ఇండియా (India) - న్యూజీలాండ్ (New Zealand) జట్ల మధ్య బుధవారం తొలి టీ20 మ్యాచ్ జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకొని వెళ్లింది. టాస్ ఓడిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్‌లోనే డారిల్ మిచెల్ వికెట్ కోల్పోయింది. అయినా సరే మరో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (Martin Guptil), మార్క్ చాప్‌మన్ కలసి భారత బౌలర్లను చితకబాదారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ బంతిని మైదానానికి నలువైపులా తరలించారు. ముఖ్యంగా దీపక్ చాహర్‌ను (Deepak Chahar) టార్గెట్ చేసుకొని అతడి బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టుకున్నారు. ముఖ్యంగా మార్టిన్ గుప్తిల్ అతడి బౌలింగ్‌లో భారీ షాట్లు కొట్టాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో మార్టిన్ గుప్తిల్ 64 వద్ద బ్యాటింగ్ చేస్తుండగా దీపక్ చాహర్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టాడు. గుప్తిల్ కనీసం బంతి ఎక్కడ పడిందని కూడా చూడలేదు. అది భారీ సిక్సుగా నమోదయ్యింది.
ఇక ఆ తర్వాత బంతికి అసలు సీన్ మొదలైంది. దీపక్ చాహర్ మళ్లీ అదే రీతిలో బాల్ వేశాడు. మళ్లీ గప్తిల్ భారీ షాట్ కొట్టి అలాగే చూస్తుండిపోయాడు. అది నేరుగా వెళ్లి శ్రేయస్ అయ్యర్ చేతిలో పడింది. అప్పుడు చాహర్ ఒక చూపు చూశాడు. చాలా కూల్‌గా గుప్తిల్ కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ ఉండిపోయాడు. ఆ చూపు టీవీల్లో ప్రేక్షకులు చూసి వావ్ అంటూ మురిసిపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సెర్మనీలో అసలు ఎవరూ ఊహించని విధంగా చాహర్‌కు ఒక అవార్డు వచ్చింది. దీపక్ చాహర్‌కు 'మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. చాహర్ భారీగా పరుగులు ఇచ్చినా.. ఆఖర్లో గుప్తిల్ వికెట్ తీయకపోతే మరిన్ని పరుగులు వచ్చాయి. కీలక సమయంలో వికెట్ తీయడమే కాకుండా ఆ సమయంలో చాహర్ చూసిన చూపు అతడికి రూ. 1 లక్ష బహుమతి తెచ్చిపెట్టింది. ఇప్పుడు దీపక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
staring contest ?? pic.twitter.com/Dlltol4FXu
— Maara (@QuickWristSpin) November 17, 2021
ఇక భారత జట్టు ఛేజింగ్‌లో దుమ్ము రేపింది. సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 62 పరుగులు..ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) , రోహిత్ శర్మ ( 36 బంతుల్లో 48 పరుగులు.. 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తో రాణించారు. ఆఖర్లో పంత్, అయ్యర్ కీలక పరుగులు తీశారు. దీంతో భారత జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. కీలకమైన రెండో టీ20 ఈ నెల 19న రాంచీ వేదికగా జరుగనున్నది. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే సిరీస్ కైవసం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని న్యూజీలాండ్ భావిస్తున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs newzealand, Team India