హోమ్ /వార్తలు /క్రీడలు /

Cricket: చరిత్ర మరిచిన దళిత క్రికెటర్.. సురేష్ రైనా వ్యాఖ్యలతో తెరపైకి వచ్చిన తొలి తరం క్రికెటర్.. ఎవరో తెలుసా?

Cricket: చరిత్ర మరిచిన దళిత క్రికెటర్.. సురేష్ రైనా వ్యాఖ్యలతో తెరపైకి వచ్చిన తొలి తరం క్రికెటర్.. ఎవరో తెలుసా?

భారత జట్టు తరపున ఆడిన తొలి తరం దళిత క్రికెటర్ పల్వంకర్ బాలు (Wiki)

భారత జట్టు తరపున ఆడిన తొలి తరం దళిత క్రికెటర్ పల్వంకర్ బాలు (Wiki)

సురేష్ రైనా వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తొలి తరం దళిత క్రికెటర్ గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. భారత జట్టు తరపున ఆడిన తొలి తరం క్రికెటర్ పల్వంకర్ బాలు అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

టీమ్ ఇండియా (Team India) మాజీ క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina) ఒక క్రికెట్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీమ్ ఇండియాపై కూడా ఎప్పటి నుంచో పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకే కులానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తుందంటూ క్రికెట్ అభిమానులు కూడా అప్పుడప్పుడు దుమ్మెత్తి పోస్తుంటారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు సేవలు అందించిన తొలి తరం క్రికెటర్ పల్వంకర్ బాలును (Palwankar Baloo) అందరూ గుర్తు చేసుకుంటున్నారు. దిగ్గజ క్రికెటర్ సీకే నాయుడి కంటే భారత జట్టు తరపున ఆడిన అద్భుతమైన స్పిన్నర్ పల్వంకర్ బాలు. దళిత కుటుంబంలో పుట్టిన బాలు ఎంతో కష్టపడి క్రికెట్ సాధన చేసి భారత జట్టులోకి వచ్చాడు. అతని కథ తెలుసుకోవాలంటే కాస్త వెనక్కు వెళ్లాల్సిందే. అది 1903.. పూణేలోని జింఖానా గ్రౌండ్స్‌లో జేసీ గ్రెయిగ్ అనే బ్రిటిష్ క్రికెటర్ అక్కడ సాధన చేస్తూ ఉండేవాడు. సమయానికి బౌలర్స్ రాకపోతే.. ఆ గ్రౌండ్‌లోని పిచ్‌ను శుభ్రం చేసే ఒక యువకుడితో బౌలింగ్ చేయించుకునేవాడు. అంతకు ముందు క్రికెట్‌తో పరిచయమే లేని ఆ యువకుడు వేసే స్పిన్ బౌలింగ్ గ్రెయిగ్‌ను ఆశ్చర్యానికి గురి చేసేది. అతడి బంతులను ఆడటానికి నానా ఇబ్బందులు పడేవాడు. గ్రెయిగ్ తన సహచర క్రికెటర్లతో కూడా ఆ యువకుడి బౌలింగ్‌ను ఆడించే వాడు. కానీ ఏ ఒక్కరూ అతడి బౌలింగ్ ఎదుర్కునే వాళ్లు కాదు. దాంతో ఆ బౌలర్ పేరు పూణేలో మార్మోగి పోయింది. ఆ తర్వాత క్రికెట్‌నే తన కెరీర్‌గా ఎంచుకొని ప్రపంచంలోనే అత్యున్నతమైన స్పిన్నర్‌గా ఎదిగాడు. టీమ్ ఇండియా పుట్టకముందే ఇండియాలో జన్మించిన అద్భుతమైన స్పిన్నర్‌గా ఎదిగాడు. కానీ చరిత్రలో అతడి పేరు మాత్రం ఎవరికీ గుర్తులేదు. అతనే పల్వంకర్ బాలూ..

పల్వంకర్ బాలూ 1876లో బాంబే ప్రెసిడెన్సీలో భాగమైన ధార్వాడ్‌లో జన్మించాడు. తండ్రి బ్రిటిష్ సైన్యంలో సిపాయి కావడంతో పూణేలో పెరిగాడు. స్కూలింగ్ ముగించాక తండ్రి సిఫారసుతో పూణేలోని జింఖానా గ్రౌండ్‌లో పిచ్‌ను శుభ్రపరిచే పనికి కుదిరాడు. అప్పట్లో అతడికి నెలకు రూ. 4 రూపాయల జీతం ఇచ్చేవాళ్లు. అక్కడి జింఖానా గ్రౌండ్స్‌లో అనేక మంది బ్రిటిషర్లు క్రికెట్ ఆడేవాళ్లు. అక్కడే జేజీ గ్రెయిగ్ అనే బ్రిటిషర్ నిత్యం సాధన చేసేవాడు. బౌలర్ రాని సమయంలో పల్వంకర్ బాలుతో బౌలింగ్ చేయించుకునే వాడు. బాలూలో ఉన్న స్పిన్ టెక్నిక్ చూసి ముగ్దుడైన గ్రెయిగ్ అతడిని బాగా ఎంకరేజ్ చేశాడు. దీంతో బ్రిటిష్ క్రికెటర్లలో బాలూ బౌలింగ్‌పై గురి ఏర్పడింది. వాళ్లను ముప్పతిప్పలు పెట్టడంతో బాలూ పేరు పూణే అంతటా మార్మోగిపోయింది. అప్పట్లో క్రికెట్ మ్యాచ్‌లు మతాల వారీగా జరిగేవి. అంటే బ్రిటిషర్లు, ముస్లింలు, హిందువులకు ప్రత్యేకంగా క్రికెట్ టీమ్స్ ఉండేవి. అలాంటి వాటిలో పూణే హిందూ జట్టు కూడా ఒకటి. బ్రిటిషర్లతో హిందూ జట్టుకు ఒక కీలక మ్యాచ్‌ ఉండటంతో బాలూని తీసుకుందామని కొంత మంది ప్రతిపాదన చేశారు. అయితే బాలూ చమర్ (దళితుడు) కుటుంబానికి చెందిన వాడు కావడంతో మరాఠా బ్రాహ్మణులు వ్యతిరేకించారు. అయితే అదే జట్టులో ఉన్న తెలుగు బ్రాహ్మణ క్రికెటర్లు బాలూను తీసుకోవాల్సిదే అని పట్టు బట్టారు. దీంతో పూణే హిందూ జట్టులో అతడికి చోటు లభించింది. బాలూ అద్భుతమైన బౌలింగ్‌తో బ్రిటిషర్లపై హిందూ జట్టు గెలుపు సాధించింది.

పల్వంకర్ బాలూ ఇక్కడి హిందూ అగ్రవర్ణ క్రికెటర్ల వల్ల అంటరానితనాన్ని అనుభవిస్తూనే వారితో కలసి క్రికెట్ ఆడాడు. 1906లో సతారాలో ఆలిండియా హిందూ జట్టుకు బ్రిటిష్ జట్టుతో క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో 8 వికెట్లు తీసి పూణే హిందూ జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్ ఆధారంగానే బాలీవుడ్‌లో లగాన్ సినిమా తీశారు. సతారాలో మ్యాచ్ గెలిచిన రోజు బాలూని ఏనుగుపై ఊరేగించడమే కాకుండా.. ఏకంగా బాలగంగాధర్ తిలక్ అతడిని సన్మానించారు. అప్పటి వరకు ఒకే జట్టులో ఆడినా బయట ఎక్కడో కూర్చొని బోజనం చేసే పల్వంకర్.. ఆ తర్వాత సహచర క్రికెటర్లతో కలిసే అన్నం తినే స్థాయికి చేరుకున్నాడు. ఒక దళితుడు బ్రాహ్మణ క్రికెటర్లతో కలసి భోజనం చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక 1911లో భారత జట్టు ఇంగ్లాండులో అనధికారికంగా పర్యటించింది. భారత జట్టు తరపున ఆడిన పల్వంకర్ ఆ పర్యటనలో 114 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇంగ్లాండ్ కౌంటీల నుంచి బాలూకి అవకాశాలు వచ్చినా.. అన్నింటినీ సున్నితంగా తిరస్కరించాడు. తాను ఇక క్రికెట్ ఆడలేనని.. ఇండియాలోనే ఉంటానని వారికి చెప్పాడు.

1905 నుంచి 1920 వరకు 15 సంవత్సరాల పాటు ఇండియా తరపున క్రికెట్ ఆడిన బాలూ.. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ స్పిన్నర్‌గా నిలిచిపోయాడు. టీమ్ ఇండియా గ్రేటెస్ట్ క్రికెటర్‌గా చెప్పుకునే సీకే నాయుడు 1916లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. కానీ పల్వంకర్ బాలూ అంతకు ముందే ఇంగ్లాండ్‌లో అద్భుతమైన రికార్డులు కలిగి ఉన్నాడు. అయితే నాయుడు భారత జట్టు అధికారికంగా ఏర్పడిన తర్వాత ఆడగా.. పల్వంకర్ బాలూ అనధికార జట్టుకు ఆడాడు. దీంతో బాలూ రికార్డులను ఎవరూ అధికారికంగా నమోదు చేయలేదు. అయితే ప్రముఖ చరిత్రకారుడు, క్రికెట్ గణాంకకారుడు రామచంద్ర గుహ రాసిన 'స్పిన్ అండ్ అదర్ టర్న్' అనే పుస్తకంలో పల్వంకర్ గురించి తొలి సారిగా పలు విషయాలు వెలుగు చూశాయి. గుహ ఆ తర్వాత రాసిన 'ఏ కార్నర్ ఆఫ్ ఏ ఫారిన్ ఫీల్డ్' అనే పుస్తకంలో ఎక్కువ సమాచారం ఉంది. ఈ పుస్తకంలో క్రికెట్‌ను ఒక సామాజిక కోణంలో వివరించాడు. అంటరానితనం ఎక్కువగా ఉన్న రోజుల్లోనే బ్రిటిషర్లు, బ్రాహ్మణులతో కలసి ఆడిన ఏకైక దళిత క్రికెటర్‌గా బాలూకి ఎంతో పేరు ఉన్నది. బాలూ తర్వాత ఇప్పటి వరకు టీమ్ ఇండియాలో మరో దళిత క్రికెటర్ రాలేదని గుహ చెబుతారు. బాలూ గురించి ఎక్కువ సమాచారం బయటకు వచ్చింది 'విజర్డ్స్' అనే పుస్తకం ద్వారానే.. అనింద్య దత్త రాసిన ఈ పుస్తకంలో స్పిన్నర్ల గురించిన బయోగ్రఫీ ఉంటుంది. దీనిలో మొదటి చాప్టర్ పల్వంకర్ బాలూ గురించే ఉండటం గమనార్హం.


ఇంగ్లాండ్ అనధికార పర్యటనకు వెళ్లి 114 వికెట్లు తీసిన పల్వంకర్ బాలూ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత బాంబే దళిత సంఘం తరపున సన్మానం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఒక విద్యార్థి సన్మానపత్రం చదివాడు. అతనే బాబా సాహెబ్ అంబేత్కర్. అయితే బాలూ క్రికెట్ వదిలేసిన తర్వాత రాజకీయాల వైపు వెళ్లారు. గాంధీ సిద్దాంతాల పట్ల ఆకర్షితుడై చివరి వరకు అతని సిద్దాంతాలనే పాటించారు. బాంబే లెజిస్లేటీవ్ ఎన్నికల్లో అంబేత్కర్‌పై కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. 1955 జులై 4న చనిపోయిన పల్వంకర్ బాలూ ఒక రాజకీయ నాయకుడిగా విఫలమైనా.. నేటి టీమ్ ఇండియా స్పిన్‌కు ఆది గురువుగా ఎప్పటికీ గుర్తుండిపోతాడు. ప్రస్తుతం అతడి గణాంకాలను సేకరించే పనిలో ఐసీసీ ఉన్నట్లు తెలుస్తున్నది.

First published:

Tags: Bcci, Suresh raina, Team India