Eoin Morgan : భారత్ (India)తో సిరీస్ కు ముందు ఇంగ్లండ్ (England) క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. 2019 వన్డే ప్రపంచకప్ (World Cup)లో ఇంగ్లండ్ ను చాంపియన్ గా నిలిపిన ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించాడు. తొందర్లోనే మోర్గాన్ క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్లు బ్రిటీష్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ది గార్డియన్ అనే పత్రిక మోర్గాన్ జూలై నెలలో క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దాంతో భారత్ తో జరిగే పరిమిత ఓవర్ల సిరీసే మోర్గాన్ కు చివరిదని అంతా భావించారు. కానీ, మోర్గాన్ అనూహ్యంగా తన రిటైర్మెంట్ ను భారత్ తో సిరీస్ కంటే కూడా ముందే ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశాడు.
ఐర్లాండ్ లో పుట్టి.. ఇంగ్లండ్ కెప్టెన్ గా ఎదిగి
ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్ లోని డబ్లిన్ లో జన్మించాడు. మొదట ఆ జట్టు తరఫునే అంతర్జాతీయ కెరీర్ ను ఆరంభించాడు. 2006లో ఐర్లాండ్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ తరఫున మోర్గాన్ 23 వన్డేలు ఆడి 744 పరుగులు సాధించాడు. అనంతరం ఐర్లాండ్ కు గుడ్ బై చెప్పి.. 2010లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ తరఫున ఎంట్రీ ఇచ్చాక మోర్గాన్ కెరీర్ ఊపందుకుంది. మొదట్లో ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా ఉన్న అతడు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ తరఫున రాణించాడు. 2010-12 మధ్య 16 టెస్టులు ఆడిన అతడు 16 మ్యాచ్ ల్లో 700 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. అలెస్టర్ కుక్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ లో మోర్గాన్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. 2016లో జరిగిన టి20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ ను ఫైనల్ వరకు చేర్చాడు. ఇక 2019లో జరిగిన ప్రపంచకప్ లో ఇంగ్లండ్ ను చాంపియన్ గా నిలిపి.. అందని ద్రాక్షలా ఉన్న విశ్వవిజేత అనే ట్యాగ్ ను దక్కేలా చేశాడు. ఇంగ్లండ్ ను అత్యధికంగా 126 వన్డేల్లో కెప్టెన్ గా నడిపించాడు. టి20ల్లో 72 సార్లు ఇంగ్లండ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు.
A leader par excellence! ????
Wish you a happy second innings, @Eoin16 ????#ThankYouMorgs #AmiKKR #EoinMorgan pic.twitter.com/dLIPYLjbUL
— KolkataKnightRiders (@KKRiders) June 28, 2022
ఆటగాడిగా కూడా ఇయాన్ మోర్గాన్ అద్భుతంగా రాణించాడు. 248 వన్డేలు ఆడిన మోర్గాన్ 7,701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు.. 47 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక టి20ల్లో 115 మ్యాచ్ లు ఆడి 2,458 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ లోనూ మోర్గాన్ ఫర్వాలేదనిపించాడు. కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ల తరఫున ఆడిన అతడు.. కేకేఆర్ కు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Dinesh Karthik, England, Hardik Pandya, ICC, ICC Cricket World Cup 2019, India vs england, Team India