ICC World Cup 2019: సవాలక్ష సమస్యలతో సెమీస్‌కు భారత్.. ఇలా అయితే కప్పు ఎలా..

ICC Cricket World Cup 2019 | Team India | ప్రస్తుతం టీమిండియాను కలవరపెడుతున్న ప్రధాన సమస్యల్లో జట్టు కూర్పు మొదటిది. ఆ తర్వాత మిడిలార్డరే. జట్టు కూర్పు విషయానికి వస్తే.. గాయం కారణంగా ధవన్ టోర్నీ నుంచి తప్పుకోవడంతోనే మొదలైందీ సమస్య.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 3, 2019, 1:52 PM IST
ICC World Cup 2019: సవాలక్ష సమస్యలతో సెమీస్‌కు భారత్.. ఇలా అయితే కప్పు ఎలా..
టీమిండియా సభ్యులు ( Image : Twitter)
  • Share this:
టీమిండియా అదరగొడుతోంది.. రోహిత్ శర్మ సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు.. విరాట్ కోహ్లీ దూకుడు ప్రదర్శిస్తూ జట్టును విజయతీరాలకు చేర్చుతున్నాడు.. ఆల్‌రౌండ్ షోతో హార్దిక్ అదరగొడుతున్నాడు.. వరల్డ్ కప్ ఎంట్రీలోనే రిషబ్ పంత్ దంచేస్తున్నాడు.. మొత్తంగా లీగ్ దశలో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 విజయాలు. అందులో ఒకటి పోరాడి ఓడినా, మరోటి రద్దైంది. అయితే, ఈ విజయాల వెనక ఎన్నో మైనస్ పాయింట్లు ఉన్నాయి. వరుసగా మ్యాచ్‌లు గెలవడంతో ఆ లోపాలన్నీ మరుగున పడిపోయాయి. కానీ, ఆ లోపాలతో సెమీస్‌లో నెగ్గగలమా? ఫైనల్‌లో కప్పు ఒడిసి పట్టగలమా? అంటే గుండెలో గుబులు పుడుతోంది. లీగ్ దశలో ఓ మ్యాచ్ ఓడినా మరో మ్యాచ్ గెలిచి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ, సెమీస్‌లో అలా కాదు. ఓడితే ఇంటికే.

ప్రస్తుతం టీమిండియాను కలవరపెడుతున్న ప్రధాన సమస్యల్లో జట్టు కూర్పు మొదటిది. ఆ తర్వాత మిడిలార్డరే. జట్టు కూర్పు విషయానికి వస్తే.. గాయం కారణంగా ధవన్ టోర్నీ నుంచి తప్పుకోవడంతోనే మొదలైందీ సమస్య. ధవన్ వైదొలగడంతో నాలుగో స్థానంలో దిగాల్సిన కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా దించాల్సి వచ్చింది. నాలుగో స్థానం ఖాళీ కావడంతో ఆ స్థానంలో విజయ్ శంకర్‌ను దించారు. కానీ, ఫలితం దక్కలేదు. దీంతో రిషబ్ పంత్‌ను తీసుకురావాల్సి వచ్చింది.

ఇకపోతే, మిడిల్ ఆర్డర్.. అసలు సమస్య ఇక్కడే. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, కోహ్లీ గనక త్వరగా అవుటైతే మిడిలార్డర్ ఆ బాధ్యతను తీసుకోవాలి. కానీ, గత మ్యాచుల్లో మిడిలార్డర్ ఏమాత్రం రాణించలేక పోయింది. విజయ్ శంకర్, కేదార్ జాదవ్ తమ సత్తాకు తగ్గ ఆట ఆడనేలేదు. ధోని కూడా తన బ్యాటును సరైన సమయంలో ఝులిపించలేకపోయాడు. వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప.. మునుపటిలా ఎదురు దాడికి దిగలేకపోతున్నాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్‌తో పోల్చితే ధోని చాలా బెటర్. ఆడిన 7 మ్యాచ్‌లలో 223 పరుగులు చేశాడు. 33(46), 27(14), 1(2), 28 (52), 56(61), 42(31), 35(33) పరుగులు చేశాడు. పాక్, ఆఫ్ఘన్ మ్యాచ్‌లలో మాత్రమే విఫలమయ్యాడు. రోహిత్, రాహుల్, కోహ్లీ తర్వాత ఎక్కువ పరుగులు చేసింది ధోనీనే. అయితే, ఇప్పుడు నాకౌట్‌లో ఉన్నాం. ఈ సమయంలో ధోని నెమ్మదిగా ఆడితే కష్టమే.

ఇక, హార్దిక్ పాండ్యా బ్యాటును ఝులిపిస్తున్నా, ఉన్నంత సేపు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నా.. తన పరుగులను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. అయితే, బౌలింగ్‌లో రాణించడం సానుకూలాంశం. స్పిన్ విషయానికి వస్తే.. కుల్దీప్, చాహల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. వారు బౌలింగ్‌కు దిగితే చాలు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. మంచి ఫీల్డింగ్ ఉన్న జట్లలో టీమిండియా ఒకటి. కానీ, ఓవర్ త్రోలు చేస్తూ, రనౌట్లు చేయలేక ఫీల్డింగ్ వైఫల్యాలను బయటపెట్టుకుంటోంది.ఈ నేపథ్యంలో.. ఇన్ని సమస్యలు పెట్టుకొన్న టీమిండియా సెమీస్‌లో ఆస్ట్రేలియా లాంటి పటిష్ఠమైన జట్టుతో పోటీ పడగలదా? అటు తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత ప్రతి మ్యాచ్ గెలుస్తూ వచ్చింది. టీమిండియా మాత్రం ప్రతి మ్యాచ్‌లో పడుతూ, లేస్తూ వచ్చింది. ఇకనైనా లోపాలను సరిదిద్దుకొని బరిలోకి దిగితేనే.. కప్పు భారత్ సొంతం అవుతుంది.
First published: July 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు