Devdutt Paddikal : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ ఓపెనర్.. కర్ణాటక ప్లేయర్ దేవదత్ పడిక్కల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో చెలరేగుతున్నాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో దుమ్ము రేపుతున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ ఓపెనర్.. కర్ణాటక ప్లేయర్ దేవదత్ పడిక్కల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో చెలరేగుతున్నాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో దుమ్ము రేపుతున్నడు. వరుసగా నాలుగు సెంచరీలు బాది..అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కేరళతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నాలుగో సెంచరీ బాదిన పడిక్కల్ (10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి అండగా మరో ఓపెనర్ సమర్థ్ (22 ఫోర్లు, 3 సిక్స్‌లతో 192) పరుగుల విధ్వంసం సృష్టించడంతో కర్ణాటక 80 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 338 పరుగులు చేసింది. పడిక్కల్, సమర్థ్ తొలి వికెట్‌కు 249 పరుగులు జోడించారు. కాగా ఓపెనర్ సమర్థ్ ఇన్నింగ్స్ ఆసాంతం ఫోర్లు, సిక్సర్లతో చెడుగుడు ఆడేశాడు. అయితే తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక టోర్నీలో దేవదత్కిది వరుసగా నాలుగో సెంచరీ. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేరళ 43.4 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక బౌలర్ రోణిత్ మోరే 5 వికెట్లతో కేరళ పతనాన్ని శాసించాడు. విత్సల్ గోవింద్(92), అజారుద్దీన్(52) పోరాడినా ఫలితం లేకపోయింది.
ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన పడిక్కల్.. సూపర్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకొని మంచి అనుభవం సాధించిన అతను దేశవాళీ క్రికెట్లో రెచ్చిపోతున్నాడు. ఇప్పటి వరకు విజయ్ హజారే ట్రోపీలో 6 మ్యాచులు ఆడిన పడిక్కల్.. 4 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు బాదేశాడు. తన సూపర్ ఫామ్ తో ఆర్సీబీ టైటిల్ అందించాలని అభిమానులు కోరుతున్నారు.
మరోవైపు, దేవదత్‌ను టీమిండియాకు ఎంపిక చేయాలని అభిమానులు కోరుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పడిక్కల్‌ను ప్రశంసిస్తూ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే..భవిష్యత్తులో శిఖర్ ధావన్ ప్లేస్ లో జట్టులోకి వచ్చే అవకాశముందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.