ENG W vs SA W 2nd Semi Final : సౌతాఫ్రికా (South Africa Women's Team) అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. సొంత ప్రేక్షకుల మధ్య అదరగొట్టారు. చోకర్స్ పేరును చెరిపేసే ప్రదర్శన చేశారు. మహిళల టి20 ప్రపంచకప్ 2023 (Women's T20 World Cup 2023)లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో మాజీ చాంపియన్స్ ఇంగ్లండ్ మహిళల జట్టు (England Women's Team)పై ఘనవిజయం సాధించింది. దాంతో తొలిసారి ఒక మెగా ఈవెంట్ లో ఫైనల్లోకి ప్రవేశించింది. గతంలో 2014, 2020లలో సెమీఫైనల్ వరకు చేరినా ఫైనల్ కు మాత్రం చేరుకోలేకపోయింది. 165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 158 పరుగులు మాత్రమే చేసింది. నాట్ సీవర్ (34 బంతుల్లో 40; 5 ఫోర్లు), డాని వ్యాట్ (30 బంతుల్లో 34; 6 ఫోర్లు), కెప్టెన్ హీథర్ నైట్ (25 బంతుల్లో 31; 2 సిక్సర్లు) పోరాటం సరిపోలేదు. సౌతాఫ్రికా బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ 3 వికెట్లతో చెలరేగి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించింది. అయబొంగ ఖాఖా 4 వికెట్లు తీసింది.
19 ఓవర్లు మిగిసే సరికి ఇంగ్లండ్ జట్టు 7 వికెట్లకు 152 పరుగులకు చేరుకుంది. నెగ్గాలంటే ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాలి. క్రీజులో కెప్టెన్ హీథర్ నైట్ ఉంది. అప్పటికే రెండు భారీ సిక్సర్లు బాదింది. ఆ సమయంలో ఆఖరి ఓవర్ ను వేయడానికి అత్యంత అనుభవం ఉన్న ప్లేయర్ ఇస్మాయిల్ వచ్చింది. అయితే ఇస్మాయిల్ తన మూడో ఓవర్లో ఏకంగా 3 ఫోర్లు సమర్పించుకుంది. దాంతో ఉత్కంఠ తారా స్థాయికి చేరుకుంది. తొలి బంతిని సారా సింగిల్ తీసి స్ట్రయిక్ ను హీథర్ నైట్ కు ఇచ్చింది. అయితే ఇక్కడే ఇస్మాయిల్ తన అనుభవాన్ని అంతా ఉపయోగించింది. పేస్ లో వేరియేషన్స్ చూపిస్తూ హీథర్ నైట్ ను తికమక పెట్టింది. రెండో బంతిని డాట్ చేసింది. మూడో బంతికి నైట్ ను క్లీన్ బౌల్డ్ చేసింది. దాంతో ఇంగ్లండ్ ఆశలు ఆవిరి అయ్యాయి. అయితే 3 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆఖరి మూడో బంతులకు కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి సౌతాఫ్రికాకు అద్భుత విజయాన్ని అందించింది.
ఆదివారం జరిగే ఫైనల్లో 7 సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా తలపడనుంది. ఫైనల్లో ఆసీస్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నా.. సౌతాఫ్రికా ఆఖరి వరకు పోరాడేలా కనిపిస్తుంది. సొంత ప్రేక్షకుల మధ్య తొలిసారి కప్పు గెలిచి హిస్టరీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు లారా వోల్వార్డ్ (44 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్), తాజ్మిన్ బ్రిట్స్ (55 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో మారిజానె క్యాప్ (13 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడుగా ఆడింది. దాంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరును అందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకెల్ స్టోన్ 3 వికెట్లతో రాణించింది. ఆమె మినహా మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: England, South Africa, Womens T20 World Cup