ENG vs PAK Final : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో ఆఖరి పోరాటానికి సమయం ఆసన్నమైంది. మెల్ బోర్న్ (Melbourne)లోని విఖ్యాత ఎంసీజీ (MCG) గ్రౌండ్ లో నవంబర్ 13న జరిగే ఫైనల్లో పాకిస్తాన్ (Pakistan)తో ఇంగ్లండ్ (England) అమీతుమీకి సిద్ధమైంది. న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన సెమీఫైనల్లో పాకిస్తాన్.. భారత్ (India)తో జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించాయి. ఈ రెండు జట్లలో ప్రపంచకప్ నెగ్గిన జట్టు వెస్టిండీస్ సరసన చేరుతుంది. టి20 ఫార్మాట్ లో విండీస్ మాత్రం రెండు పర్యాయాలు ( 2012, 2016లలో) ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ (2009లో).. ఇంగ్లండ్ (2010లో) జట్లు ఒక్కోసారి మాత్రమే టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచాయి. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 1.30లకు ఆరంభం కానుంది. ముఖాముఖి పోరులో ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
టి20 ముఖాముఖి పోరులో ఇంగ్లండ్ దే ఆధిపత్యం. ఇప్పటి వరకు ఇరు జట్లు 28 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. అందులో ఇంగ్లండ్ 18 సార్లు విజేతగా నిలిచింది. పాకిస్తాన్ 9 మ్యాచ్ ల్లో నెగ్గింది. మరో మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. ఇక 2019 నుంచి ఈ రెండు జట్ల మధ్య 14 మ్యాచ్ లు జరగ్గా అందులో ఇంగ్లండ్ 8 మ్యాచ్ ల్లో నెగ్గింది. పాక్ ఐదింటిలో గెలిచింది. మరో మ్యాచ్ రద్దయ్యింది. ఈ ప్రపంచకప్ ముందు ఇరు జట్ల మధ్య పాకిస్తాన్ వేదికగా 7 మ్యాచ్ ల టి20 సిరీస్ జరిగింది. అందులో ఇంగ్లండ్ 4-3తో పాక్ పై గెలిచింది.
పాక్ గెలిస్తే సంచలనమే
ఈ టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ జట్టుది విచిత్రమైన కథ. భారత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో పాక్ ఆఖరి బంతికి ఓడిపోయింది. ఆ తర్వాత జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లోనూ ఓడిపోయింది. దాంతో పాకిస్తాన్ పై సొంత అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శలు చేశారు. అయితే అక్కడి నుంచి అనూహ్యంగా పుంజుకున్న పాకిస్తాన్ వరుసగా మూడు విజయాలు సాధించింది. అదే సమయంలో నెదర్లాండ్స్ రూపంలో లక్ కలిసి రావడంతో సెమీస్ గడప తొక్కింది. ఇక సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై నెగ్గిన పాక్ మూడోసారి ఫైనల్లో ప్రవేశించింది. సూపర్ 12 నుంచే ఇంటిదారి పట్టాల్సిన పాకిస్తాన్.. నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా అనూహ్య ఓటమితో సెమీస్ లో అడుగుపెట్టింది. ఒక వేళ పాక్ ఈ ప్రపంచకప్ లో విజయం సాధిస్తే మాత్రం సంచలనమే అని చెప్పాలి.
వర్షం ముప్పు
ఫైనల్ జరిగే మెల్ బోర్న్ లో నవంబర్ 13, 14వ తేదీల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావారణ శాఖ పేర్కొంది. ఈ టోర్నీలో మెల్ బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లకు వాన ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. ఫైనల్ కు రిజర్వ్ డే ఉంది. ఒక వేళ రిజర్వ్ డే రోజు కూడా వర్షంతో మ్యాచ్ సాధ్యపడకపోతే అప్పుడు రెండు జట్లను ప్రపంచకప్ విజేతలుగా ప్రకటిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, England, Pakistan, T20 World Cup 2022