ENGLAND VS INDIA AFTER 31 YEARS INDIA CREATED A RARE RECORD TEAM INDIA CAPTAIN VIRAT KOHLI RECORD IN ENGLAND AFTER DHONI JNK
India Won 2nd Test: పాకిస్తాన్లో 31 ఏళ్ల క్రితం రికార్డు లార్డ్స్‌లో బ్రేక్.. కెప్టెన్సీలో కోహ్లీ రికార్డులు తెలుసా?
లార్డ్స్‌లో టీమ్ ఇండియా రికార్డులు ఇవే (PC: BCCI)
భారత క్రికెట్ జట్టు 31 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఘనత సాధించింది. అప్పట్లో సచిన్ టెండుల్కర్ అరంగేట్రం టెస్టులో జరిగిన సీనే తిరిగి 31 ఏళ్ల తర్వాత లార్డ్స్‌లో పునరావృతం కావడం గమనార్హం.
భారత క్రికెట్ జట్టు (Team India) ఇంగ్లాండ్ పర్యటనలో (England Tour) తొలి విజయాన్ని అందుకున్నది. లార్డ్స్ వేదికగా (The Lord's) జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 151 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టును కేవలం రెండు సెషన్లలో ఆలౌట్ చేసి సంచలనం సృష్టించింది. అంతకు ముందు భారత జట్టును 200 లోపే ఆలౌట్ చేయాలని భావించిన ఇంగ్లాండ్ జట్టు ఆశలకు బుమ్రా (Jasprit Bumrah), షమీ (Mohammad Shami) తూట్లు పొడిచారు. అనుభవం ఉన్న బ్యాట్స్‌మెన్‌లా ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకొని పడి 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించారు. దీంతో ఇంగ్లాండ్ ఎదుత 272 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. రెండు సెషన్లలో ఈ స్కోర్ ఛేదించలేమని తెలిసిన ఇంగ్లాండ్ జట్టు పూర్తి డిఫెన్సీవ్‌గా ఆడటం మొదలు పెట్టింది. 1 పరుగుకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఫీల్డింగ్‌లో రెండు క్యాచ్‌లు వదిలేసినా.. బౌలర్లు మాత్రం తమ పంతం వీడకుండా వికెట్ల కోసం చాలా కష్టపడ్డారు. దీంతో కీలకమైన జో రూట్ (Joe Root), జానీ బెయిర్‌స్టో వికెట్లు లభించాయి. కీలకమైన చివరి సెషన్లో మ్యాచ్ డ్రా కోసం ఇంగ్లాండ్ బ్యాట్స్మాన్ జాస్ బట్లర్ తీవ్రంగా ప్రయత్నించాడు. మొయిన్ అలీ, సామ్ కర్రన్ వికెట్లను వరుస బంతుల్లో మహ్మద్ సిరాజ్ తీశాడు. చివర్లో జాస్ బట్లర్, అండర్సన్ వికెట్లను ఓకే ఓవర్లో తీసి భారత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో పేసర్లే అన్ని వికెట్లు పడగొట్టడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 4, ఇషాంత్ శర్మ 3, షమి 2 వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 4 వికెట్లు, బుమ్రా 3, ఇషాంత్ 2, షమి 1 వికెట్ తీశాడు.
టీమ్ ఇండియా టెస్టు చరిత్రలో స్పిన్నర్ ఒక్క వికెట్ కూడా తీయని టెస్టుగా ఇది రికార్డులకు ఎక్కింది. అంతకు ముందు 1989/90లో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన సమయంలో కరాచీ, ఫైసలాబాద్ టెస్టులలో భారత స్పిన్నర్లు ఒక్క వికెట్ కూడా తీయలేదు. వికెట్లన్నీ పేసర్లే రాబట్టారు. ఈ సిరీస్‌లోనే సచిన్ టెండుల్కర్ టెస్టుల్లోకి అరంగేట్రం చేయడం గమనార్హం. మళ్లీ 31 ఏళ్ల తర్వాత భారత జట్టు పేసర్లే అన్ని వికెట్లు పడగొట్టడం విశేషం. మరోవైపు జో రూట్ సెంచరీ చేసిన తర్వాత కూడా ఇంగ్లాండ్ జట్టు ఓడిపోవడం ఇదే తొలి సారి. జో రూట్ 22 సెంచరీలు చేయగా.. 16 సార్లు ఇంగ్లాండ్ జట్టు గెలిచింది. ఐదు సార్లు ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ డ్రా చేసుకుంది. గతంలో గారీ సోబర్స్ 20 సెంచరీల వరకు వెస్టిండీస్ జట్టు ఓటమి పొందలేదు.
కెప్టెన్ కోహ్లీకి టెస్టుల్లో ఇది 37వ విజయం. టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా కోహ్లీ 4వ స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 109 టెస్టుల్లో 53 విజయాలు, ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాటింగ్ 77 టెస్టుల్లో 48 విజయాలు, స్టీవ్ వా 57 టెస్టుల్లో 41 విజయాలు, విరాట్ కోహ్లీ 63 టెస్టుల్లో 37 విజయాలు, వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ 74 టెస్టుల్లో 36 విజయాలు సాధించారు. ఇక లార్డ్స్‌లో టెస్టు విజయం సాధించిన మూడో భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 1986లో కపిల్ దేవ్, 2014లో ఎంఎస్ ధోని విజయాల తర్వాత తాజాగా 2021లో కోహ్లీ విజయం సాధించి అరుదైన రికార్డు సృష్టించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.