టీమిండియాకు ఆ కష్టాలు తీరినట్టే.. ధోని కల నెరవేరినట్టే..

MS Dhoni Effect: మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక జట్టు పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నాడు. ఫీల్డింగ్, బౌలింగే ప్రధాన సమస్యలు అని తెలుసుకొని జట్టును రూపుదిద్దడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో సీనియర్లను కూడా పక్కనబెట్టాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 21, 2019, 6:17 PM IST
టీమిండియాకు ఆ కష్టాలు తీరినట్టే.. ధోని కల నెరవేరినట్టే..
హార్దిక్, ధోని, ధవన్, బుమ్రా (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
టీమిండియా ఇప్పుడో పటిష్ట జట్టు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అంతటి మెరుగైన ఫీలింగ్ ఉన్న టీం.. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆ జట్లకు ఏమాత్రం తీసిపోదు. ఓ రకంగా చెప్పాలంటే వాటికంటే ఓ మెట్టుపైనే ఉంది. ఇప్పుడు జట్టు మొత్తం సమతూకంగా ఉంది. ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌లో అందరూ సూపరే. బౌలింగ్ పరంగా చూసుకుంటే స్పిన్, సీమ్‌లో మన క్రికెటర్లు అదరగొడుతున్నారు. బ్యాటింగ్‌ విషయానికి వస్తే వేరే చెప్పక్కర్లేదు. ఇక, ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా పరుగెడుతూ ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం వేస్తున్నారు.. ఇప్పుడు జట్టు ఈ స్థాయిలో, ఇంత సమతూకంగా ఉంచడానికి అప్పుడెప్పుడో గంగూలీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. బ్యాట్స్‌మెన్‌కు కొదవలేని భారత జట్టు.. ఫీల్డింగ్‌లో నామమాత్రంగా, బౌలింగ్‌లో అథమస్థాయిలో ఉండేది. జట్టును తీర్చిదిద్దే క్రమంలోనే గంగూలీ కెప్టెన్సీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అప్పటికి కుంబ్లే, లక్ష్మణ్, ద్రవిడ్, సచిన్, సెహ్వాగ్ లాంటి హేమాహేమీలు జట్టులో పాతుకుపోయారు. గంగూలీ తర్వాత ద్రవిడ్ కొన్ని రోజుల పాటు కెప్టెన్‌గా పనిచేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. కానీ, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక జట్టు పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నాడు. ఫీల్డింగ్, బౌలింగే ప్రధాన సమస్యలు అని తెలుసుకొని జట్టును రూపుదిద్దడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో సీనియర్లను కూడా పక్కనబెట్టాడు. జూనియర్లకు అవకాశాలు కల్పించాడు. ఆ పని వల్ల ధోని విమర్శలు కూడా ఎదుర్కొనవలసి వచ్చింది. సీనియర్లనే పక్కన పెడతావా? అంటూ దుమ్మెత్తి పోశారు.

కానీ, అవేవీ ధోని పట్టించుకోలేదు.. సీనియర్లు, జూనియర్లతో జట్టును సమం చేశాడు. 2011లో అదే టీంతో వరల్డ్ కప్ సాధించి పెట్టాడు. ఆ తర్వాత కొత్త బౌలర్లకు అవకాశాలు ఇచ్చాడు. అయితే, భారత్‌కు సీమ్ ఆల్‌రౌండర్ కొరత వెంటాడింది. కపిల్‌దేవ్ తర్వాత అంతటి ప్రతిభ ఉన్న ఆటగాడు దొరకలేదు. దీంతో, ఎంతో మంది బౌలర్లతో ధోని ప్రయోగాలు చేశాడు. న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి టీంలు సక్సెస్ కావడానికి కారణం సీమ్ బౌలింగ్ వేసే ఆల్‌రౌండర్ల వల్లే. మన టీంకు వచ్చేసరికి యువరాజ్ స్పిన్నరే.. యూసుఫ్, జడేజా స్పిన్నర్లే.. వీరితో కొన్నేళ్ల పాటు జట్టును నెట్టుకొచ్చిన ధోనీకి సీమ్ ఆల్‌రౌండర్ మాత్రం దొరకలేదు. విదేశీ పర్యటనకు వెళ్తే అక్కడి పిచ్‌లన్నీ సీమ్‌కు ఎక్కువగా అనుకూలిస్తాయి. అలాంటప్పుడు ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగితే కష్టమే. ముగ్గురితో బరిలోకి దిగాల్సిందే. ఆ సందర్భంలో స్పిన్నర్ల ఎంపికలో ఇబ్బంది ఎదురవుతుంది. ఈ కూర్పు ధోనికి సమస్యగా మారింది. ఈ క్రమంలో ఇర్ఫాన్ పటాన్‌ను మళ్లీ బరిలోకి దించి అవకాశాలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. భువనేశ్వర్ అడపాదడపా ఆడినా అదీ తక్కువే.

అయితే, ఎన్నో ఏళ్ల పాటు వేచిచూసిన ధోనికి హార్దిక్ పాండ్యా రూపంలో మంచి ఆల్‌రౌండర్ దొరికాడు. ధోని కెప్టెన్సీలో హార్దిక్ ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా అతడిపై ధోని ప్రభావమే ఎక్కువ. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నా హార్దిక్ ఎంకరేజ్ చేసింది ధోనీనే. బౌలింగ్ వేసేప్పుడు, బ్యాటింగ్‌లో కావాల్సినన్ని మెలకువలు ధోని నుంచి నేర్చుకున్నాడు హార్దిక్. అలా కంప్లీట్ ఆల్‌రౌండర్‌గా మారిపోయాడు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ గెలవడంతో పాండ్యాది కీలక పాత్ర. కోహ్లీ కూడా హార్దిక్ పాండ్యా మ్యాచ్ విన్నర్ స్థాయికి ఎదిగాడని ప్రశంసించాడంటేనే అర్థం చేసుకోవచ్చు.. హార్దిక్ ఎంతలా రాటుదేలాడో.

ఇక, సరిగ్గా ఈ వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి కొన్ని నెలల ముందే విజయ్ శంకర్ రూపంలో భారత్‌కు మరో ఆల్‌రౌండర్ దొరికాడు. అంతకుముందు తమిళనాడు రంజీ కెప్టెన్ అయిన విజయ్ శంకర్.. టీమిండియాలో ఆశలు పెంచాడు. చివరి ఓవర్లలో హార్దిక్‌తో పాటు శంకర్ కూడా బ్యాటును ఝులిపించగలడు. గత మ్యాచ్‌లో భువనేశ్వర్‌కు గాయం కావడంతో బౌలింగ్‌కు దిగిన విజయ్ శంకర్.. తొలి బంతికే వికెట్ తీశాడు. ఆ మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ వేసి, బ్యాటింగ్‌లోనే రాణించి తన పాత్రకు న్యాయం చేశాడు. ఇలా.. ఎన్నో ఏళ్ల ధోని శ్రమకు, కలకు హార్దిక్, శంకర్ రూపంలో ఇప్పటికి ప్రతిఫలం దక్కినట్లు అర్థం చేసుకోవాల్సిందే.
First published: June 21, 2019, 6:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading