Boxer turned into a Gangster : బాక్సింగ్ రింగ్ వదిలి.. గ్యాంగ్‌స్టర్‌గా మారి.. ఢిల్లీ పోలీసులు లిస్టులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

గ్యాంగ్‌స్టర్‌గా మారిన దీపక్ కోసం ఢిల్లీ పోలీసులు వెతుకుతున్నారు.

 • Share this:
  బాలీవుడ్‌లో ఫర్హాన్ అక్తర్ నటించిన తుఫాన్ అనే మూవీ త్వరలో విడుదల కానున్నది. అందులో ఒక గ్యాంగ్‌స్టర్ (Gangster).. బాక్సర్ (Boxer)గా మారిపోతాడు. బాక్సింగ్ రింగ్‌లో దిగి చాంపియన్‌గా నిలుస్తాడు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీలో సీన్ రివర్స్ అయ్యింది. బాక్సర్ (Boxer) కావాలని కలలు కన్న ఒక కుర్రాడు.. జాతీయ జూనియర్ బాక్సింగ్ చాంపియన్ (National Junior Boxing Champion) గా నిలిచాడు. కానీ అతడి చెడు సహావాసాలు, వ్యసనాలు బాక్సింగ్ కెరీర్‌ను నాశనం చేసింది. గ్యాంగ్‌స్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరి నేడు ఢిల్లీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ (Most Wanted Criminal) గా రికార్డులకు ఎక్కాడు. బాక్సింగ్ రికార్డులను సృష్టించాల్సిన అతడు పోలీసు రికార్డుల్లో చోటు సంపాదించాడు. అతడే దీపక్ పహల్. హర్యానాలోని సోనేపట్ జిల్లా గానౌర్‌ గ్రామంలో 1996లో దీపక్ జన్మించాడు. దీపక్‌కు 12 ఏళ్ల వయసున్నప్పుడు బీజింగ్‌లో జరిగిన ఒలంపిక్స్‌లో విజేందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. దీంతో బాక్సింగ్‌పై మక్కువ పెంచుకన్న దీపక్ వెంటనే స్థానిక బాక్సింగ్ క్లబ్‌లో చేరిపోయి సాధన మొదలు పెట్టాడు.

  బాక్సింగ్ క్లబ్‌లో చేరిన కొన్నాళ్లకే అతడిలోని ప్రతిభను గమనించిన కోచ్ అనిల్ మాలిక్ అతడికి కఠినమైన శిక్షను అందించాడు. క్లబ్‌లో చేరిన మూడేళ్లకే దీపక్ జూనియర్ స్థాయిలో జాతీయ చాంపియన్ అయ్యాడు. 2011లో చాంపియన్‌గా మారిన తర్వాత దీపక్ పలు అంతర్జాతీయ వేదికల్లో భారత్ తరపున ఆడి ఎన్నో పతకాలు గెలుచుకున్నాడు. ఏనాటికైనా ఒలంపిక్ పతకం సాధించాలని దీపక్ కలలు కనేవాడు. కానీ చెడు స్నేహాలు దీపక్ జీవితాన్న మరోవైపు తీసుకెళ్లింది.

  ఢిల్లీలో గోగి అనే పెద్ద గ్యాంగ్‌స్టర్ ఉండేవాడు. కొంత మందిని చేరదీసి ఒక ముఠాగా ఏర్పరిచి సుపారీ హత్యలు చేయించేవాడు. ఆ గ్యాంగ్‌తో దీపక్ పహల్‌కు పరిచయం ఏర్పడింది. కొద్ది కాలంలోనే గోగి బృందంలో కీలక సభ్యుడిగా మారిపోయాడు. హత్యలు, దొమ్మీలలో ఆరితేరిపోయాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం పెరోల్‌పై బయటకు వచ్చిన దీపక్ పహల్ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. కాగా, ఒక హత్య కేసులో గోగీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీ నుంచి గోగిని తప్పించడానికి పహల్ ఏకంగా కాల్పులకు తెగబడ్డాడు. గత వారంలో గోగిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా కాల్పులు ప్రారంభించారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో గోగి మరణించాడు. వెంటనే దీపక్ పహల్ అక్కడి నుంచి పారిపోయాడు. దీపక్‌ను పట్టిస్తే రూ. 2 లక్షల రివార్డును కూడా ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. అతడు ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారడంపై తల్లి, కోచ్ చాలా బాధపడుతున్నారు. తన కొడుకు సాధించిన పతకాలు చూసి ఆమె కన్నీరు పెట్టుకుంటున్నది. 'ఏదో ఒక రోజు దేశమంతా తన గురించి మాట్లాడుకోవాలని అనుకుంటున్నాను సార్' అని నాతో అనేవాడు.. కానీ ఇలా మారిపోతాడని అనుకోలేదని కోచ్ అనిల్ మాలిక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
  Published by:John Naveen Kora
  First published: