ధోని టాస్ గెలిస్తే ఏం చేస్తాడు.. విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఐఐటీ మద్రాస్

ధోని ఫీవర్ ఇప్పుడు చదువుల్లోకి కూడా పాకింది. ఆశ్చర్యంగా.. దేశంలోని ప్రఖ్యాత వర్సిటీయే ధోనికి ఫిదా అయిపోయింది. ఎంతలా అంటే.. పరీక్షల్లో ధోని గురించి అడిగేంతగా...

news18-telugu
Updated: May 9, 2019, 12:35 PM IST
ధోని టాస్ గెలిస్తే ఏం చేస్తాడు.. విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఐఐటీ మద్రాస్
సీఎస్‌కే టీమ్
  • Share this:
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వినబడితే చాలు, ఏంటో అని ఎంతో మంది చెవులు రిక్కించి మరీ వింటారు. అభిమానులకైతే ఎక్కడ లేని ఆత్రుత. సచిన్ తర్వాత ధోనిని దేవుడిగా కొలుస్తున్న వారు ఎందరో! అయితే, ధోని ఫీవర్ ఇప్పుడు చదువుల్లోకి కూడా పాకింది. ఆశ్చర్యంగా.. దేశంలోని ప్రఖ్యాత వర్సిటీయే ధోనికి ఫిదా అయిపోయింది. ఎంతలా అంటే.. పరీక్షల్లో ధోని గురించి అడిగేంతగా... ఐఐటీ మద్రాస్ సోమవారం నిర్వహించిన సెమిస్టర్ పరీక్షల్లో ఐపీఎల్‌కు సంబంధించిన ప్రశ్న అడిగి విద్యార్థులను ఆశ్చర్యపరిచింది. మంగళవారం చెపాక్‌ వేదికగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలా? లేదా ఫీల్డింగ్ ఎంచుకోవాలా అనే ప్రశ్నను సంధించింది. మ్యాచ్ జరగడానికి ముందు రోజు నిర్వహించిన మెటీరియల్ అండ్ ఎనర్జీ బ్యాలెన్సెస్ పేపర్లో ఇదే తొలి ప్రశ్న. క్రికెట్ అంటే ఇష్టపడే చాలా మంది విద్యార్థులనే కాదు.. ఐసీసీని కూడా ఈ ప్రశ్న ఆకర్షించింది. ప్రొఫెసర్ విఘ్నేశ్ రూపొందించిన ఈ ప్రశ్నను మ్యాచ్ జరగడానికి ముందే ఐసీసీ ట్వీట్ చేసింది. ప్రసుత్తం ఐసీసీ చేసిన ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది.

‘డే అండ్ నైట్ మ్యాచుల్లో మంచు కీలక పాత్ర పోషిస్తుంది. అవుట్ ఫీల్డ్‌పై మంచు అధికంగా కురవడం వల్ల బంతి తడిగా మారుతుంది. దీంతో బంతిపై పట్టు సాధించడం స్పిన్నర్లకు కష్టం. ఫాస్ట్ బౌలర్లు కూడా నిర్దేశించిన చోట బంతి విసరలేరు. దీంతో మంచు ఎక్కువగా ఉండటం రాత్రి పూట ఫీల్డింగ్ చేసే జట్టుకు ప్రతికూలంగా మారుతుంది. ఐపీఎల్ 2019లో చెన్నై సూపర్ కింగ్స్ మే 7న చెపాక్ స్టేడియంలో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడుతుంది. ఆ రోజున చెన్నైలో గాలిలో తేమ 70 శాతం ఉండొచ్చు. ఆట ప్రారంభంలో ఉష్ణోగ్రత 39 డిగ్రీలు ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి అది 27 డిగ్రీలకు పడిపోతుంది. ఈ సమాచారం ఆధారంగా ధోనీ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలా? లేదా ఫీల్డింగ్ చేయాలా?’ అనే ప్రశ్నను విద్యార్థులకు సంధించారు.పేపర్ రూపొందించిన ప్రొఫెసర్ విఘ్నేశ్ సమాధానం ఇస్తూ్.. ఫీల్డింగ్ తీసుకోవడం మంచి నిర్ణయం అంటూ వివరించారు. కానీ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సీఎస్‌కే నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ లక్ష్యాన్ని ముంబై ఆడుతూ పాడుతూ ఛేదించడంతో సీఎస్‌కే ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐఐటీ ప్రొఫెసర్‌లా ధోని ఆలోచించి ఉంటే చెన్నై గెలిచేది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
First published: May 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>