హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 : డేవిడ్ వార్నర్ కూడా ఐపీఎల్ వదిలి వెళ్లిపోతున్నాడా? ఆస్ట్రేలియా ఆటగాళ్లు వెళ్లిపోవడం వెనుక కారణం ఏమిటి?

IPL 2021 : డేవిడ్ వార్నర్ కూడా ఐపీఎల్ వదిలి వెళ్లిపోతున్నాడా? ఆస్ట్రేలియా ఆటగాళ్లు వెళ్లిపోవడం వెనుక కారణం ఏమిటి?

డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కూడా ఐపీఎల్‌ వదిలి వెళ్తున్నారా? [PC: iplt20.com]

డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కూడా ఐపీఎల్‌ వదిలి వెళ్తున్నారా? [PC: iplt20.com]

ఐపీఎల్ 2021లో (IPL 2021) విదేశీ ఆటగాళ్లందరూ లీగ్ వదలి స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. మొదటి లెగ్ మ్యాచ్‌లు అయిపోగానే ముగ్గురు ఆస్ట్రేలియా (Australia) ఆటగాళ్లు ఐపీఎల్ వదిలేసి వెళ్లిపోయారు. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఆండ్రూ టై, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెందిన అడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ బయోబబుల్స్ వీడి ఆస్ట్రేలియా విమానం ఎక్కేశారు. ఇప్పుడు వీరితో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner), ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (Steve Smith) కూడా ఐపీఎల్‌ను వదిలేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇండియాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో పలు దేశాలు ఇక్కడి నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా త్వరలో తమ సరిహద్దులను మూసేయాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా నుంచి వచ్చే ఫ్లైట్స్ నిషేధించాలని ఇప్పటికే ఆస్ట్రేలియాలోని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇండియాలో రోజుకు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇతర దేశాల్లో ఆందోళన నెలకొన్నది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం త్వరలో సరిహద్దులు మూసేస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ త్వరగా తమ దేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు ఒక వార్తా సంస్థ పేర్కొన్నది. ఐపీఎల్‌లో పాల్గొంటున్న దాదాపు 30 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు, కోచ్‌లు, కామెంటేటర్లు ఇండియా నుంచి త్వరగా బయట పడాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండియాలో 8 వేల మంది ఆస్ట్రేలియా పౌరులు ఉన్నట్లు ఆ దేశ హోం మంత్రి కరెన్ ఆండ్రూస్ స్పష్టం చేశారు. వారందరూ తిరిగి క్షేమంగా ఆస్ట్రేలియా చేరుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ కౌల్టర్-నైల్ మాత్రం ముంబై ఇండియన్స్ జట్టుతో పాటే ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం బయోబబుల్‌లో క్షేమంగానే ఉన్నానని.. ఈ సమయంలో ప్రయాణాలు చేయడం రిస్క్ అని చెబుతున్నాడు.


సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ వదిలి వెళితే జట్టుకు పెద్ద నష్టమే. ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు ఉన్నది. గత ఐదు సీజన్లుగా క్రమం తప్పకుండా ప్లేఆఫ్స్ చేరుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో అంచనాలను అందుకోలేకపోతున్నది. ఈ సమయంలో జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముక వంటి వార్నర్ జట్టును వీడటం పెద్ద ఎదురుదెబ్బే. ఒక వేళ వార్నర్ కనుక ఆస్ట్రేలియా వెళ్లిపోతే కేన్ విలియమ్‌సన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నది. సన్‌రైజర్స్ జట్టు బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో కీలక మ్యాచ్ ఆడనున్నది.

First published:

Tags: David Warner, IPL 2021, Steve smith, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు