హోమ్ /వార్తలు /క్రీడలు /

Cricket in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చినా.. ఈ దేశం మాత్రం అర్హత సాధించడం కష్టం.. ఎందుకంటే!

Cricket in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చినా.. ఈ దేశం మాత్రం అర్హత సాధించడం కష్టం.. ఎందుకంటే!

క్రికెట్

క్రికెట్

క్రికెట్‌లో ఒలింపిక్స్ చేర్చాలని ఎప్పటి నుంచో కసరత్తు చేస్తున్నారు. 2028 లాస్ ఏంజెల్స్ లేదా 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, క్రికెట్‌ను చేర్చినా ఒక దేశం మాత్రం ఆడేందుకు అర్హత సాధించలేదు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

ప్రస్తుతం టోక్యోలో విశ్వక్రీడల (Tokyo Olympics) సంబురం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగిన క్రీడల్లో అనేక మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఫుట్‌బాల్, హాకీ, బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి పాపులర్ గేమ్స్‌తో పాటు బీచ్ వాలీబాల్ వంటి సరదా ఆటలకు కూడా ఒలింపిక్స్‌లో చోటు ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ తర్వాత అత్యంత ఎక్కువ మంది చూసే క్రికెట్‌కు మాత్రం ఒలింపిక్స్‌లో చోటే లేకుండా పోయింది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆధునిక ఒలింపిక్స్‌లో కేవలం ఒకే ఒక్కసారి క్రికెట్‌కు (Cricket) చోటు దక్కింది. 1900 పారీస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics) గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఒలింపిక్స్‌లో తలపడ్డాయి. ఫ్రాన్స్ జట్టులో కూడా సగం మంది బ్రిటిష్ ప్లేయర్లే ఆడారు. ఒక్కో జట్టులో 12 మంది చొప్పున.. 24 మంది ఈ మ్యాచ్‌లో ఆడారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు హాఫ్ సెంచరీలు, రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదయ్యాయి. బ్రిటన్ పేరు మీద ఒలింపిక్స్‌లో ఆడింది డెవాన్ అండ్ సోమర్‌సెట్ వాండరర్స్ క్లబ్ ఆటగాళ్లే. ఇక బ్రిటన్‌కు చెందిన మరి కొంత మంది.. ప్యారీస్‌కు చెందిన కొంత మంది కలసి ఆల్ ప్యారీస్ టీమ్‌గా బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో బ్రిటన్ గెలిచింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌లో ఏకైక స్వర్ణం బ్రిటన్ పేరు మీద నిలిచిపోయింది.

గత కొన్నాళ్లుగా క్రికెట్‌ను కూడా ఒలింపిక్స్‌లో చేర్చాలనే డిమాండ్ పెరుగుతున్నది. గతంలో టెస్టులు, వన్డేల వల్ల సమయాభావం కారణంగా క్రికెట్‌ను చేర్చడం కష్టమని భావించారు. కానీ ఇప్పుడు టీ20లు రాజ్యమేలుతున్నాయి. టీ10 క్రికెట్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో కొన్నాళ్లుగా ఐసీసీ కూడా ఒలింపిక్స్‌లో చేర్చే విషయంపై చర్చలు జరుపుతున్నది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చాలనే డిమాండ్ పెరిగింది. మరోవైపు 2032 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు బ్రిస్బేన్ వేదిక ఖరారయ్యింది. ప్రఖ్యాత గబ్బా క్రికెట్ స్టేడియం ఇక్కడే ఉన్నది. దీంతో 2032 ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి చేరడం ఖాయమనే అందరూ భావిస్తున్నారు.

కాగా, ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న దేశాల్లో ఒలింపిక్స్‌కు వెళ్లడానికి అన్ని దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. కానీ ఒక దేశానికి మాత్రం ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడే అవకాశం రావడం చాలా కష్టం. ఎందుకంటే అసలు అది దేశమే కాదు. క్రికెట్‌ను ఒకప్పుడు శాసించిన వెస్టిండీస్ ఒలింపిక్స్‌లో అర్హత సాధించే అవకాశం లేదు. ఎందుకంటే ఒలింపిక్స్‌ను దేశాల వారీగా నిర్వహిస్తారు. కానీ, వెస్టిండీస్ అనేది కేవలం క్రికెట్ కోసం ఏర్పడిన దేశాల కూటమి మాత్రమే. క్రికెట్ వరల్డ్ కప్‌లో కూడా వెస్టిండీస్‌ను దేశంగా పరిగణించరు. అది ఐసీసీ గుర్తించిన ఒక క్రికెట్ సంఘంగానే గుర్తిస్తారు. వెస్టిండీస్ జెండా, గీతం అంతా క్రికెట్ కోసం ఏర్పాటు చేసుకున్నవే.

వెస్టిండీస్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా, బార్బడోస్, డోమినికా, గ్రెనెడా, గయానా, జమైకా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సెయింట్ కిట్స్ అండ్ నెవీస్‌తో పాటు అనేక బ్రిటిష్ ఆధీనంలోని దీవులకు చెందిన క్రికెటర్లు ఉంటారు. అయితే ఈ దేశాల్లో ఉండే ఇతర అథ్లెట్లు ఆ దేశం తరపునే ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. ఒలింపిక్స్‌లో ఎన్నో స్వర్ణాలు గెలిచిన ఉసేన్ బోల్ట్ జమైకాకు చెందిన అథ్లెట్. ఆ దేశం తరపునే అథ్లెటిక్స్‌లో ఎన్నో పతకాలు గెలిచాడు. కానీ అదే జమైకా వెస్టిండీస్ టీమ్‌లో భాగం. ఇదే అతిపెద్ద సమస్య. అయితే ఐసీసీ జట్టుగా వెళ్లే వెసులు బాటు మాత్రం ఉంటుంది. పలు దేశాలకు చెందిన శరణార్దులు ఇప్పడు ఐవోసీ తరపున ఒలింపిక్స్‌లో ఎలా పాల్గొంటున్నారో.. అలాగే వెస్టిండీస్ జట్టు ఐసీసీ తరపున ఆడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

First published:

Tags: Cricket, ICC, IOC, Olympics, Tokyo Olympics, West Indies

ఉత్తమ కథలు