ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నైసూపర్ కింగ్స్(సీఎస్కే)కి ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్లో ఇండియాను అగ్రపథాన నిలబెట్టిన మహేంద్రసింగ్ ధోని ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ధోనీ సారథ్యంలోని సీఎస్కే జట్టు టైటిల్ వేటలో ఎప్పుడూ ముందుంటుంది. అదే మాదిరిగా చెన్నైకి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. సీఎస్కే యాజమాన్యం అప్పుడప్పుడు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. ఇక చెన్నైసూపర్ కింగ్స్ జట్టుకు ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనే అభిమానులు ఉన్నారు. మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ సీఎస్కేకు మద్దతిచ్చే పలువురు సెలబ్రెటీలకు జెర్సీలను కూడా ఈ ఐపీఎల్ జట్టు అందించింది. కాగా, ఇండియాకు ఒలింపిక్‌లో గోల్డ్ మెడల్ అందించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాకు సీఎస్కే యాజమాన్యం భారీ నజరానా ప్రకటించింది. అంతేకాకుండా 8758 నంబర్‌తో తన టీమ్ జెర్సీని అందించనున్నట్లు తెలిపింది. అథ్లెట్ ఫైనల్లో 87.58 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. అది అతనికి బంగారు పతకాన్ని సాధించింది. అందుకే అదే నంబర్‌తో సీఎస్కే జెర్సీ రూపొందించనున్నారు.
ధోనీకి నీరజ్ సబార్డినేట్..
ఆగష్టు 7, 2021 - భారతదేశ క్రీడా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. జావెలిన్ త్రోలో అథ్లెట్ నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. 139 కోట్ల భారతీయుల ఆశలను నిలబెట్టాడు. అతని అద్భుతమైన విజయానికి ప్రశంసిస్తూ గౌరవ సూచకంగా సీఎస్కే జట్టు నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు ప్రకటించింది. ఈ విషయాన్నిసీఎస్కే తన అధికారిక వెబ్సైట్, సోషల్‌మీడియా అకౌంట్లలో పేర్కొంది. ఫ్రాంచైజీ నీరజ్ పేరిట 8758 నంబర్‌తో ప్రత్యేక సీఎస్కే జెర్సీని కూడా అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎస్కే ఓ ప్రకటన విడుదల చేసింది. " టోక్యో 2020 లో నీరజ్ చోప్రా చేసిన ప్రయత్నం మిలియన్ల మంది భారతీయులకు స్ఫూర్తినిస్తుంది. క్రీడల్లోని ఏ విభాగంలోనైనా అత్యున్నత స్థాయిలో పోటీ పడి రాణించగలననే విశ్వాసాన్ని కలిగిస్తుంది. పురుషుల జావెలిన్‌లో అతని స్వర్ణ పతకం మొత్తం దేశాన్ని ఉత్తేజపరిచింది. బంగారు పతకం సాధించి అభివన్ బింద్రా సరసన చేరిన నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు. ఈ విభాగంలో మరెందరో చేరాలని కోరుకుంటున్నాం” అని తెలిపింది. అలాగే ధోనీ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడు. ఆర్మీలోనే జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ హోదాలో ఉన్న అథ్లెట్ నీరజ్ భారత్‌కు బంగారు పతకాన్ని తీసుకురావడం ఆనందంగా ఉందని సీఎస్కే తెలిపింది. అతనికి కల్నల్ ధోనీ శుభాకాంక్షలు కూడా తెలిపినట్లు ప్రకటనలో పేర్కొంది.
కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం రియోలో కంటే అత్యుత్తమంగానే ఉంది. 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలను గెలుచుకుంది. చాలా పతకాలు కొద్దిలో సాధించలేకపోయారు, చాలామంది పతకాల వేటలో నాలుగో స్థానంలో నిలిచారు. నీరజ్ అసాధారణ కృషికి గాను బీసీసీఐ ఇప్పటికే కోటి రూపాయల బహుమతిని ప్రకటించింది. రివార్డ్‌ల విషయానికొస్తే, నీరజ్ కాకుండా, బీసీసీఐ సిల్వర్ మెడల్ విజేతలకు ఒక్కొక్కరికి రూ .50 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ. 25 లక్షలు బహుమతిగా ప్రకటించింది. అంతేకాకుండా, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో జర్మనీని ఓడించి కాంస్య పతకం గెలుచుకున్నందుకు మొత్తం భారత పురుషుల హాకీ జట్టుకు రూ .1.25 కోట్ల భారీ పారితోషికం కూడా ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Csk, IPL, MS Dhoni, Tokyo Olympics