Cricket Law: క్రికెట్ నుంచి 'బ్యాట్స్‌మాన్' అనే పదం తొలగింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న ఎంసీసీ

క్రికెట్‌లో ఇక బ్యాట్స్‌మెన్ ఉండరు.. అందరూ బ్యాటర్లే (ప్రతీకాత్మక చిత్రం)

క్రికెట్‌లో లింగ వివక్షకు తావు లేకుండా.. ఇకపై బ్యాట్స్‌మాన్, బ్యాట్స్‌మెన్ బదులుగా బ్యాటర్, బ్యాటర్స్ అనే పదాన్ని ఉపయోగించేలా క్రికెట్ రూల్స్ బుక్‌లో మార్పులు తీసుకొస్తూ ఎంసీసీ నిర్ణయం తీసుకున్నది.

  • Share this:
    క్రికెట్ (Cricket) అంటేనే బ్యాట్స్‌మాన్ (Batsman) ఆధిపత్యం ఉండే ఆట. బౌలర్లు ఎంత రాణించినా.. బ్యాట్స్‌మెన్‌కు లభించినంత గుర్తింపు బౌలర్లకు ఎక్కువగా దక్కదు. క్రికెట్‌లో బ్యాటింగ్ చేసే వాళ్లను బ్యాట్స్‌మాన్ అని పిలవడం ఆట పుట్టిన దగ్గర నుంచి ఉన్నది. అయితే ఇకపై క్రికెట్‌లో ఆ పదం వినిపించదు.. కనిపించదు. క్రికెట్‌లో రూల్స్‌ను రూపొందించే ది మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (The Marylebone Cricket Club) 'బ్యాట్స్‌మాన్', 'బ్యాట్స్‌మెన్' అనే పదాన్ని ఉపయోగిచడంపై నిషేధం విధించింది. ఇకపై బ్యాట్స్‌మాన్‌ను బ్యాటర్‌గా.. బ్యాట్స్‌మెన్‌ను బ్యాటర్లుగా వ్యవహరించాలని నిర్ణయిస్తూ నిబంధనలు మార్చింది. ఈ మార్పు బుధవారం (సెప్టెంబర్ 22) నుంచే అమలులోకి వస్తాయని లార్డ్స్ (The Lord's) వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. ప్రపంచ క్రికెట్‌కు పెద్ద దిక్కు అయిన ఐసీసీ అమలు చేసే నిబంధనలు అన్నీ ఎంసీసీ రూపొందిస్తుందన్న సంగతి తెలిసిందే. ఎంసీసీ పరిధిలో ఈ రూల్ నేటి నుంచి అమలు కావడంతో త్వరలోనే ఐసీసీ (ICC) ఈ రూల్‌ను ప్రపంచ క్రికెట్‌లో అమలులోకి తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది.

    వందేళ్లకు పైగా క్రికెట్‌లో బ్యాట్స్‌మాన్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. బ్యాటింగ్ చేసే ప్లేయర్‌ను సంబోధించడంతో పురుషుల క్రికెట్, మహిళల క్రికెట్‌కు మధ్య వ్యత్యాసం ఉన్నది. మహిళల క్రికెట్‌లో మొదట్లో బ్యాట్స్‌వుమెన్ అని సంబోధించగా.. ఆ తర్వాత బ్యాటర్‌గా వ్యవహరిస్తున్నారు. పురుషుల క్రికెట్‌లో మాత్రం బ్యాట్స్‌మాన్ అనే కొనసాగుతున్నది. ఇది కచ్చితంగా లింగ వివక్ష కిందకు వస్తుందని ఎంసీసీ అభిప్రాయపడింది. క్రికెట్‌లో ఎలాంటి వివక్షకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉన్నది కాబట్టే ఇకపై పురుష, మహిళల క్రికెట్‌లో కేవలం బ్యాటర్‌గా మాత్రమే పిలవాలని పేర్కొన్నది.

    Hooda: దీపక్ హుడాపై బీసీసీఐ సీరియస్.. యాంటీ కరప్షన్ యూనిట్ నిఘాలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు







    2017లో క్రికెట్ లా‌ను సవరించిన సమయంలో మహిళల క్రికెట్‌కు సంబంధించిన నిబంధనల విషయంలో కీలక చర్చ జరిగింది. బ్యాట్స్‌మాన్, బ్యాట్స్‌మెన్ అనే పదాలను సవరించాలని చర్చ జరిగినా.. నిర్ణయం మాత్రం తీసుకోలేదు. అయితే మరోసారి బ్యాటర్ పదంపై నిర్ణయం తీసుకోవాలని వినతులు వచ్చాయి. ఇప్పటికే అనేక క్రికెట్ క్లబ్స్, మీడియా సంస్థలు, క్రికెట్ గవర్నింగ్ బాడీలు బ్యాటర్ అనే పదాన్ని ఉపయోగిస్తున్న విషయాన్ని ఎంసీసీ దృష్టికి తీసుకొని వచ్చాయి. దీంతో ఎంసీసీ స్పెషలిస్ట్ లా సబ్-కమిటీకి ఈ విషయాన్ని అప్పగించారు. సబ్-కమిటీ బ్యాటర్ అనే పదానికి ఓటేయడంతో ఎంసీసీ కమిటీ ఆ ప్రతిపాదనను అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నది. క్రికెట్ లా బుక్ సవరణకు సంబంధించిన గెజిట్ ప్రచురణను లార్డ్స్ డాట్ ఆర్స్ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఎంసీసీ పేర్కొన్నది.
    Published by:John Naveen Kora
    First published: