CWG 2022 : బర్మింగ్ హామ్ (Birmingham) వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో ఆటగాళ్లు బాహాబాహీకి దిగారు. ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకునే కొట్టుకునేంత పని చేశారు. ప్రతిష్టాత్మక క్రీడల్లో తమ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామనే విషయాన్నే మరిచిపోయారు. ఆ ఇద్దరు హాకీ ఆటగాళ్లు చొక్కాలు పట్టుకుని ఒకరినొకరు నెట్టేసుకున్నారు. సహచర ఆటగాళ్లు మధ్యలో కలుగచేసుకొని వారిని విడిపించడంతో టీవీల్లో చూసే వారికి రెజ్లింగ్ మ్యాచ్ చూడాల్సి రాలేదు. లేదంటే హాకీ గ్రౌండే రెజ్లింగ్ మ్యాట్ గా మారిపోయి ఉండేది. గురువారం కెనడా, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ లో ఇరు జట్లకు కూడా విజయం తప్పనిసరి. దాంతో ఆటగాళ్లు ఆరంభం నుంచే గెలుపు కోసం హోరాహోరీగా తలపడ్డారు.
ఇంగ్లండ్ 4-1తో ఆధిక్యంలో ఉండగా ఈ చేదు సంఘటన చోటు చేసుకుంది. రెండో క్వార్టర్ ముగియడానికి కొన్ని నిమిషాల సమయం ఉండగా.. కెనడా ప్లేయర్ బాల్‌రాజ్ పనేసర్, ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ గ్రిఫిత్స్ మధ్య వివాదం తలెత్తింది. ఆట కొనసాగుతుండగా గ్రిఫిత్స్ బంతిని తీసుకునే ప్రయత్నం చేయగా.. పనేసర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో మాటలతో మొదలైన వీరి యుద్ధం చొక్కాలు పట్టుకునేంత వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.
Thanks to @JaspreetSSahni for showing me a new sport that combines Hockey and Wrestling pic.twitter.com/UiRopSLNfQ
— Digvijay Singh Deo (@DiggySinghDeo) August 4, 2022
ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం.. ఒకరినొకరు చొక్కాలు పట్టుకునే స్థాయికి వెళ్లింది. ఒకానొక సమయంలో పనేసర్.. గ్రిఫిత్స్ గొంతు కూడా పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. దీంతో సహచర ఆటగాళ్లు వచ్చి ఇద్దరినీ విడదీశారు. ఇక ఈ ఘటనలో బాల్‌రాజ్‌కు అంపైర్ రెడ్ కార్డ్ చూపడంతో మైదానాన్ని వీడగా.. గ్రిఫిత్స్‌కు యెల్డో కార్డ్ జారీ అయింది. మ్యాచ్ విషయానికొస్తే.. 11-2తో కెనడాను ఓడించిన ఇంగ్లండ్ సెమీస్ చేరింది.
భారత్ అదరహో
పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ కూడా సెమీఫైనల్ కు చేరుకుంది. వేల్స్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 4-1తో గెలుపొంది సెమీ ఫైనల్ చేరుకుంది. వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో రాణించడంతో అద్భుత విజయం అందుకుంది. ఆస్ట్రేలియాతో సెమీస్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Commonwealth Game 2022, England, Hockey, India Vs Westindies, Pv sindhu, Smriti Mandhana