Dinesh Kartik : నేనిక్కడే ఉన్నా.. కిట్ కూడా తెచ్చుకున్నా.. వచ్చెయ్యమంటారా.. బీసీసీఐకి దినేశ్ కార్తీక్ పంచ్

దినేశ్ కార్తీక్ పంచ్ మామూలుగా లేదుగా..! (Twitter)

 • Share this:
  టీమ్ ఇండియా వెటరన్ ప్లేయర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (Dinesh Kartik) ప్రస్తుతం ఇంగ్లాండ్ (England) లోనే ఉన్న సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్, న్యూజీలాండ్ సిరీస్, ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ కొరకు అతడు స్కై స్పోర్ట్స్ (Sky Sports) తరపున కామెంట్రీ (Commentry) చెబుతున్నాడు. క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించకుండానే కామెంటేటర్‌గా మారి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తన విట్టీ వన్ లైనర్లతో అటు తోటి కామెంటేటర్లపై పంచ్‌లు వేయడమే కాకుండా ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇప్పుడు టీమ్ ఇండియా వికెట్ కీపర్లు రిషబ్ పంత్, వృద్ది మాన్ సాహలు కరోనా కారణంగా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. దీంతో టెస్టు జట్టులో కీపింగ్ బాధ్యతలు ఎవరు చేస్తారనే అనుమానాలు నెలకొన్నాయి. అందుబాటులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ కేఎల్ రాహుల్ ఉన్నా అతడికి పెద్దగా అనుభవం లేదు. అయితే ఇదే సమయంలో దినేశ్ కార్తీక్ పెట్టిన ట్వీట్ అందరినీ నవ్విస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న దినేశ్ కార్తీక్ దానికి సంబంధించిన కిట్‌ ఫొటోను పెట్టి 'జస్ట్ సేయింగ్' అనే కొటేషన్ ఇచ్చి వదిలాడు.

  ప్రస్తుతం టీమ్ ఇండియా కీపర్లు పంత్, సాహ ఐసోలేషన్‌లో ఉన్నారు. నేనింకా రిటైర్ కావలేదు కాబట్టి.. రమ్మంటే వచ్చేస్తా.. కిట్ కూడా నాతో పాటు రెడీగా ఉంది అని అర్దం వచ్చేలా ఆ పోస్టు ఉన్నది. సరిగ్గా సమయం చూసుకొని కార్తీక్ వేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా, టీమ్ ఇండియా తరపున పరిమిత ఓవర్ల వరల్డ్ కప్ ఆడాలని కార్తీక్ భావిస్తున్నాడు. రాబోయే రెండేళ్లలో జరుగనున్న టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్‌లలో ఏదో ఒక దానిలో తాను ఆడిన తర్వాతే రిటైర్ అవుతానని గతంలో చెప్పాడు. కామెంట్రీ చెప్పినంత మాత్రాన రిటైర్మెంట్ తీసుకున్నట్లు కాదని కూడా కార్తీక్ వ్యాఖ్యానించాడు. శ్రీలంక వెళ్లిన భారత జట్టులో కూడా కార్తీక్ స్థానం ఆశించాడు. గత పర్యటనకు వెళ్లిన భారత జట్టులో కార్తీక్ సభ్యుడుగా ఉన్నాడు. అప్పుడు నిదహాస్ ట్రోఫీలో చివరి బంతికి సిక్స్ కొట్టి భారత జట్టుకు చిరస్మరనీయ విజయాన్ని అందించాడు.

  ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న దినేశ్ కార్తీక్ ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్‌కు వ్యాఖ్యాతగా పని చేయనున్నాడు. ఆ తర్వాత ది హండ్రెడ్‌కు కూడా అతడు వ్యాఖ్యానం అందించబోతున్నాడు. కాగా, యూఏఈలో సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న రెండో దశ ఐపీఎల్‌లో దినేశ్ కేకేఆర్ తరపున బరిలోకి దిగుతాడు. ఇయాన్ మోర్గాన్ గైర్హాజరీలో దినేశ్ కార్తీక్‌కు తిరిగి కెప్టెన్సీ కట్టబెట్టాలని కేకేఆర్ యాజమాన్యం ఆలోచిస్తున్నది.
  Published by:John Naveen Kora
  First published: