ఇంగ్లాండ్ (England) క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Living stone) టీ20 ఇంటర్నేషనల్‌లో ఇంగ్లాండ్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ (Fastest Century) బాదాడు. శుక్రవారం రాత్రి పాకిస్తాన్‌తో (Pakistan) జరిగిన మ్యాచ్‌లో కేవలం 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అయినా సరే ఇంగ్లాండ్ జట్టు 31 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్ బౌలర్లను చితక బాదారు. ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో బౌండరీలు, సిక్సులతో విరుచుకపడ్డారు. 20 ఫోర్లు, 12 సిక్సులతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. పాకిస్తాన్ జట్టుకు టీ20 ఇంటర్నేషనల్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఓపెనర్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ కలసి తొలి వికెట్‌కు 150 పరుగులు జోడించారు. కేవలం 15 ఓవర్లలలోనే 150 పరుగులు రావడంతో పాకిస్తాన్ జట్టు భారీ స్కోరుకు పునాది పడింది. బాబర్ ఆజమ్ 49 బంతుల్లో 85 పరుగులు చేయగా, మహ్మద్ రిజ్వాన్ 41 బంతుల్లో 63 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుటయ్యాక ఫకర్ జమాన్ 8 బంతుల్లో 26 పరుగులు, మహ్మద్ హఫీజ్ 10 బంతుల్లో 24 పరుగులతో చివర్లో మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ కలసి చివర్లో కేవలం 16 బంతుల్లో 46 పరుగులు జోడించారు. దీంతో పాకిస్తాన్ జట్టు టీ20 ఇంటర్నేషనల్‌లో రికార్డు స్కోరు చేసింది.
ఇక 233 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు శుభారంభం లభించలేదు. మొదటి ఏడు ఓవర్లలోనే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రీదీ చెలరేగి 3 వికెట్లు తీశాడు. దీంతో డేవిడ్ మలాన్, జానీ బెయిర్‌స్టోలు తక్కువ స్కోరుకే అవుటయ్యారు. పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ మెరుగుపరుచుకొని ఈ మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకున్నది. అలాగే కీలకమైన రనౌట్లు కూడా చేసింది. మొయిన్అలీ కూడా విఫలమయ్యాడు. జేసన్ రాయ్ (32) వేగంగా ఆడినా భారీ స్కోర్ చేయలేకపోయాడు.
ఇక ఆ తర్వాత వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్ కేవలం 17 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఇంగ్లాండ్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం గమనార్హం. ఆ తర్వాత మరో 25 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. సిక్సులు, బౌండరీలు బాదుతూ ఇంగ్లాండ్ జట్టును దాదాపు గెలిపించినంత పని చేశాడు. అయితే షాహీన్ అప్రీది 17వ ఓవర్లో అతడిని అవుట్ చేశాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 183. కానీ ఆ తర్వాత ఏ బ్యాట్స్మాన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో 201కే ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. పాకిస్తాన్ జట్టు 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.