Cricket : పాకిస్తాన్‌తో సిరీస్ ఆడకుండా బయోబబుల్ దాటిన సౌతాఫ్రికా ప్లేయర్లు.. ఎందుకో తెలుసా?

Cricket South Africa players coming to IPL

  • Share this:
    దక్షిణాఫ్రికా - పాకిస్తాన్ (South Africa Vs Pakistan) జట్ల మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతున్నది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో సఫారీలు ఒకటి, పాకిస్తాన్ జట్టు మరొకటి గెలవడంతో సిరీస్ 1-1తో సమం అయ్యింది. కీలకమైన మూడో మ్యాచ్ బుధవారం (ఏప్రిల్ 7) జరుగనున్నది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు నాలుగు మ్యాచ్‌లో టీ20 సిరీస్ కూడా ఆడాల్సి ఉన్నది. ఇలాంటి సమయంలో ఆ దేశ క్రికెటర్లు రెండో వన్డే అనంతరం జట్టు బయోబబుల్ వదలి బయటకు వచ్చారు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐదుగురు కీలక ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL) ఆడటానికి జట్టును వదిలి ఇండియా ప్రయాణం అయ్యారు. క్వింటన్ డికాక్ (ముంబై ఇండియన్స్) (Mumbai Indians), డేవిడ్ మిల్లర్ (రాజస్థాన్ రాయల్స్)(Rajathan Royals), లుంగి ఎన్‌గిడి (చెన్నై సూపర్ కింగ్స్)(Chennai Super Kings), కగిసో రబాడ (ఢిల్లీ క్యాపిటల్స్)(Delhi Capitals), ఎన్రిచ్ నోకియా (ఢిల్లీ క్యాపిటల్స్) ప్రస్తుతం తమ జట్లతో కలవడానికి వస్తున్నారు. బీసీసీఐ(BCCI), క్రికెట్ సౌత్‌ఆఫ్రికా (Cricket South Africa) మధ్య ఉన్న ఐపీఎల్ ఒప్పందం మేరకు ఆ ఐదుగురు ఆటగాళ్లను సీఎస్ఏ విడుదల చేసినట్లు తెలుస్తున్నది.

    ఆ ఐదుగురు ఆటగాళ్లు సోమ లేదా మంగళవారం ఇండియా చేరుకున్నా.. వారి జట్ల తొలి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ అని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. బీసీసీఐ బయోబబుల్ ప్రోటోకాల్స్‌ను అనుసరించి బయోబబుల్ టూ బయోబబుల్ ట్రాన్స్‌ఫర్ చార్టెడ్ ఫ్లైట్ ద్వారా జరిగితే వెంటనే ఆయా ఫ్రాంచైజీలతో చేరే అవకాశం ఉన్నది. అయితే ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పనిసరిగా చేయించుకోవాలి. వాస్తవానికి వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఈ ఆటగాళ్లందరూ ఆయా జట్లతో చేరాల్సి ఉన్నది. అయితే కోవిడ్ నిబంధనలు కఠినతరం కావడంతో మూడు రోజులు ముందుగానే ఆయా ఆటగాళ్లు ఇండియాకు బయలుదేరారు.





    బీసీసీఐ, క్రికెట్ సౌత్ ఆఫ్రికా మధ్య ఉన్న ఒప్పందం మేరకే ఆటగాళ్లను విడుదల చేశామని సీఎస్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఆటగాళ్లు కనుక జాతీయ జట్టుకే ఆడాలనుకుంటే వారు ఇక్కడే ఉండవచ్చు. అయితే ఆయా ఫ్రాంచైజీలతో సదరు ఆటగాళ్లు కుదుర్చుకున్న ఒప్పదం కారణంగా జాతీయ జట్టును త్వరగా వదిలేసి ఇండియాకు వెళ్లారని బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు కీలకమైన సిరీస్ జరుగుతున్న సందర్భంగా నేషనల్ క్రికెట్ టీమ్‌ను వదలి ఆటగాళ్లు వెళ్లిపోవడాన్ని ఆ దేశ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో కీలకంగా ఉన్న ఆటగాళ్లు మిస్ అవడంతో చివరి వన్డే సహా టీ20 సిరీస్‌లో ప్రదర్శన ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు.
    Published by:John Naveen Kora
    First published: