ఐసీసీ (ICC) పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World cup) చాంపియన్లు (Champions) అవడానికి ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు (Australian Cricket Team) పరిస్థితి ఏంటో తెలుసా? వరుసగా ఐదు టీ20 సిరీస్‌లు ఓడిపోయింది. సరిగ్గా.. వరల్డ్ కప్‌కు ముందు బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లపై కూడా ఓడిపోయి ఫామ్ లేమితో ఇబ్బంది పడింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో కూడా పెద్దగా రాణించలేదు. సూపర్ 12లో ఆస్ట్రేలియా ప్రదర్శన అంతంత మాత్రమే. కానీ ఆస్ట్రేలియా ఒక్కసారిగా మారిపోయింది. నిజమైన చాంపియన్లలా ఆడటం మొదలు పెట్టింది. దుబాయ్ పిచ్‌లపై స్పిన్నర్లను అలవోకగా ఆడేస్తూ భారీ పరుగులు సాధించేసింది. పాకిస్తాన్, కివీస్ జట్లలోని మేటి స్పిన్నర్లకు ఏ మాత్రం తలొగ్గకుండా ఆసీస్ బ్యాటర్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లంటే భయపడే మ్యాక్సీ కూడా చెలరేగిపోయాడు. ఇంతటి ట్రాన్స్‌ఫర్‌మేషన్‌కు కారణం ఏమిటి? ఒక్క రోజులోనే ఇలా మారిపోయారా? అంటే కానేకాదు. ఆస్ట్రేలియన్లలో ఈ మార్పు ఒక్కరోజులో వచ్చింది కాదు. గత మూడేళ్లుగా ఆస్ట్రేలియన్లతో పాటు ఉన్న ఒక భారత బౌలర్ తీసుకొచ్చిన మార్పు ఇది.
గత మూడేళ్లుగా ఆస్ట్రేలియన్లు స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కుంటున్నారు. ఉపఖండంలో రాణించాలంటే స్పిన్నర్లపై చక్కగా ఆడటం తప్పని సరి. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఒక భారత స్పిన్నర్‌ను నెట్ బౌలర్‌గా 2018 నుంచి తమ వెంట ఉంచుకుంటుంది. అతనే ప్రదీప్ సాహు. హర్యాణా రంజీ జట్టుకు చెందిన ప్రదీప్.. ఆస్ట్రేలియన్లు స్నిన్ బాగా ఆడటంలో కీలక పాత్ర పోషించాడు. అతడు జట్టుతో ఉన్నంత కాలం ఆస్ట్రేలియన్లు వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ వచ్చారంటే అతిశయోక్తి కాదు. 2018 నుంచి మార్చి 2020 వరకు అతడు ఆస్ట్రేలియా నెట్ బౌలర్‌గా ఆ తర్వాత అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. కోవిడ్ నుంచి అతడు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా జట్టు చివరి సారిగా దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ గెలిచింది. ఆ సిరీస్ వరకే ప్రదీప్ సాహు జట్టుతో ఉన్నాడు.
ప్రతీ సిరీస్ ముందు ప్రత్యర్థి జట్టులోని స్పిన్ బౌలర్లు ఎవరు అని గుర్తించి.. వారిలాగానే సాహు నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడంటా. ఇండియాతో సిరీస్ ముందు చాహల్ లాగ బంతులు విసిరి మ్యాక్స్‌వెల్‌ను సిద్దం చేశాడు. దీంతో మ్యాక్సీ ఆ సిరీస్‌లో వరుసగా హాఫ్ సెంచరీ, సెంచరీ నమోదు చేసి జట్టును గెలిపించాడు. 2019లో ఆస్ట్రేలియా జట్టు వన్డే వరల్డ్ కప్ సెమీస్ వరకు చేరుకున్నది. ఆ సమయంలో ప్రదీప్ సాహు జట్టుతోనే ఉన్నాడు. ఆస్ట్రేలియా సపోర్టింగ్ స్టాఫ్‌లో భాగమైన శ్రీదరన్ శ్రీరామ్ అతడిని జట్టుకు పరిచయం చేశాడు. అలా ఆసీస్‌తో అనుబంధం ఏర్పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Glenn Maxwell, T20 World Cup 2021