మహేంద్ర సింగ్ ధోని (ఫైల్)
మహేంద్ర సింగ్ ధోని.. ఐపీఎల్లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. చెన్నైని అన్ని సార్లు ప్లే ఆఫ్‌కు చేర్చిన ‘తాలా’. మొత్తంగా మిస్టర్ కూల్. అభిమానుల్లో ధోనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన ఫ్యాన్స్‌ను సరదాగా ఆటపట్టిస్తూ గొప్ప అనుభూతులను పంచే ఈ సీఎస్కే కెప్టెన్.. ఏది చేసినా సంచలనమే. కూతురితో ఆడుకున్నా, భార్యతో కలిసి ఫోటోకు ఫోజిచ్చినా, తన పెంపుడు జంతువులతో టైంపాస్ చేసినా వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తారు. ధోని ఏది చేసినా హుందాగా, వినయంగా ఉంటుంది. తన నాయకత్వ లక్షణాలతో, వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసేస్తాడు. బౌలర్లకు విలువైన సలహాలు ఇస్తూ వారి ప్రతిభను వెలికి తీస్తాడు. అయితే, ప్రస్తుత ఐపీఎల్లో ధోని కొన్ని ఆసక్తికర సంఘటనలకు కారణమయ్యాడు. వాటిని పరిశీలిస్తే..
ఎయిర్‌పోర్టులో ఫ్లోర్‌పైనే నిద్ర:ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వాన్ని అలవర్చుకున్నాడు ధోని. దానికి నిదర్శనమే ఫ్లోర్‌పైనే నిద్రించడం. ఐపీఎల్లో భాగంగా కోల్‌కతాపై గెలిచిన అనంతరం వేరే చోటుకు పయనమవుతూ ఎయిర్‌పోర్టులోని ఫ్లోర్‌పైనే ధోని, అతడి భార్య సాక్షి నిద్రించారు. తన ఇన్స్టాగ్రామ్ ధోని ఈ ఫోటోను పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోటోకు లక్షల్లో లైకులు వచ్చాయి. ఇది ధోని సింప్లిసిటీకి నిదర్శనమని నెటిజన్లు కొనియాడారు.

ఫ్లోర్‌పై నిద్రిస్తున్న ధోని, సాక్షి (ఇన్స్టాగ్రామ్ ఫోటో)
అంపైర్లతో వాగ్వాదం:
భారత జట్టు ఘోరంగా ఓడిన సందర్భాల్లో కూడా టెంపర్ కోల్పోకుండా ఎంతో సంయమనంతో వ్యవహరిస్తాడు. కానీ, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘కూల్’ ధోని హాట్.. హాట్..గా మారిపోయాడు. బెన్‌స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో నాలుగో బంతిని ముందు లెగ్ అంపైర్ ‘నో బాల్’గా ప్రకటించాడు. తర్వాత మరో అంపైర్ దాన్ని తోసిపుచ్చాడు. ఈ విషయంలో ఇద్దరు అంపైర్ల మధ్య గందరగోళం నెలకొంది. అంపైర్‌తో చర్చించిన తర్వాత లెగ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, సరైన బంతిగా ప్రకటించాడు. ఆ బాల్‌కు ముందే అవుటై, పెవిలియన్ చేరిన ధోనీ... ఈ నిర్ణయంతో ఆగ్రహానికి లోనయ్యాడు. ముందు కొన్నిసెకన్ల పాటు జరుగుతున్న గందరగోళాన్ని పెవిలియన్ నుంచే చూసిన ధోనీ... ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థం కానట్టుగా... మ్యాచ్ జరుగుతుండగానే స్టేడియంలోకి వచ్చి, అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. నిజానికి మ్యాచ్ జరుగుతున్నప్పుడు మిగిలిన ప్లేయర్స్ క్రీజు లోపలికి రాకూడదు. కానీ, ధోని గ్రౌండ్ లోపలికి వచ్చాడు. అందుకు ధోనికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత కూడా పడింది.

అంపైర్లతో ధోని వాగ్వాదం
కళ్లు చెదిరే స్టంపింగ్:
ధోని వికెట్ల వెనుక ఉన్నపుడు బ్యాట్స్‌మన్ క్రీజు దాటి బయటికి వస్తే.. అంతే సంగతులు. అటు నుంచి అటే పెవిలియన్ చేరాల్సిందే. ఎందుకంటే ధోని స్టంపింగ్ అంత ఫాస్ట్‌గా ఉంటుంది. బాల్ చేతికి అందడమే లేటు.. బెయిల్స్‌ను గిరాటేస్తాడు. క్షణకాలంలో చేసే స్టంపింగ్లను స్లో మోషన్ చూసినా వీడియో స్పష్టంగా కనిపించదంటే అతిశయోక్తి కాదు. అలాంటి దృశ్యమే ఈ ఐపీఎల్లో చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ మోరిస్, శ్రేయస్ అయ్యర్‌లను తన స్టంపింగ్ స్కిల్స్‌తో పెవిలియన్‌కు పంపించాడు. ఆ రెండు స్టంపింగ్‌లు ఒకదానికి మరొకటి యాక్షన్ రిప్లైగా కనిపించాయి.
ఐపీఎల్ రికార్డులు:
ది బెస్ట్ ఫినిషర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు.. ధోని. లక్ష్యం కొండంత ఉన్నా ఏ మాత్రం బెరుకు లేకుండా, చివరి దశలో సిక్సర్లు బాదుతూ మ్యాచ్‌లను గెలిపించగలడు. అలాంటి దృశ్యమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో కనిపించింది. తుది ఐదు ఓవర్లలో చెన్నై 70 పరుగులు చేయాలి. క్రీజులో ధోని ఉన్నాడు. చివరి ఓవర్‌కు 26 పరుగులు చేయాలి. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌కు దిగాడు. తొలి, రెండు, మూడు బంతులను సిక్స్‌లుగా మలిచాడు. ఆ మ్యాచ్‌లో 48 బాల్స్‌లోనే 84 పరుగులు చేశాడు. అది ధోని ఐపీఎల్ అత్యుత్తమ స్కోరు ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సులు బాదిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
‘తాలా’ బంధం
ధోనిని సీఎస్కే అభిమానులు ‘తాలా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. తాలా అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. ఎంతో అభిమానం, ప్రేమ, గౌరవంతో పిలుస్తున్నందున ఆ పేరు అంటే ఎప్పటికీ తనకు ప్రత్యేకమేనని అంటున్నాడు ధోని. ‘తాలా నాకు చాలా ప్రత్యేకమైన నిక్ నేమ్. తమిళనాడులో ఎక్కడికి వెళ్లినా నన్ను ధోని అని కాకుండా ‘తాలా’ అని పిలుస్తారు. సీఎస్కే ఫ్యాన్స్ నన్ను ఆ పేరుతో పిలవడం నా అదృష్టం. నా ముద్దుపేర్లలో ‘తాలా’ వెరీ స్పెషల్. సీఎస్కే ఫ్యాన్స్ నాకు, మా టీమ్‌కు ఎప్పుడూ మద్దతిచ్చారు. వారిని మరిచిపోను’ అని ధోని అన్నారు.
First published:
May 6, 2019, 1:51 PM IST