Team India: చరిత్ర సృష్టించిన దేవ్‌దత్ పడిక్కల్.. టీమ్ ఇండియాలో ఒకే ఒక్కడు

చరిత్ర సృష్టించిన దేవ్‌దత్ పడిక్కల్.. టీమ్ ఇండియాలో ఒకే ఒక్కడు (bcci)

టీమ్ ఇండియా టీ20 జట్టులోకి బుధవారం అరంగేట్రం చేసిన దేవ్‌దత్ పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోని టీమ్ ఇండియా క్రికెటర్లలో ఈ శతాబ్దంలో పుట్టిన ఏకైక క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కాడు.

  • Share this:
    కర్ణాటకకు చెందిన దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal) బుధవారం (జులై 28) భారత జాతీయ జట్టు (Team India) తరపున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి (T20I) అరంగేట్రం (Debut) చేసిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేయడం ద్వారా పడిక్కల్ ఈ శతాబ్దంలో పుట్టి తొలి సారిగా టీమ్ ఇండియా తరపున ఆడుతున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. టీమ్ ఇండియా టెస్టు, వన్డే, టీ20లలో ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లు అందరు కూడా 1999 లేదా అంతకంటే ముందు పుట్టిన వాళ్లే ఉన్నారు. కేవలం పడిక్కల్ ఒక్కడే ఈ శతాబ్దంలో పుట్టిన క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కాడు. పడిక్కల్ 2000 జులై 7న జన్మించాడు. కేవలం 21 ఏళ్ల వయసులో అతడు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. భారత జట్టు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కోవిడ్ సోకడంతో అతడితో పాటు మరో ఎనిమిది మంది క్రికెటర్లు ఐసోలేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో పడిక్కల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్. చేతన్ సకారియా, నితీశ్ రాణా అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 132/5 స్కోర్ మాత్రమే చేయగలిగింది. పడిక్కల్ 23 బంతుల్లో 29 పరుగులు చేసి వానిందు హసరంగ బౌలింగ్‌లో అవుటయ్యాడు. పడిక్కల్‌కు మంది ఆరంభమే దక్కినా.. దాన్ని పెద్ద స్కోర్‌గా మలచలేకపోయాడు.

    యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో తొలి సారిగా పడిక్కల్ ప్రతిభ అందరికీ తెలిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న పడిక్కల్ ఆ సీజన్‌లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడి 473 పరుగులు చేశాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో కూడా పడిక్కల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌కే అతడిని తీసుకుంటారని భావించినా నిరాశే ఎదురైంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ 2021లో పడిక్కల్ ఆరు మ్యాచ్‌లలో 195 పరుగులు చేశాడు. ఇందులో ఒక అద్భుతమైన సెంచరీ కూడా ఉన్నది. సీనియర్లు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లడంతో పడిక్కల్‌కు అనూహ్యంగా శ్రీలంక పర్యటనకు పిలుపు అందింది. వన్డే సిరీస్‌తో పాటు తొలి టీ20ల్లో బెంచ్‌కే పరిమితం అయిన పడిక్కల్ చివరకు రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేశాడు.





    బుధవారం జరిగిన రెండో టీ20లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి కేవలం 132 పరుగులు మాత్రమే చేసింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారత బ్యాట్స్‌మాన్ పరుగులు తీయడానికి కష్టపడ్డారు. ఇక కెప్టెన్ ధావన్ 42 బంతుల్లో 40 పరుగులు చేయగా.. పడిక్కల్ 23 బంతుల్లో 29 పరుగులు చేశాడు. శ్రీలంక బ్యాట్స్‌మాన్ కూడా తడబడినా 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో రెండో మ్యాచ్ 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
    Published by:John Naveen Kora
    First published: