శ్రీలంక స్టార్ క్రికెటర్ ధనుష్క గుణతిలక (Danushka Gunatilaka)పై సిడ్నీకి చెందిన ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సిడ్నీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియాలో ధనుష్క రేప్ కేసులో అరెస్టయ్యాడనే వార్త ఆ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. టీ-20 ప్రపంచకప్ (T20 World Cup 2022) నుంచి శ్రీలంక సెమీఫైనల్‌కు చేరకుండానే ఇంటి బాట పట్టడం కంటే ఈ రేప్ విషయమే ఆ దేశస్థులను మరింత బాధ పడేలా చేస్తోంది. నిజానికి ధనుష్కకు వివాదాలు కొత్త కాదు. స్వదేశంలో కూడా ఈ ఆల్‌రౌండర్ లైంగిక దాడులకు పాల్పడ్డాడు.
ప్రస్తుతం శ్రీలంక ప్రజలు, మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు ఇతడి తాజా అరెస్టు గురించి చర్చించుకుంటున్నారు. ఇలాంటి చెడు ప్రవర్తన గల వ్యక్తికి ప్రతిష్ఠాత్మకమైన టీ20 ప్రపంచకప్ టీమ్‌లో ఛాన్స్ ఇవ్వడమే పెద్ద తప్పు అన్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డుని నిందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఫార్మాట్ల నుంచి ధనుష్కను సస్పెండ్ చేస్తున్నామని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. రేప్ విషయంలో దోషిగా తేలితే ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన ఈ అత్యాచార ఆరోపణలు శ్రీలంక క్రికెట్‌కు కూడా తలవంపులు తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు.
* జరిగిందేంటి..?
ఆస్ట్రేలియా సెక్స్ క్రైమ్స్ స్క్వాడ్ కమాండర్ డిప్యూటీ సూపరింటెండెంట్ జేన్ డోహెర్టీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాకి వెళ్లిన ధనుష్క డేటింగ్ యాప్ 'టిండర్'లో ఒక మహిళతో పరిచయం పెంచుకున్నాడు. వారిద్దరూ వారాల పాటు చాట్ చేసుకున్నారు. గత బుధవారం రాత్రి వీరు సిడ్నీలోని ఒపెరా బార్లో మొదటిసారి ఫేస్ టు ఫేస్ కలుసుకున్నారు, అయితే నెక్స్ట్ డే మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో వీరు రోజ్బేకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు.
ఎందుకంటే అక్కడే మహిళ ఇల్లు ఉంది. వీరిద్దరూ ఆ ఇంట్లో శృంగారంలో పాల్గొన్నాలని అనుకున్నారు. అయితే మహిళ శృంగారానికి ముందు ధనుష్కను కండోమ్ ధరించమని కోరింది. అందుకు అతడు అంగీకరించలేదు. ఈ విషయంలో వారిద్దరి మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. వాదనల తర్వాత ధనుష్క ఆ మహిళ గొంతు నొక్కి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
శనివారం రాత్రి ఆస్ట్రేలియా నుంచి తిరిగి ఇంటికి పయనమైనప్పుడు పోలీసులు ధనుష్కను పట్టుకున్నారు. నిన్న ఆస్ట్రేలియా కోర్టులో హాజరుపరచారు. బెయిల్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు.
* గతంలో కూడా ఆరోపణలు
ధనుష్క క్రమశిక్షణా ఆరోపణలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదని ఆస్ట్రేలియా అధికారుల దర్యాప్తులో తేలింది. గత రెండేళ్లలో ఈ ఆటగాడు ఆడవారిపై దుష్ప్రవర్తనకు సంబంధించి కనీసం మూడు ఆరోపణలను ఎదుర్కొన్నాడు.
గత రెండేళ్లలో మహిళలను వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలపై దక్షిణాదిన రెండు కేసులు అతడిపై బుక్కయ్యాయి. అందులో ఒకటి ఏంటంటే, ఈ క్రికెటర్ మిరిస్సాలోని నైట్‌క్లబ్/హోటల్‌కు వెళ్లి ఒక మహిళతో రొమాన్స్ చేయడానికి ప్రయత్నించాడు. అతడి అసభ్య ప్రవర్తనకు ఆ మహిళ చాలా కోపగించి చెంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయిందట.
2018లో కొల్లుపిటియాలోని అతడి హోటల్ గదిలో నార్వేజియన్ మహిళపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అతని సహచరుడు సందీప్ జూడ్ సెల్లియా జట్టు హోటల్లోని ఒక గదిలో ఇద్దరు నార్వేజియన్ మహిళల్లో ఒకరిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ధనుష్కను ప్రశ్నించారు. ఈ కేసులో ధనుష్క నిందితుడు కాదని తేలింది. అయితే క్రికెట్ బోర్డు విచారణలో అతను జట్టు క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు రుజువైంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ బ్యాట్స్‌మన్‌పై SLC ఆరు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది.
SLC నియమాల ప్రకారం మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లు తప్పనిసరిగా అర్ధరాత్రి వారి హోటల్ గదులలో ఉండాలి. అతిథులను తీసుకురాకూడదు. 2018లో జరిగిన ఈ సంఘటన అక్టోబరు 2017లో అతను మరొక క్రమశిక్షణా విచారణను ఎదుర్కొన్న కొద్ది నెలలకే జరిగింది. అక్కడ అతను అర్థరాత్రి పార్టీలో పాల్గొన్నాడు. 2021లో ఇంగ్లాండ్ టూర్ సమయంలో కూడా, కోవిడ్-19 సమయంలో బయో బబుల్ ఉల్లంఘన కారణంగా అతను, నిరోషన్ డిక్వెల్లా, కుసాల్ మెండిస్ ఒక సంవత్సరం నిషేధాన్ని ఎదుర్కొన్నారు. కాగా ఇన్ని ఆరోపణలతో ఉన్న ధనుష్కను శ్రీలంక క్రికెట్ సెలక్షన్ కమిటీ ఎలా బ్యాకప్ ప్లేయర్‌గా జాతీయ క్రికెట్ జట్టులో ఉంచిందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
(Jamila Hussain - The Daily Mirror)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Cricket, Sri Lanka, T20 World Cup 2022