IPL 2021 : ఐపీఎల్ వాయిదా నేపథ్యంలో ఆటగాళ్లకు జీతాలు ఇస్తారా? క్రికెటర్లకు ఫ్రాంచైజీలు ఎంత చెల్లిస్తాయి?

వాయిదా పడినా సరే ఆటగాళ్లకు జీతం అందుతుంది? ఎంత ఇస్తారో తెలుసా?

ఐపీఎల్ వాయిదా పడటంతో బీసీసీఐ, బ్రాడ్‌కాస్టర్, ఫ్రాంచైజీలు తమ ఆదాయాలను భారీగా కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లకు వేతనాలు అందుతాయా? ఎంత మొత్తం క్రికెటర్లకు చెల్లించాల్సి ఉంటుంది?

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ కరోనా కారణంగా మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. బయోబబుల్‌లో ఉన్నా క్రికెటర్లకు కరోనా వ్యాపించడం చర్చనీయాంశం అయ్యింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ క్రికెటర్లతో మొదలైన కరోనా.. చెన్నై సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ వరకు పాకింది. మరోవైపు ఢిల్లీ గ్రౌండ్స్ మెన్ కూడా కరోనా కారణంగా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. వరుసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో బీసీసీఐ లీగ్‌ను అర్దాంతరంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌తో కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నది. అయితే 29 మ్యాచ్‌లు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోయింది. 30వ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగాల్సి ఉండగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కరోనా కేసులు బయటపడటంతో మ్యాచ్ రద్దయ్యింది. మంగళవారం మ్యాచ్ జరుగుతుందని భావించినా వృద్దిమాన్ సాహ, అమిత్ మిశ్ర కరోనా పాజిటివ్‌గా తేలడంతో బీసీసీఐ (BCCI) కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. మరి ఐపీఎల్ అర్దాంతరంగా ముగియడం వల్ల ఐపీఎల్ ప్లేయర్లకు (Cricketers) జీతాలు (Salaries) ఎలా చెల్లిస్తారనే అనుమానాలు ఉన్నాయి. దీనికి ఐపీఎల్ నిబంధనల్లోనే సమాధానం ఉన్నది.

    స్టాండర్డ్ ఐపీఎల్ ప్లేయర్స్ కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం ప్రతీ ఫ్రాంచైజీ ఈ సీజన్‌లో ఆటగాళ్లకు మూడు వాయిదాల్లో వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. సీజన్ ప్రారంభానికి ముందే మొదటి వేతనం బ్యాంకులో వేస్తారు. అలా ఇప్పటికే ప్రతీ ఆటగాడు మొదటి వాయిదా మొత్తం అందుకున్నారు. రెండు, మూడో వాయిదాలు సీజన్ ముగిసిన తర్వాత ఆయా ఫ్రాంచైజీలు ఆటగాడికి చెల్లిస్తాయి. అయితే ఈ సారి బీసీసీఐ లీగ్ వాయిదా వేసింది. అయినా సరే ఐపీఎల్ ఆటగాళ్లందరికీ ఫ్రాంచైజీలు పూర్తి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అందరు ఆటగాళ్ల వేతనాలు ఫ్రాంచైజీ ఇన్స్యూరెన్స్ పాలసీ కింద బీమా చేయబడి ఉంటాయి. ఆటగాడు గాయాల పాలైనా, ఏదైనా అనుకోని ఘటన కారణంగా లీగ్ ఆడలేకపోయినా ఈ బీమా కింద పూర్తి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐపీఎల్ వాయిదా బీసీసీఐ నిర్ణయం కాబట్టి ఫ్రాంచైజీలు వేతనాలు చెల్లించాల్సిందే. ఈ ఏడాది అన్ని ఫ్రాంచైజీలు కలిపి ఆటగాళ్లకు రూ. 483 కోట్లు వేతనాలు రూపంలో చెల్లించనున్నాయి.

    ఫ్రాంచైజీలు రెండు, మూడో విడత వేతనాలు ఐపీఎల్ ముగిసిన 3 నెలల్లో క్లియర్ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం మే 30కి ఐపీఎల్ అయిపోతుంది కాబట్టి అగస్టు నెలాఖరులోగా వేతనాలు చెల్లించాలి. లీగ్ వాయిదా పడినా.. ఆయా ఫ్రాంచైజీలు అగస్టు నెలాఖరులోగా చెల్లించడానికి వెసులు బాటు ఉంటుంది. ఏదేమైనా గత ఏడాది గేట్ ఆదాయం కోల్పోయిన ఫ్రాంచైజీలు.. ఈ సారి ఆదాయం కోల్పోవడమే కాకుండా పూర్తిగా జరగని సీజన్‌కు వేతనాలు చెల్లించాల్సి రావడం భారంగా మారనున్నది.
    Published by:John Naveen Kora
    First published: