DAVID WARNER MIMICS CRISTIANO RONALDO COCA COLA ACT CHECK VIDEO JNK
David Warner : క్రిస్టియానో రొనాల్డో లాగే కోక్ బాటిల్స్ పక్కన పెట్టేసిన వార్నర్.. తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసా?
రొనాల్డో లాగే కోక్ బాటిల్స్ తీసి పక్కన పెట్టిన వార్నర్
David Warner - Coca Cola: ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ గురువారం శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెర్స్లో పాల్గొన్నాడు. ఆ సమయంలో టేబుల్ మీద ఉన్న కోక్ బాటిల్స్ అక్కడి నుంచి తీసేశాడు. అప్పట్లో యూరో కప్‌లో క్రిస్టియానో రొనాల్డో చేసినట్లే వార్నర్ కూడా చేశాడు. తర్వాత ఏం జరిగిందంటే..
యూరో కప్ 2020 (Euro Cup 2020) సందర్భంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) టేబుల్ మీద ఉన్న కోకాకోలా (Cocacola) బాటిల్స్‌ను పక్కకు జరపడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాను అలాంటి డ్రింక్స్‌ను ఎండోర్స్ చేయను కాబట్టే పక్కకు పెట్టానని తెలిపాడు. ఆ తర్వాత పలువురు ఇతర ఫుట్‌బాలర్స్ కూడా బీరు బాటిళ్లను పక్కన పెట్టడం.. నీళ్ల సీసాలు పక్కన పెట్టడం చేశారు. దీంతో యూరో కప్ నిర్వాహకులు ఏకంగా ఒక హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చింది. ప్రెస్ కాన్ఫరెర్స్ సమయంలో స్పాన్సర్ల వస్తువులు అక్కడ ఉంచుతున్నాం. వాటిని పక్కకు పెట్టడం అంటే మనకు సహకరించిన వారిని అవమానించడమే కాబట్టి అలాంటి పనులు చేయవద్దని సూచించింది. దీంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది. కాగా, ప్రస్తుతం యూఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) జరుగుతున్నది. గురువారం రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపు ఇన్నింగ్స్ ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్ సందర్భంగా డేవిడ్ వార్నర్ అచ్చం క్రిస్టియానో రొనాల్డో చేసినట్లు గానే కోక్ బాటిల్స్‌ను అక్కడి నుంచి తీసేశాడు. 'ఈ బాటిల్స్‌ను నేను ఇక్కడి నుంచి తీసేయవచ్చా' అని ప్రశ్నించాడు. అయితే అక్కడే ఉన్న ఐసీసీ టీవీ క్రూ.. ఆ బాటిల్స్ తిరిగి అక్కడ పెట్టేయమని చెప్పడంతో టేబుల్ పై తిరిగి పెట్టేశాడు. 'ఇలా బాటిల్స్ తీయడం క్రిస్టియానోకు మంచిది అయితే.. నాకు కూడా మంచిదేగా' అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
కాగా, ఐసీసీతో కోకాకోలాకు 5 ఏళ్ల కాంట్రాక్టు ఉన్నది. 2023 వరకు జరిగే ఐసీసీ ఈవెంట్లలో కోకా కోలా బేవరేజ్ పార్ట్నర్గా ఉన్నది. దీంతో ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో వాటిని టేబుల్ మీద కనపడేలా పెడుతున్నారు. డేవిడ్ వార్నర్ అలా బాటిల్స్ తీయడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తిరిగి అక్కడ పెట్టేలా చేశారు. స్పాన్సర్లకు ఇబ్బంది కలిగించకూడదనే అలా చేశారు. అయితే డేవిడ్ వార్నర్ సరదాకు మాత్రమే అలా చేశాడని ఆ తర్వాత ఐసీసీ స్పష్టం చేసింది.
ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. కేవలం 42 బంతుల్లోనే 65 పరుగులు చేసి తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఐపీఎల్ 2021లో పూర్తిగా విఫలమైన వార్నర్ కీలకమైన వరల్డ్ కప్‌లో ఫామ్‌లోకి రావడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ బలం మరింత పెరిగింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.