Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ పెద్ద మనసు.. 19 ఏళ్ల యువతికి క్రికెట్ గాడ్ ఆపన్న హస్తం..

Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ పెద్ద మనసు.. 19 ఏళ్ల యువతికి క్రికెట్ గాడ్ ఆపన్న హస్తం..

Sachin Tendulkar : ఆటలోనే కాదు ఆపదలో ఉండే వారిని ఆదుకోవడంలోనూ ముందుంటాడు మన సచిన్. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న మాస్టర్ ..లేటెస్ట్ గా ఓ యువతి కల నెరవేర్చేందుకు ముందుకొచ్చాడు.

  • Share this:
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)... పరిచయం అక్కర్లేని పేరు. రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన ప్లేయర్. ఆటలోనే కాదు ఆపదలో ఉండే వారిని ఆదుకోవడంలోనూ ముందుంటాడు మన సచిన్. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న మాస్టర్ తాజాగా 19 ఏళ్ల యువతి చదువుకు తన వంతు సాయం అందించాడు. మహారాష్ట్రలోని రత్నగిరికి చెందిన 19 ఏళ్ల దీప్తి విశ్వాస్ రావు అనే యువతి డాక్టర్ కావాలనే కలను నెరవేర్చడానికి సచిన్ ముందుకు వచ్చాడు. దీప్తి కల నెరవేరితే.. రత్నగిరిలోని జారీ గ్రామంలోనే మొదటి వైద్యురాలు అవుతుంది. ఇందుకోసం ఆమె రాత్రి, పగలు కష్టపడుతోంది. ఈ ప్రయత్నంలో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. సచిన్ సేవా సంస్థ సహ్యోగ్ ఫౌండేషన్ ఆమె కల నెరవేర్చేందుకు ముందుకు వచ్చింది.

ఆర్థిక సహాయం అందజేత..
రైతు కుటుంబంలో జన్మించిన దీప్తీ.. లాక్‌డౌన్ సమయంలో ఆన్ లైన్ తరగతులకు హాజరు కావడానికి నెట్‌వర్క్ ఇబ్బందులను ఎదుర్కొంది. ఇందుకోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులన్నీ దాటుకొని కష్టపడి చదివింది. ఫలితంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)లో దీప్తి 720 మార్కులకు గాను 574 సాధించింది. ఆమెకు అకోలాలోని ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చింది. అయితే ఉన్నత చదువుకు అవసరమైన డబ్బును దీప్తి కుటుంబం సమకూర్చలేకపోయింది. ఇప్పటికే తన చదువు కోసం బంధువులు, తెలిసినవారి దగ్గర నుంచి అప్పు తీసుకొని ప్రవేశ రుసుము చెల్లించారు. ఈ సమయంలో దీప్తి చదువుకు, ఇతర ఖర్చుల కోసం సచిన్ సహాయం అందించాడు. సేవా సంస్థ ద్వారా ఆమెకు స్కాలర్‌షిప్ ఇచ్చాడు. తనకు అండగా నిలిచినందుకు సచిన్ ఫౌండేషన్ కు దీప్తి కృతజ్ఞతలు తెలిపింది.

"నాకు స్కాలర్‌షిప్ ఇచ్చినందుకు సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ స్కాలర్‌షిప్ నా చదువు కోసం అయ్యే అన్ని ఖర్చులను భరిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను పూర్తిగా చదువుపైనే దృష్టి పెడతాను. డాక్టర్ కావాలనే నా కల నెరవేరబోతోంది. భవిష్యత్తులో ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కలలను నేరవేర్చడానికి కృషి చేస్తా" అని దీప్తి స్పష్టం చేసింది. మాస్టర్ కూడా దీప్తి గురించి ట్వీట్ చేశాడు. "దీప్తి కథ చాలా మందిని లక్ష్యాల కోసం కష్టపడి పనిచేసేలా ప్రేరేపిస్తుంది. దీప్తి భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు" అని సచిన్ ట్వీట్ చేశాడు. గత 12 ఏళ్లలో సచిన్ సేవా సంస్థ నాలుగు రాష్ట్రాల్లోని 24 జిల్లాల్లో 833 మంది పిల్లలకు ఆర్థిక సహాయం అందించింది.
Published by:Sridhar Reddy
First published: