Home /News /sports /

DINESH KARTIK WANTS TO PLAY IN T20 WORLD CUP I WANT TO PLAY FOR INDIA 3 TO 4 MORE YEARS JNK

Cricket : టీ20 వరల్డ్ కప్ ఆడటమే లక్ష్యం... నేను కామెంట్రీ చెప్పకూడదా? : దినేశ్ కార్తీక్ ఎక్స్‌క్లూసీవ్ ఇంటర్వ్యూ

దినేశ్ కార్తీక్ ఎక్స్‌క్లూసీవ్ ఇంటర్వ్యూ

దినేశ్ కార్తీక్ ఎక్స్‌క్లూసీవ్ ఇంటర్వ్యూ

క్రికెట్ కెరీర్ కొనసాగిస్తుండానే దినేశ్ కార్తీక్ కామెంటేటర్ అవతారం ఎత్తాడు. త్వరలో జరుగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ పాటు 'ది హండ్రెడ్' లీగ్‌లో స్కై స్పోర్ట్స్ తరపున కామెంటేటర్‌గా పని చేయనున్నాడు. ఈ నేపథ్యంలో కార్తీక్ ఇచ్చిన ఇంటర్వ్యూ

ఇంకా చదవండి ...
  ధోనీ కంటే ముందే జట్టులోకి వచ్చాడు. నిలకడ లేమితో జట్టులో స్థిరంగా ఉండలేక పోయాడు. జాతీయ జట్టులోకి వచ్చిన ప్రతీసారి ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఫ్యాన్స్ మనసు గెలుచుకునే వాడు. టీమ్ ఇండియాలో (Team India) స్థానం కోల్పోయినా తమిళనాడు (Tamilnadu) తరపున దేశవాళి (Domestic Cricket)ఆడుతూ ఆటను మరింత మెరుగుపరుచుకుంటున్నాడు. అతనే దినేశ్ కార్తీక్ (Dinesh Kartik). వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్‌గా 17 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా.. ఇంకా అతడి స్థాయికి తగిన ప్రదర్శన మాత్రం చేయలేదనే చెప్పాలి. తన ముందు ఇప్పుడు రెండు లక్ష్యాలు ఉన్నాయని దినేశ్ చెబుతున్నాడు. టీమ్ ఇండియాలో తిరిగి స్థానం సంపాదించడంతో పాటు ఇండియా, ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ ఆడాలన్నది ఒక లక్ష్యమైతే.. కేవలం రిటైర్ అయిన క్రికెటర్లు మాత్రమే కామెంట్రీ చెప్పాలా? నేనూ కామెంట్రీలో రాణిస్తా అంటున్నాడు దినేశ్. త్వరలో ఇంగ్లాండ్ బయలుదేరనున్న ఈ మల్టీ టాలెంటెడ్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పాడు. అవేంటో చూద్దాం.

  - త్వరలో ఇంగ్లాండ్ వెళ్లి టీవీ కామెంటేటర్‌గా పని చేయనున్నారు. మీకు ఎలా అనిపిస్తున్నది?

  నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఇది నాకు చాలా కొత్త. కానీ ఈ బాధ్యతను కూడా నెరవేర్చడానికి ఉత్సాహంతో ఉన్నాను. ఇది నాకు కొత్త ప్రయాణం అనుకోవాలి.

  - విరాట్ సేనతో కలసి ఇంగ్లాండ్ టూర్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో కదా?

  అవును. నేను ఒక క్రికెటర్‌ని. జట్టులో సభ్యుడిగా ఇంగ్లాండ్ వెళ్లాలని నాకూ అనిపించింది. కానీ వాస్తవం ఏమిటో మనం తెలుసుకోవాలి. నేను టెస్టు జట్టులో లేను. కాబట్టి అది సాధ్యం కాదని తెలుసు. అయితే ఆ మ్యాచ్‌ల గురించి మాట్లాడటానికి నేను ఇంగ్లాండ్ వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది.

  - ధోనీతో పాటు టెస్టులు, వన్డేల్లో అరంగేట్రం చేశారు కదా. ఇండియా జట్టులో మీకు వచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించకోలేదని భావిస్తున్నారా?

  ప్రతీ ఒక్కరు మంచిగా ఆడటానికే ప్రయత్నిస్తారు. నేను కూడా వారికి అతీతం ఏమీ కాదు. కొన్ని మ్యాచ్‌లలో రాణించగలిగాను.. మరి కొన్నింటిలో విఫలమయ్యాను. నా కెరీర్‌ను కనుక నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా గర్వంగానే ఉంటుంది. ఇంత కాలం నేను క్రికెట్‌కు మేలే చేసినట్లు భావిస్తాను.

  - ధోనీ జట్టులో కీపర్‌గా ఉన్నప్పుడు మీరు కేవలం బ్యాట్స్‌మాన్‌గా జట్టులో ఉన్నారు. ఆ సమయంలో ఓపెనర్‌గా కూడా ఆడారు. అది మీకు కష్టంగా అనిపించలేదా

  మనం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక దానికే పరిమితం అవడం కష్టం. మనం ఏదో ఊహించుకొని జట్టులో స్థానం కోరుకుంటున్నామంటే మనం తప్పు చేస్తున్నట్లే. మనకు లభించిన పాత్రను అవగాహన చేసుకొని ఆటను ఆస్వాదిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించడం సులువు. నేను ఓపెనర్‌గా భారత జట్టుకు చాలా కొద్ది సమయం మాత్రమే సేవలు అందించాను. కానీ నేను ఆ పాత్రను ఎంజాయ్ చేశాను.

  - ఇప్పుడు వస్తున్న యంగ్ స్టర్స్‌ను మీ జనరేషన్‌తో పోలిస్తే.. మీ అభిప్రాయం ఏమిటి

  ఇప్పుడు వస్తున్న యువ క్రికెటర్లు చాలా మెచ్యూరిటీ కలిగి ఉన్నారు. మేము యువకులుగా క్రికెట్‌లోకి అడుగు పెట్టిన సమయంలో కంటే ఇప్పుడు వారికి ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టక ముందే ఐపీఎల్ లాంటి లీగ్స్ ద్వారా ఎంతో మంది సీనియర్, విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం లభిస్తున్నది. దాంతో వారి ఆత్మవిశ్వాసం పెరుగుతున్నది. అదే ఉత్సహంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వెళ్లి ఆడుతున్నారు. ఇప్పటి యువకులు అసలు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటానికి భయపడటం లేదు.

  - వాషింగ్టన్ సుందర్ టెస్టుల్లో రాణించడం చూస్తుంటే ఏమనిపిస్తున్నది

  వాషింగ్టన్ సుందర్ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతడు కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. ఎక్కడ ప్రారంభించి ఇప్పుడు ఎక్కడకు చేరుకున్నాడో చూస్తున్నాను. అతడి భవిష్యత్ మరింత గొప్పగా ఉండబోతున్నది. సుందర్‌ను టెస్టు జట్టులో చూడటం నాకు సంతోషంగా ఉన్నది. మైదానం వెలుపల కూడా అతడు చేసే సాధన, తీసుకునే శిక్షణ చాలా కఠినంగా ఉంటాయి.

  - ఇండియాలో వికెట్ కీపింగ్ టాలెంట్ ఎలా ఉంది?

  ప్రస్తుతం మనకు అందుబాటులో చాలా మంది వికెట్ కీపర్లు ఉన్నారు. ఐపీఎల్ కారణంగా మనకు ఎంతో మంది వికెట్ కీపర్, బ్యాట్స్‌మాన్స్ అందుబాటులోకి వచ్చారు. వాళ్లు ఏ ఫ్రాంచైజీకి ఆడినా తమ మనస్పూర్తిగా ఆడుతున్నారు. టీ20 లెవెల్‌లో మనకు చాలా మంది కీపర్లు ఉన్నారు.

  - టీమ్ ఇండియా గత టూర్‌లో రిషబ్ పంత్ ఇండియా తరపున అరంగేట్రం చేశాడు. అతడిని మీరు ఎలా చూస్తున్నారు? అతను వృద్దిమాన్ సాహ ప్లేస్‌ను భర్తీ చేసేశాడు కదా?

  మనలో ఆత్మవిశ్వాసం ఉంటే ఎలా ఎదగవచ్చో అనే దానికి రిషబ్ పంత్ ఒక ఉదాహరణ. అతను ఐపీఎల్‌లో గాని, ఇండియా 'ఏ' జట్టు తరపున గాని ఎలా ఆడాడో మనం చూశాము. అతను దేశం కోసం ఆడిన ప్రతీ సారి అతడిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంటుంది. ఇప్పుడు అతడు ఇంకా పరిణితి సాధించాడు. ఒక బ్యాట్స్‌మాన్‌గా ఎదిగాడు. మనం గమనిస్తే చాలా దేశాలకు చెందిన జట్లు అతడి గురించి భయపడుతూ మాట్లాడుతున్నాయి. ఒక సెషన్‌లోనే ఆటను పూర్తిగా మార్చేసే స్వభావం అతడికి ఉన్నది. ఇక సాహ ఒక గొప్ప వికెట్ కీపర్. పంత్ వచ్చాడని సాహాను పక్కన పెట్టడం ఏ మాత్రం సబబు కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో సాహా ఒకడు. బ్యాటుతో కూడా అతడు చేసిన సేవలు మర్చిపోలేనేవి.

  - క్రికెట్‌ కెరీర్‌ను కొనసాగించాలని మీరు అనుకుంటున్నారా?

  నేను ఫిట్‌గా ఉన్నంత వరకు క్రికెట్ ఆడుతూనే ఉంటాను. నేను మరో మూడు-నాలుగేళ్లు క్రికెట్ ఆడగలను. నా ఫిట్‌నెస్ ఇలాగే కొనసాగితే మరి కొన్ని రోజులు నా బ్యాట్‌నుంచి పరుగులు వస్తూనే ఉంటాయి. క్రికెట్‌ను ఆపేయడానికి నా వద్ద ఎలాంటి కారణం కనిపించడం లేదు. ఈ రోజుల్లో వయసును ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం ఫిట్‌నెస్ టెస్టులు పాసైతే చాలు. ఫిట్ గా ఉంటే జట్టులో చోటు తప్పక లభిస్తుంది. నేనైతే రాబోయే టీ20 వరల్డ్ కప్స్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. 2021, 2022లో వరుసగా మనకు టీ20 వరల్డ్ కప్స్ ఉన్నాయి. ఆ జట్టులో స్థానం సంపాదించాలి. నేను గతంలో కూడా చాలా బాగా ఆడాను. గత వరల్డ్ కప్ ముందు నన్ను జట్టులో నుంచి తప్పించిన తర్వాత కూడా ఇతర లీగ్స్‌లో మంచి ప్రదర్శనే చేశాను. నేను మిడిల్ ఆర్డర్‌లో ఆడగలననే నమ్మకం ఉంది. ఫినిషర్‌గా కూడా రాణించగలను. జట్టులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారన్న విషయం నాకు తెలుసు. అందుకే ఫినిషర్‌గా కంటే మిడిల్ ఆర్డర్‌లో నేను నిరూపించుకోగలనని అనుకుంటున్నాను. ఒక జట్టు గెలుపోటములలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పాత్ర చాలా కీలకమైనది. అందుకే ఆ స్థానంలో నేను ఆడాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఆ స్థానం టీమ్ ఇండియాలో ఖాళీగా ఉన్నదని నేను అనుకుంటున్నాను.

  - మీ గోల్స్ చూస్తుంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి తిరిగి రావాలని భావిస్తున్నట్లే ఉన్నది. శ్రీలంక పర్యటనకు ఎంపిక అవ్వాలని కోరుకుంటున్నారా?

  వందశాతం నేను జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నాను. టీ20 ఫార్మాట్‌లో గత కొన్ని ఏళ్లుగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్‌గా ఉన్నాను. మంచి స్ట్రైక్ రేటు కూడా ఉన్నది. పొట్టి క్రికెట్‌లో ఎలా ఆడాలో అనుభవం ఉన్నది. శ్రీలంక పర్యటనకు ఎంపిక కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా.

  - ఫినిషర్‌గా ధోనీ పోషించిన పాత్రమే మీరు పోషించగలరా?

  తప్పకుండా. ఒక ఫినిషర్‌గా మారడానికి నేను సిద్దంగా ఉన్నాను. ఆ దిశగా నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను. తమిళనాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున అదే పాత్ర పోషిస్తున్నాను. ఫినిషర్ రోల్ తప్పకుండా పోషించగలననే నమ్మకం ఉన్నది. టీ20లో 14 ఓవర్ల తర్వాత ఒక బ్యాట్స్‌మాన్‌గా మనం కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాని మీదే నేను ఫోకస్ చేశాను. నాకు ఆ పాత్ర ఇస్తే తప్పకుండా నాలో ఉన్న టాలెంట్ చూపిస్తాను.

  - దినేశ్ కార్తీక్‌కు చాలా అవకాశాలు ఇచ్చినా అతను సరిగా ఉపయోగించుకోలదనే అపవాదు ఉంది. మీరెలా స్పందిస్తారు?

  టీమ్ ఇండియా తరపున దాదాపు 16 ఏళ్ల ప్రయాణం ఉన్నది. మూడు ఫార్మాట్లలో నేను జట్టుకు ఏం చేశానో నాకు తెలుసు. జట్టు కోసం నేను ఎంతో కష్టపడ్డాను. అవకాశాలు రావడానికి నేను పడిన కష్టం నా మనసుకు తెలుసు. అయితే జట్టులో ఆడుతున్నప్పుడు కొన్ని సార్లు రాణించాను, మరికొన్ని సార్లు విఫలం అయ్యాను. కానీ నా అవకాశాలను నేను ఎప్పుడూ పాడు చేసుకోలేదు. మనం ఇంటికెళ్లి బెడ్ మీద పడుకున్నప్పుడు హాయిగా నిద్రపోగలిగితే.. మనం ఏం తప్పూ చేయలేదనే అర్దం. నేను ఏనాడూ అవకాశఆలు చెడగొట్టుకోలేదు. సాధ్యమైనంతగా కష్టపడ్డాను.

  - మీ కెరీర్‌ను వెనుదిరిగి చూసుకుంటే.. మీతో పాటు జట్టులోకి వచ్చిన వాళ్లు.. ఆ తర్వాత అరంగేట్రం చేసిన వాళ్లు కూడా రిటైర్ అయ్యారు కదా.. మరి మీరు?

  నా కెరీర్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ దేశంలో వంద కోట్ల మంది కంటే ఎక్కువే జనాభా ఉన్నది. కానీ వారందరిలో కేవలం 302 మంది మాత్రమే టెస్టు మ్యాచ్‌లు ఆడితే వారిలో నేను ఒకడిది. ఇది చాలా గర్వించదగిన విషయమే కదా. నేను మొదట్లో దేశం తరపున ఒక మ్యాచ్ ఆడితే చాలని అనుకున్నాను. కానీ 150 పైగా మ్యాచ్‌లు ఆడాను. ఇంకా ఆడాలనే ఉన్నది. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాననే మీరు భావించాలి.

  - సాధారణంగా అందరూ రిటైర్ అయ్యాక కామెంట్రీని తమ వృత్తిగా మార్చుకుంటారు. కానీ మీరు ఆటగాడిగా కొనసాగుతూనే అటు వైపు వెళ్తున్నారు?

  మీరు విదేశీ ప్లేయర్లను ఒకసారి గమనించండి. ముఖ్యంగా ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ ఆటగాళ్లు కెరీర్ కొనసాగుతుండగానే కామెంట్రీ వైపు కూడా వెళ్తుంటారు. సాధారణంగా జట్టులో స్థానం లేనప్పుడో, గాయపడినప్పుడో వాళ్లు ఆటకు దూరంగా ఉండలేక కామెంటేటర్లుగా మారుతుంటారు. కానీ, ఇండియాలో మాత్రం రిటైర్ అయితేనే కామెంట్రీ చెప్పాలనే దృష్టితో ఉండిపోయారు. రిటైర్ అయితేనే క్రికెట్ ఎక్స్‌పర్ట్ అవుతారని భావిస్తున్నారు. నేను కూడా అంతే.. రిటైర్ కాకపోయినా ఆటపై నాకు పూర్తి అవగాహన ఉన్నది. జట్టులో స్థానం వచ్చే మైదానంలో ఆడతాను. లేనప్పుడు మైదానం వెలుపల మైక్ పడతాను.
  Published by:John Naveen Kora
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు