ENG vs NZ : టెస్ట్ క్రికెట్ లో 125 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన కివీస్ ఓపెనర్.. ఫస్ట్ మ్యాచ్ లోనే ఇరగదీశాడు..

Photo Credit : Twitter

ENG vs NZ : తొలి రోజు ఆటలో సెంచరీతో.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 25 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన కాన్వే.. గురువారం రెండో రోజు ఆటలో తన క్లాస్ ఇన్నింగ్స్ తో మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

  • Share this:
    కివీస్ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ డెవాన్‌ కాన్వే (Devon Conway) అరంగేట్రం మ్యాచ్ తోనే ప్రపంచ క్రికెట్‌ దృష్టిని ఆకర్శించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సూపర్ బ్యాటింగ్‌తో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా సంతతికి చెందిన ఈ కివీస్ ఓపెనర్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిక్స్‌తో తనదైన శైలిలో డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం అయితే.. తన ఇన్నింగ్స్ మొత్తం ఇదే ఫస్ట్ సిక్స్ కావడం మరో విశేషం.తొలి రోజు ఆటలో సెంచరీతో.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 25 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన కాన్వే.. గురువారం రెండో రోజు ఆటలో 125 ఏళ్ల మరో అరుదైన ఘనతను అధిగమించాడు. ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్ర టెస్ట్‌లో అత్యధిక స్కోర్ చేసిన కేఎస్ రంజీత్‌సిన్‌హ్‌జీ(154 నాటౌట్)‌ని తాజా ఇన్నింగ్స్‌తో కాన్వే వెనక్కునెట్టాడు. భారత్‌కు చెందిన రంజీత్‌సిన్‌హ్‌జీ బ్రిటీష్ ఇండియా తరఫున 1896లో ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్‌లో 154 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్‌గా ఉండగా.. తాజాగా కాన్వే బద్దలు చేశాడు. మరోవైపు, లార్డ్స్ వేదికగా తొలి టెస్ట్‌లో తన అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే డబుల్‌ సెంచరీ సాధించి, టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఈ అరుదైన ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో టిప్‌ ఫోస్టర్‌(287), జాక్‌ రుడాల్ఫ్‌(222*), లారెన్స్‌ రోవ్‌(214), మాథ్యూ సింక్లెయిర్‌(214), బ్రెండన్‌ కురుప్పు(201*)లు టెస్ట్‌ డెబ్యూలో డబుల్‌ కొట్టారు.

    మాథ్యూ సింక్లెయిర్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కివీస్‌ ఆటగాడిగా కాన్వే రికార్డు నెలకొల్పాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కాన్వే మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ డెబ్యూలో బౌండరీతో సెంచరీని, సిక్సర్‌తో ద్విశతకాన్ని సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రపుటల్లోకెక్కాడు.

    అయితే, ఈ మ్యాచ్‌లో కాన్వే(347 బంతుల్లో 200; 22 ఫోర్లు, సిక్స్‌) ఒక్కడే ద్విశతకంతో పోరాడటంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. అతనికి హెన్నీ నికోల్స్‌(61), నీల్‌ వాగ్నర్‌(25 నాటౌట్‌) సహకరించడంతో కివీస్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో అరంగేట్రం బౌలర్‌ రాబిన్సన్‌ 4 వికెట్లు పడగొట్టగా, మార్క్‌ వుడ్‌ 3, అండర్సన్‌ 2 వికెట్లు పడగొట్టారు.
    Published by:Sridhar Reddy
    First published: