులు, బూకీలను ఆటగాళ్లకు పరిచయం చేయడం, ఆటకు సంబంధించిన విషయాలను బయటి వ్యక్తులకు చేరవేయడం వంటివి స్ట్రీక్‌పై వచ్చిన ప్రధాన ఆరోపణలు. అతడు ఒక బూకీతో చేసిన చాటింగ్‌ను ఐసీసీ సేకరించింది. ఒక జాతీయ క్రికెట్‌ జట్టు కెప్టెన్, మరో నలుగురు ఆటగాళ్లకు బుకీలను పరిచయం చేయడానికి స్ట్రీక్ ప్రయత్నించాడని ఐసీసీ పేర్కొంది.

* కట్టడి చర్యలేవి?
సుమారు 20 ఏళ్ల క్రితం క్రికెట్‌లో అతిపెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఈ సంఘటన క్రికెట్ ఆడే దేశాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆ తరువాత కూడా రెండు సార్లు ఆటలో ఫిక్సింగ్ ఆరోపణలు నిరూపితమయ్యాయి. కానీ ఇప్పటికీ తెరవెనుక ఫిక్సింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయని స్ట్రీక్‌ విషయం నిరూపిస్తోంది. తాజా ఉదంతం అతి పెద్ద ఘటనగా చెప్పుకోవాలి. ఎందుకంటే స్ట్రీక్ వివిధ టోర్నీల్లో అవినీతికి యత్నించాడు. అంటే కొత్తగా పుట్టుకొస్తున్న టీ20 టోర్నీలతో పాటు ఆటలో అవినీతి కూడా పెరుగుతోందని నిర్వాహకులు గుర్తించాలి. ఈ టోర్నమెంట్లలో ఎక్కువ మంది ఆటగాళ్లు, వ్యక్తులు, సిబ్బంది పాల్గొంటున్నారు. దీంతో అవినీతికి అవకాశం కూడా పెరుగుతోంది. ఫలితంగా అవినీతిని ఎదుర్కోవడం నిర్వాహకులకు ఇబ్బందిగా మారుతోంది.

* కఠినమైన నియమాలు అవసరం
హీత్ స్ట్రీక్ ఏకంగా 15 నెలల పాటు వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. వివిధ దేశాల్లో నిర్వహించిన టోర్నీలకు ఆరోపణలతో సంబంధం ఉంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న క్రికెట్ నియమ నిబంధనలను మరింత కఠినంగా మార్చాల్సిన అవసరం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఐసీసీ అమలు చేస్తున్న అవినీతి వ్యతిరేక చర్యలను బలోపేతం చేయడం, వాటిని కచ్చితంగా అమలు చేసేలా అన్ని క్రికెట్ బోర్డులను ఆదేశించడం ద్వారా ఆటలో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చు.

* ఆటగాళ్లకు కూడా సంబంధం
బుకీలతో పాటు ఏకంగా ఒక జాతీయ జట్టు కెప్టెన్‌, మరో నలుగురు ఆటగాళ్ల పేర్లు కూడా తాజా కేసులో బయటకు రావడం ఆందోళనకరమైన అంశం. ఇంకా ఎక్కువ మంది ఆటగాళ్లకు ఇలాంటి చర్యలతో సంబంధం ఉండవచ్చని భావిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి వంటివి ఆటలో ఎంత విస్తృతంగా పాతుకుపోయాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎంతమంది ఆటగాళ్లు అవినీతికి యత్నించారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. కానీ సరైన సాక్ష్యాలు లేనందువల్ల కేసు కోర్టుల్లో నిలిచే అవకాశం లేదు. అందుకే ఆరోపణలను వచ్చిన కొందరి పేర్లను ఐసీసీ ప్రకటించలేదు. స్ట్రీక్ విషయంలో మాదిరిగానే పూర్తి స్థాయిలో విచారణ చేస్తే.. క్రికెట్‌లో మోసాలకు పాల్పడుతున్న ఎంతోమంది వ్యక్తుల గురించి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

క్రీడల్లో బుకీల ప్రయత్నాలు, ఆటగాళ్లను ప్రలోభాలకు గురిచేయడం వంటివి కొత్త కాదు. కానీ వీటి గురించి బయటకు తెలిసిన ప్రతిసారీ గొప్ప వ్యక్తులుగా చెలామనీ అవుతున్న వ్యక్తులే మోసాలకు పాల్పడుతున్నట్టు ప్రజలకు తెలుస్తోంది. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం మొదటిసారి బయటపడింది. అప్పట్లో ఎంతోమంది ప్రముఖ క్రికెటర్ల పేర్లు బయటకు వచ్చాయి. కానీ స్ట్రీక్ విషయంలో ఇలా జరగలేదు. ఎందుకంటే అతడు చాలా ఏళ్ల క్రితం ఆట నుంచి రిటైర్ అయ్యాడు.

హీత్‌స్ట్రీక్‌పై 8 ఏళ్ల నిషేధాన్ని విదించిన ఐసీసీ [PC: iplt20.com]

* గొప్ప ఆటగాళ్లలో ఒకడు
జింబాబ్వే తరఫున ఆడిన గొప్ప క్రికెటర్లలో హీత్ స్ట్రీక్ ఒకడు. సంక్షోభం ఎదురైన ప్రతిసారీ జింబాబ్వే క్రికెట్‌కు అండగా నిలిచాడు. ఆ దేశ జాతీయ జట్టుకు కెప్టెన్ కూడా అయిన స్ట్రీక్, అప్పట్లో ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు సాధించాడు. జింబాబ్వే క్రికెట్ బోర్డులో రాజకీయాల కారణంగా స్ట్రీక్ కెరీర్‌ తగ్గిపోయింది. అప్పట్లో ఆ దేశ క్రికెట్ బోర్డు పేలవ పనితీరు కారణంగా చాలామంది క్రికెటర్లు ఆటకు దూరమయ్యారు. కొంతమంది వేరే దేశాలకు ఆడాలనుకున్నారు. అలాంటి సందర్భంలో దేశంలో ఆటకు మద్దతుగా నిలిచిన కొందరు ప్రముఖుల్లో స్ట్రీక్ ఒకరు. అలాంటి వ్యక్తి ఆ తరువాత అవినీతికి పాల్పడటం నమ్మశక్యం కాని విషయం.

* మసకబారిన కీర్తి
ఆట నుంచి రిటైర్ అయిన తరువాత స్ట్రీక్ కోచ్‌గా జింబాబ్వే క్రికెట్‌కు సేవలందించాడు. ఆ తరువాత ఇతర దేశాల క్రికెట్‌ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. అతడు ఆర్థికంగా ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా లేవు. బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న స్ట్రీక్.. ప్రొఫెషనల్ ఆటగాడిగా మంచి ఆదాయం సంపాదించాడు. రిటైర్మెంట్ తరువాత కోచ్‌గా ఎంతో సంపాదించాడు. అలాంటి వ్యక్తి డబ్బు కోసం ఆటలో సాధించిన కీర్తిని పణంగా పెట్టడం బాధాకరమైన విషయం. ఐసీసీ ఆరోపణలు, నిషేధంతో క్రికెట్‌లో అతడి ఖ్యాతి పూర్తిగా మసకబారిపోయిందని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
Published by:Sridhar Reddy
First published: