ఐపీఎల్: హైదరాబాద్, ఢిల్లీ మధ్య ఎలిమినేటర్ పోరు నేడే..

లీగ్‌లో హైదరాబాద్‌ విజయాలకు గట్టి పునాది వేసిన ఓపెనర్లు వార్నర్‌, బెయిర్‌స్టో లేకపోయినా మనీష్‌ పాండే, రషీద్‌ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌తో హైదరాబాద్‌ బలంగా కనబడుతోంది.

news18-telugu
Updated: May 8, 2019, 6:49 AM IST
ఐపీఎల్: హైదరాబాద్, ఢిల్లీ మధ్య ఎలిమినేటర్ పోరు నేడే..
ఫైల్ ఫోటో
  • Share this:
ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నైపై ముంబై ఇండియన్స్ గెలిచి సగర్వంగా ఫైనల్‌లో అడుగు పెట్టగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈ రెండు జట్లు ఢీకొట్టనున్నాయి. లీగ్‌లో హైదరాబాద్‌ విజయాలకు గట్టి పునాది వేసిన ఓపెనర్లు వార్నర్‌, బెయిర్‌స్టో లేకపోయినా మనీష్‌ పాండే, రషీద్‌ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌తో హైదరాబాద్‌ బలంగా కనబడుతోంది. వరుసగా విఫలమైన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గత మ్యాచ్‌లో సత్తాచాటడం ఊరటనిస్తోంది. ధాటిగా ఆడే మార్టిన్‌ గప్టిల్‌ కూడా కిందటి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. వరల్డ్‌ కప్‌ జట్టుకు ఎంపికైన ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ ఈ మ్యాచ్‌లో అంచనాల మేర రాణించాలని హైదరాబాద్‌ కోరుకుంటోంది. ఢిల్లీతో మ్యాచ్‌లో రషీద్‌ఖాన్‌, మహ్మద్‌ నబీ మెరవడం, క్యాపిటల్స్‌లో ఎక్కువమంది లెఫ్ట్‌హ్యాండర్లు ఉండడంతో హైదరాబాద్‌ జట్టు పైచేయిగా నిలిచే అవకాశముంది.

కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకొని బరిలోకి దిగిన శ్రేయాస్‌ అయ్యర్ సేన అద్భుతంగా రాణించి ఈ ఐపీఎల్‌లో ఉత్తమ జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకొంది. తమ ఆరంభ మ్యాచ్‌లో పటిష్ఠ ముంబైని కంగు తినిపించింది. శిఖర్‌ ధవన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పృథ్వీ షా, రిషభ్‌ పంత్‌ కీలక సమయాల్లో మెరుపులు మెరిపిస్తున్నారు. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఎంతో పరిణతి చూపుతూ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.

నేడు గెలిచే జట్టు శుక్రవారం ఇదే స్టేడియంలో జరిగే రెండో క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడుతుంది. ఐపీఎల్‌...మ్యాచ్‌ల కోసం ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. స్టేడియం ప్రధాన ద్వారాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఎలక్ట్రానిక్ స్కోరుబోర్డులు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రీప్లేలు, థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని తెలిపే విజువల్స్‌ కోసం భారీ స్క్రీన్లను సిద్ధం చేశారు.
First published: May 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading