Dhammika Prasad : శ్రీలంక (Sri lanka) క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు ధమ్మిక ప్రసాద్ (Dhammika Prasad) నిరాహారా దీక్షకు దిగాడు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతోన్న ప్రజలకు, 2019లో ఈస్టర్ సండే (Easter Sunday) నాడు జరిగిన బాంబు దాడిలో మరణించిన వారికి న్యాయం చేకూరేందుకు తాను నిరాహారదీక్ష చేస్తున్నానని ధమ్మిక ప్రసాద్ తెలిపాడు. తన ప్రజల కోసం ధమ్మిక ప్రసాద్ 24 గంటల దీక్షను శుక్రవారం ఆరంభించాడు. లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స నివాసం ఉంటున్న గాలేలోని సెక్రటరియట్ ముందు దమ్మిక ప్రసాద్ ఈ నిరాహార దీక్షను ఆరంభించాడు.
'ఈస్టర్ డే బ్లాస్ట్ జరిగి మూడేళ్లు గడుస్తున్నా.. బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. వారికి ఆర్థికంగా ఇప్పటి వరకు ఎటువంటి సాయం అందలేదు. వారికి న్యాయం జరిగేవరకు నా పోరాటం ఇలానే కొనసాగుతూ ఉంటుంది. అదే సమయంలో దేశం ప్రస్తుతం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటుంది. నిత్యావసర సరకుల రేట్లు పెరిగిపోవడం.. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటివి దొరకకపోవడంతో దేశంలోని ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. లంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి సత్వరమే ప్రభుత్వం పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నా'అని మీడియాకు ధమ్మిక ప్రసాద్ తెలిపాడు.
కాగా 2019లో ఈస్టర్ సండే రోజున ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో 269 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మూడు చర్చిలు, మూడు హోటళ్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అయితే ఈ కుట్ర వెనుకు సూత్రధారులపై శ్రీలంక ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేకపోయింది. అదే సమంయలో బాంబు దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు.
39 ఏళ్ల ధమ్మిక ప్రసాద్ తన అంతర్జాతీయ కెరీర్ లో 39 టెస్టులు, 25 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 72 వికెట్లు తీసిన అతడు వన్డేల్లో 32 వికెట్లు సాధించాడు. 2006 నుంచి 2015 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ధమ్మిక ప్రసాద్.. 2015లో క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.
స్వతంత్ర దేశంగా మారిన తర్వాత నుంచి ఎన్నడూ లేని విధంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటుంది. దేశానికి ఆదాయం పర్యాటకం నుంచే ఎక్కువగా ఉండటం... కరోనాతో ఆ రంగం నిలిచిపోవడం ప్రస్తుత పరిస్థితికి ఒక కారణం. అదే సమయంలో దేశ పాలనాధికారులు చేసిన నిర్లక్ష్యం కూడా శ్రీలంక ఆర్థికంగా చితికిపోవడానికి ఒక కారణంగా మారింది. ప్రస్తుతం దేశంలోని ప్రజలు తినడానికి తిండిలేక.. ఆకలితో అలమటిస్తున్నారు. అదే సమయంలో దేశంలో దాదాపు 12 గంటలకు పైగా పవర్ కట్స్ ఉంటుండటంతో దేశం చీకటిలో మగ్గుతుంది. అదే సమయంలో శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగా ఐపీఎల్ లో పాల్గొంటున్న తమ దేశ క్రికెటర్ల పై విరుచుకుపడ్డాడు. దేశం తగలబడిపోతుంటే మీకు ఆట ముఖ్యమైందా అంటూ కామెంట్స్ చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, IPL, IPL 2022, Sri Lanka, Sri Lanka Blasts