హోమ్ /వార్తలు /క్రీడలు /

Dutee Chand Birthday: పడి లేచిన కెరటం.. అథ్లెటిక్స్ లో భారత కీర్తి పతాక ద్యుతి చంద్!

Dutee Chand Birthday: పడి లేచిన కెరటం.. అథ్లెటిక్స్ లో భారత కీర్తి పతాక ద్యుతి చంద్!

ద్యుతి చంద్(ఫైల్ ఫొటో)

ద్యుతి చంద్(ఫైల్ ఫొటో)

జీవితం... ఎన్నో ఒడిదుడుకులమయం. అసలు జీవితం అలా ఉంటేనే అసలు మజా తెలుస్తుంది. జీవితంలో పడిలేచి గెలిచేవారే స్ఫూర్తిగా నిలిచేది. 22 ఏళ్ల స్ప్రింటర్ ద్యుతి చంద్ జీవితం కూడా అంతే. ఎన్నో పరీక్షలు. ఎన్నో అవమానాలు. ఎన్నో అడ్డంకులు. జీవితమనే 'హర్డిల్‌ రేస్‌'ను దాటుకొని ఎన్నో విజయాలు ఆమె సొంతం.

ఇంకా చదవండి ...

ద్యుతి చంద్... 25 ఏళ్ల అమ్మాయి. ఇండియన్ ప్రొఫెషనల్ స్ప్రింటర్. ఒడిషాలోని జజ్‌పూర్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించింది ద్యుతి. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. ఆరుగురు ఆడపిల్లల్లో ద్యుతి ఒకరు. కొడుకు కోసం ద్యుతి తల్లిదండ్రులు ఎదురుచూసినా అందరూ కూతుళ్లే పుట్టారు. అంతమంది కుటుంబ పోషణ భారమైపోయింది. రోజు రెండుపూటల భోజనం చేయడం కూడా గగనమే. ద్యుతి సోదరి సరస్వతి చంద్ కూడా అథ్లెటే. ఆమెలాగే ద్యుతి కూడా పరుగులు పెట్టింది. డబ్బు సంపాదించడం కోసమే అథ్లెటిక్స్ కెరీర్ ఎంచుకుంది. అసలు ఇండియాలో అథ్లెటిక్స్ ఎంచుకోవడమంటే కెరీర్‌తో చెలగాటమాడటమే. కానీ ద్యుతి గడియారంతో పోటీపడి పరుగెత్తింది. 2012లో అండర్-18 కేటగిరీలో ద్యుతి నేషనల్ ఛాంపియనైంది. 100 మీటర్ల ఈవెంట్‌లో లేడిపిల్లలా పరుగులు తీసి 11.8 సెకన్లలో గమ్యాన్ని చేరుకుంది. అంతే... ఆ పరుగు ఇక ఆపలేదు. 2013లో పూణెలో జరిగిన ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల రేస్‌లో కాంస్య పథకం సాధించింది. అదే ఏడాది వాల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. గ్లోబల్ అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల ఫైనల్‌కు చేరుకున్న ఘనత కూడా ఆమెదే. ఆ తర్వాత కూడా రాంచీలో సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల రేస్‌లో తన సత్తాచాటి నేషనల్ ఛాంపియన్‌గా పేరు తెచ్చుకుంది.

అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతున్న ద్యుతి పరుగులు ఇక ఆగవనే అనుకున్నారు. కానీ 2014లో ఆమెకో పీడకల. 2014 కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొనకుండా అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అడ్డుకుంది. కారణం... హైపర్ ‌ఆండ్రోజెనిజం. అంటే మహిళ శరీరంలో పురుష హార్మోన్లు ఎక్కువగా ఉండటం అన్నమాట. ఇదే కారణంతో కామన్‌వెల్త్ గేమ్స్ మాత్రమే కాదు... 2014 ఏషియన్ గేమ్స్‌కూ పంపించలేదు. ఆమె మహిళ కాదు... పురుషుడు అన్న వాదన తెరపైకి వచ్చింది. బాల్యం నుంచి ఆమెను చూస్తున్న గ్రామస్తులే నువ్వు ఆడా? మగా? అని మొహమ్మీదే అడిగేసరికి ద్యుతి తట్టుకోలేకపోయింది. అలాంటి అవమానాలెన్నో ఎదుర్కొంది. ఆమె తన జెండర్‌ను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక తన పరుగు ఆగిపోతుందేమో అన్న భయం వేసిందామెకు.

ఒకవేళ పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్నట్టైతే... ఆ హార్మోన్లను తగ్గించుకుని పోటీలో పాల్గొనొచ్చన్న ప్రతిపాదన వచ్చింది. దీనిపై ఆమె కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ని ఆశ్రయించింది. ఈ కేసు రెండేళ్లపాటు సాగింది. హైపర్‌ ఆండ్రోజెనిజం పాలసీని కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత ద్యుతిపై నిషేధం తొలగింది. ద్యుతి కాళ్లు మళ్లీ పరుగులు పెట్టాయి. 2016లో న్యూ ఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ కప్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ వంద మీటర్ల పరుగును 11.33 సెకన్లలో పూర్తి చేసింది ద్యుతి. అంతకుముందున్న నేషనల్ రికార్డు(11.38 సెకన్లు)ను చెరిపేసింది. 2016 జూన్ 25న ఒకేరోజు నేషనల్ రికార్డును రెండుసార్లు తిరగరాసిన ఘనత ఆమెది. 11.24 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తి చేసి రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మూడో భారత మహిళగా రికార్డుల్లోకి ఎక్కింది. కానీ రియోలో పతకం సాధించలేకపోయింది.

ద్యుతి హైదరాబాద్‌కు మకాం మార్చింది. గచ్చిబౌలిలోని అథ్లెటిక్స్ స్టేడియంలో యువ అథ్లెట్లతో శిక్షణ తీసుకుంది. స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా ద్యుతితో కలిసి శిక్షణ తీసుకుంది. ద్యుతి పరుగులకు మెరుగులు పెట్టింది ఎవరో కాదు... తెలంగాణకు చెందిన ఇండియన్ కోచ్ నాగపురి రమేష్. ఆయన ట్రైనింగ్‌తోనే 2017లో ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలు సాధించింది. అదే ఊపుతో 2018 ఏషియన్ గేమ్స్‌కి సన్నద్ధమైంది.

ఆగస్ట్ 26న ఏషియన్ గేమ్స్‌లో 100 మీటర్ల రేస్ జరుగుతున్నప్పుడు అందరి కళ్లూ ద్యుతి పైనే. ఎందుకంటే... అప్పటికే సరిగ్గా నాలుగేళ్ల క్రితం అంటే 2014లో ఏషియాడ్‌కు అర్హత సాధించలేకపోయింది ద్యుతి. కారణం ఆమెపై ఉన్న వివాదమే. అప్పుడు అర్హత సాధించలేదు. కానీ ఈసారి ఏ ఎదురూ లేదు. అందుకే విల్లును విడిచిన బాణంలా దూసుకెళ్లింది. 100 మీటర్ల పరుగులో రజత పతకం సాధించింది. ద్యుతి పరుగు అంతటితోనే ఆగిపోలేదు. ఆగస్ట్ 29న జరిగిన 200 మీటర్ల పరుగులోనూ ద్యుతి లేడిపిల్లలా పరుగులు తీసింది. ఈసారి కూడా భారత్‌ ఖాతాలోకి రజతాన్ని తీసుకొచ్చింది. ఏ ఏషియన్ గేమ్స్‌లో అయితే ద్యుతిని పాల్గొననివ్వలేదో ఇప్పుడు అదే ఏషియన్ గేమ్స్‌లో ఆమె రెండు మెడల్స్ సాధించింది.

ఏషియన్ గేమ్స్‌లో ఇండియాకు మెడల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ద్యుతికి వచ్చిన రజతాలకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే... ఎన్నో అనుమానాలు, అవమానాలు, ఆరోపణలు, విమర్శలు... ఇవన్నీ ఆమె కెరీర్‌లో ఎదురైన హర్డిల్సే. వీటన్నింటినీ దాటుకుంటూ ద్యుతి పరుగులు తీసింది. రెండు రజతాలు చేజిక్కించుకుంది. విమర్శకులకు తన పరుగుతోనే సమాధానం చెప్పింది. 2019లో నపోలిలో జరిగిన Summer Universiade eventలో ఆమె 100 మీటర్ల పరుగును 11.32 సెకన్లలో పూర్తి చేసింది. 2019 లో, ఆమె స్వలింగ సంబంధంలో ఉందని బహిరంగంగా వెల్లడించిన తరువాత భారతదేశపు మొట్టమొదటి గే అథ్లెట్ గా నిలిచారు. హుస్సేన్ బోల్ట్ ఆమెకు స్ఫూర్తి. ఇప్పుడు ద్యుతి ఈ రోజు 25 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.  ద్యుతి చంద్... పడిలేచిన కెరటం మాత్రమే కాదు... పడిలేచి పరుగులు తీసిన యువకెరటం.

First published:

Tags: Asian Games 2018, Odisha, Olympics

ఉత్తమ కథలు