Home /News /sports /

CRICKET WILL BE SEEN AS OLYMPIC EVENT IN 2028 LOS ANGELS OLYMPICS SAYS BCCI SECRETARY JAY SHAH JNK

Cricket: ఒలింపిక్స్‌లోకి క్రికెట్ వచ్చేస్తోంది.. శుభవార్త చెప్పిన బీసీసీఐ కార్యదర్శి జై షా

ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌ను చేర్చడానికి బిడ్ దాఖలు చేయనున్న ఐసీసీ (PC: Olympics/Twitter)

ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌ను చేర్చడానికి బిడ్ దాఖలు చేయనున్న ఐసీసీ (PC: Olympics/Twitter)

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను మెడల్ ఈవెంట్‌గా చేర్చడానికి ఐసీసీ, బీసీసీఐ కలసి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అన్నీ సానుకూలంగా జరిగితే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఐవోసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నది.

ఇంకా చదవండి ...
    టోక్యో ఒలింపిక్స్ 2020 (Tokyo Olympics) విజయవంతంగా ముగిశాయి. భారత అథ్లెట్లు రికార్డు స్థాయిలో 7 పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేశారు. విశ్వ క్రీడల్లో అన్ని రకాల ఈవెంట్లు ఉన్నా.. జెంటిల్‌మెన్ గేమ్ క్రికెట్ (Cricket) లేకపోవడంపై చాలా మంది ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్ వచ్చిన ప్రతీసారి క్రికెట్‌ను చేర్చాలనే డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ విధంగా ఇంత వరకు ప్రయత్నాలు మాత్రం జరగలేదు. ఎన్నో క్రీడలు ప్రమాదకరమైనవిగా చెబుతూ ఒలింపిక్స్ ఈవెంట్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు. కానీ ఎలాంటి ప్రమాదం లేని క్రికెట్‌ను మాత్రం చేర్చడం లేదు. 130 ఏళ్ల ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో కేవలం 1900 ప్యారీస్ ఒలింపిక్స్‌లో మాత్రమే క్రికెట్ ఒక ఈవెంట్‌గా నిర్వహించారు. కేవలం ఒకే ఒక మ్యాచ్ నిర్వహించగా అందులో గ్రేట్ బ్రిటన్ గెలుపొందింది. ఆ తర్వాత క్రికెట్ ఊసే ఎత్తలేదు. అప్పట్లో క్రికెట్ ఆరు రోజుల పాటు నిర్వహించే ఫార్మాట్‌లో ఉండటంతో దానికి ఒలింపిక్స్‌లో స్థానం లేకుండా పోయింది. అయితే వన్డే క్రికెట్ వచ్చిన తర్వాత మరోసారి క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న టీ20 ఫార్మాట్‌లో ఒలింపిక్స్ ఈవెంట్‌గా నిర్వహించాలని భావిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఐసీసీ (ICC) ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో కలసి ఐసీసీ ఈ విషయంపై చర్చలు జరపింది.

    ఇటీవల కాలంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ)తో (IOC) కూడా ఐసీసీ చర్చలు జరిపింది. ఐసీసీ, బీసీసీఐ (BCCI) కలసి క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో ఒక మెడల్ ఈవెంట్‌గా చేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడానికి బీసీసీఐ పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని ఆయన అన్నారు. అప్పట్లో ఐవోసీతో ఐసీసీ చర్చలు జరిపినప్పుడు బీసీసీఐ మద్దతు లేదు. కానీ ఇప్పుడు బీసీసీఐ మద్దతు ఇస్తున్నది. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి ఐసీసీ త్వరలోనే బిడ్ వేయనున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలంగా జరిగితే 2028 లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఒలింపిక్ ఈవెంట్‌గా చేర్చడం ఖాయంగానే కనిపిస్తున్నది.

    టీ20 లేదా టీ10 ఫార్మాట్‌లో క్రికెట్‌ను నిర్వహించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2024 ప్యారీస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ నిర్వహించడానికి అవకాశం లేదు గానీ 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో మాత్రం తప్పకుండా క్రికెట్ భాగస్వామ్యం అవుతుందని తెలుస్తున్నది. ఆ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి ఐసీసీ తమ బిడ్‌ను దాఖలు చేయనున్నది. టీ20 వరల్డ్ కప్ జరిగే ఫార్మాట్‌లోనే కొన్ని మార్పులు చేసి ఒలింపిక్స్‌ నిర్వహించనున్నారు. లేదంటే టీ10 ఫార్మాట్‌ లేదా ది హండ్రెడ్ ఫార్మాట్ అయినా ఓకే అని ఐసీసీ చెప్పినట్లు తెలుస్తున్నది. అయితే బీసీసీఐ మాత్రం టీ20 ఫార్మాట్ అయితేనే ప్రేక్షకుల ఆదరణ కూడా ఉంటుందని చెబుతున్నది. ఎనిమిది టీమ్స్‌ను ఒలింపిక్స్‌కు క్వాలిఫై చేసి క్రికెట్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, Cricket, ICC, IOC, Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు