హోమ్ /వార్తలు /క్రీడలు /

బీసీసీఐ పగ్గాలు చేపట్టిన సౌరవ్ గంగూలీ..

బీసీసీఐ పగ్గాలు చేపట్టిన సౌరవ్ గంగూలీ..

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న గంగూలీ

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో దాదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో దాదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. దీంతో ఆయన బీసీసీఐ పగ్గాలు అందుకున్నారు. ఇప్పటి వరకు అంటే.. 33 నెలల పాటు బీసీసీఐని సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీ నడిపించింది. ఆ కమిటీ తప్పుకోవడంతో 39వ అధ్యక్షుడిగా గంగూలీ నియమితులయ్యారు. దాదాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, అనురాగ్‌ ఠాకూర్‌ తమ్ముడు అరుణ్‌ సింగ్‌ ధూమల్‌ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, ఒక మాజీ క్రికెటర్‌ పూర్తి స్థాయి బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం 65 ఏళ్లలో ఇదే తొలి సారి. చివరిసారి 1954లో విజయనగరం మహారాజు విజయానంద గజపతిరాజు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతడు భారత మాజీ కెప్టెన్ కూడా.

  2014లో సునీల్‌ గవాస్కర్‌, శివలాల్‌ యాదవ్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. కానీ, వారు కొన్ని నెలలు మాత్రమే తాత్కాలిక విధుల్లో ఉన్నారు. పూర్తి స్థాయిలో బీసీసీఐ పగ్గాలు చేపట్టిన గంగూలీ మరో పది నెలల పాటు మాత్రమే పదవిలో ఉంటారు. ఐదేళ్లకు పైగా క్రికెట్‌ పాలన వ్యవహారాల్లో దాదా ఉండటంతో లోథా కమిటీ నిబంధన ప్రకారం.. వచ్చే ఏడాది జూలైలో ఆయన తన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత తిరిగి బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: Amit Shah, Bcci, Network18, News18, Sourav Ganguly, West Bengal

  ఉత్తమ కథలు