CUBAN WOMAN SAYS MARADONA RAPED HER AS TEENAGER STOLE MY CHILDHOOD JNK
Diego Maradona: మారడోనా నాపై అత్యాచారం చేశాడు.. నా బాల్యాన్ని లాగేసుకున్నాడు.. మహిళ ఆరోపణ
మారడోనాపై అత్యాచార ఆరోపణలు చేసిన క్యూబా మహిళ (PC: AP)
Diego Maradona: ఫుట్‌బాల్ దివంగత దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా తనపై అత్యాచారం చేసినట్లు క్యూబాకు చెందిన మహిళ సంచలన ఆరోపణలు చేసింది. అతడు నా టీనేజీలో రేప్ చేసి నా బాల్యాన్నంతా లాక్కున్నాడని ఆరోపించింది.
ఫుట్‌బాల్ (Football) దిగ్గజం, అర్జెంటీనా (Argentina) మాజీ క్రీడాకారుడు, దివంగత డిగో మారడోనాపై (Diego Maradona) ఒక మహిళ సంచలన ఆరోపణలు చేసింది. మరడోనా తనపై అత్యాచారం (Rape) చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేశాడని.. భౌతిక దాడికి పాల్పడ్డాడని ఆమె విలేకరుల ఎదుట వాపోయింది. బాధితురాలు మావిస్ అల్వారెజ్ విలేకరుల సమావేశంలో చెప్పిన వివరాల ప్రకారం ఈ ఘటన కేసు 2001లో జరిగింది. అప్పట్లో మారడోనా వయసు 40 ఏళ్లు కాగా, బాధితురాలి వయసు 16. క్యూబాలో (Cuba) మారడోనా డ్రగ్స్ సంబంధిత చికిత్స తీసుకునే సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే మారడోనా గత ఏడాది నవంబర్‌లో మరణించారు. ఆయన చనిపోయి ఏడాది గడిచిన తర్వాత మావిస్ ఈ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఈ విషయంలో బాధితురాలు ఎవరిపై కూడా పిర్యాదు చేయలేదు. దీంతో అర్జెంటీనాకు చెందిన ఒక స్వచ్చంద సంస్థ విచారణ చేపట్టింది.
మావిస్ అల్వారెజ్ సోమవారం మాట్లాడుతూ.. ఫుట్‌బాల్ ఆటగాడు డియెగో మారడోనా మాదక ద్రవ్య వ్యసనానికి చికిత్స కోసం క్యూబాలో ఉన్నప్పుడు మొదటిసారి కలిశాడు. హవానాలోని క్లినిక్‌లో తన తల్లి పక్క గదిలో ఉండగానే మారడోనా తనపై అత్యాచారం చేశాడని మహిళ తెలిపింది. “అతను నా నోరు నొక్కేశాడు. అతను నాపై అత్యాచారం చేశాడు. దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించడం లేదు. అయితే నా బాల్యమంతా లాక్కోబడింది. నా చిన్ననాటి గుర్తులన్నీ మాయమయ్యాయి. అది చాలా కష్టంగా ఉన్నది" అని మావిస్ అల్వారెజ్ ఆవేదన వ్యక్తం చేసింది.
మారడోనాకు క్యూబా ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే నేను నా బాధను బయటకు చెప్పుకోలేదు. మారడోనా అప్పట్లో నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆయన అప్పటికే డ్రగ్స్‌కు బానిసయ్యాడు. నాతో సన్నిహితంగా ఉన్న రోజుల్లో చాలాసార్లు మాదక ద్రవ్యాలు తీసుకోవాలని బలవంతం చేసేవాడు. చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా భౌతిక దాడికి కూడా పాల్పడ్డాడు అని అల్వారెజ్ చెప్పుకొచ్చింది.
అర్జెంటీనాకు చెందిన స్వచ్చంద సంస్థ విచారణలో భాగంగా గతవారం కోర్టుకు వచ్చి ఆమెకు జరిగిన ఉదంతాన్ని వివరించింది. అవే విషయాలను మీడియా ముందు కూడా వెల్లడించింది. తనలా చాలా మంది బాధితులు ఉండి ఉంటారని.. కనీసం నన్ను చూసైనా వాళ్లు బయటకు వచ్చి మాట్లాడతారని ఆమె పేర్కొన్నది.
కాగా మహిళ ఆరోపణలపై క్యూబా ప్రభుత్వం స్పందించలేదు. తాను తిరిగి అర్జెంటీనాకు రావడం చాలా కష్టమని.. అక్కడ మారడోనా చాలా మందికి హీరోగా మిగిలిపోయాడు. అలాంటి దేశంలో తాను జీవించడం కష్టం. అతడు ప్రతీ చోటా కనిపిస్తుంటాడు. అవన్నీ తలుచుకోవడానికి నాకు అసహ్యంగా ఉంటుంది. అందుకే వెళ్లడం లేదని మావిస్ చెప్పింది.
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.