CSK VS RR RUTURAJ GAIKWAD SUPER CENTURY HELPS CSK TO SCORE 189 FOR 4 AGAINST RAJASTHAN ROYALS JNK
CSK vs RR: రుతురాజ్ ఖతర్నాక్ సెంచరీ.. చెలరేగిన చెన్నై.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్
రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీ.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్ (PC: IPL)
CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 60 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అతడికి చివర్లో రవీంద్ర జడేజా మెరుపులు తోడవడంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 189/4 స్కోర్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ గెలవడానికి 190 పరుగులు చేయాల్సి ఉన్నది.
ఐపీఎల్ 2021లో భాగంగా ఇవాళ అబుదాబి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగులు వరదలై పారాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 60 బంతుల్లో 101 పరుగులు చేశాడు. రుతురాజ్ చేసిన ఖతర్నాక్ సెంచరీతో చెన్నై భారీ స్కోర్ చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ (25), మొయిన్ అలీ (21) పర్వాలేదని పించారు. అయితే సురేశ్ రైనా (3), అంబటి రాయుడు విఫలమయ్యారు. ఆఖర్లో రవీంద్ర జడేజా (32) మెరుపులు మెరిపించాడు. రుతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లో అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత అర్ద సెంచరీకేవలం 17 బంతుల్లోనే సాధించడం విశేషం. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు 5 సిక్సులు ఉన్నాయి. ఆఖరి బంతికి భారీ సిక్సర్ కొట్టి ఐపీఎల్లో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్ కలసి రాజస్థాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. అయితే వీళ్లిద్దరూ సహజ శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడారు. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించిన అనంతరం ఫాఫ్ డు ప్లెసిస్ (25) రాహుల్ తెవాతియా బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. సురేశ్ రైనా (3) మరోసారి నిరాశ పరిచాడు. కానీ మరో ఎండ్‌లో రుతురాజ్ గైక్వాడ్ రాజస్థాన్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. మొయిన్ అలీతో కలసి మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అంబటి రాయుడు (2) కూడా తక్కవ స్కోరుకే అవుటవడంతో చెన్నయ్ కనీసం 160 పరుగులు దాటుతుందా అనే అనుమానం కలిగింది.
అయితే 43 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత రుతురాజ్ గైక్వాడ్ పరుగుల వేగం పెంచాడు. అతడికి రవీంద్ర జడేజా తోడయ్యాడు. జడేజా 15 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఇక రుతురాజ్ మిగిలిన 17 బంతుల్లోనే 50 పరుగులు జోడించి సెంచరీ నమోదు చేశాడు. ఆఖరి బంతికి భారీ సిక్స్ కొట్టి ఐపీఎల్లో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. దీంతో చెన్నయ్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లో కోల్పోయి 189 పరుగులు చేసింది. రాహుల్ తెవాతియా 3 వికెట్లు తీయగా.. చేతన్ సకారియాకు ఒక వికెట్ దక్కింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.