World Cup 2019: ఇదేమీ కామెంటరీ.. టీమిండియా క్రికెటర్లపై అంత అక్కసెందుకు?

జడేజా (ట్విట్టర్ ఫోటో)

ICC Cricket World Cup 2019 | Team India | ఒకప్పుడు భారత జట్టుకు ఆడిన వాళ్లే మనోళ్లపై అక్కసు వెళ్లగక్కితే? చిన్న తప్పు చేసినా.. పెద్ద తప్పు చేసినట్లు నిందిస్తే? ఇదేమి కామెంటరీ అనక మానదు. ఇప్పుడు సగటు భారత క్రికెట్ అభిమాని మెదడును తొలుస్తున్న ప్రశ్నలు ఇవి..

  • Share this:
లీగ్ దశలో టీమిండియా మంచి ప్రదర్శన చేస్తూ సెమీస్ వరకు చేరుకుంది.. పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని కూడా సంపాదించింది.. రోహిత్ సెంచరీలు బాదుతూ వరల్డ్ రికార్డులు సృష్టిస్తే, బౌలర్లు విజృంభించి ప్రత్యర్థుల వెన్ను విరిచారు. ఇంగ్లండ్ మినహా అన్ని జట్లపై టీమిండియా జయ కేతనం ఎగుర వేసింది. అయితే, టీమిండియా గెలవడం కామెంటేటర్లకు ఇష్టం లేదా? పిచ్ సహకరించకున్నా గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్న భారత ఆటగాళ్లు అంటే వాళ్లకు ఎందుకు అంత ద్వేషం? ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఒక్క ఫోర్ కొట్టినా.. వేరే జట్టు బౌలర్ ఒక్క డాట్ బాల్ వేసినా.. కామెంటేటర్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.. కానీ, మనోళ్లు వికెట్ తీసినా, ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేసినా ఏదో అలా చెప్పామా? అన్నట్లు కామెంటరీ చేశారు. అదేదో.. వేరే దేశానికి చెందిన కామెంటేటర్లు అంటే ఏం అనిపించదు. కానీ,ఒకప్పుడు భారత జట్టుకు ఆడిన వాళ్లే మనోళ్లపై అక్కసు ప్రదర్శిస్తే? చిన్న తప్పు చేసినా.. పెద్ద తప్పు చేసినట్లు నిందిస్తే? ఇదేమి కామెంటరీ అనక మానదు. ఇప్పుడు సగటు భారత క్రికెట్ అభిమాని మెదడును తొలుస్తున్న ప్రశ్నలు ఇవి..

కామెంటరీ చేస్తున్న సెహ్వాగ్, సచిన్, గంగూలీ (ట్విట్టర్ ఫోటో)


నిజమే.. ఈ ప్రపంచకప్‌లో భారత్ తరఫున కామెంటేటర్లుగా వెళ్లిన వారిలో సౌరబ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సంజయ్ మంజ్రేకర్, హర్ష బోగ్లే, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. వీరిలో గంగూలీ, మంజ్రేకర్, హర్ష బోగ్లేకు అసలు టీమిండియా తమకు ఏ మాత్రం ఇష్టం లేదన్నట్లు కామెంటరీ చేయడం సగటు అభిమానిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా సంజయ్ మంజ్రేకర్ విషయానికి వస్తే.. తన నోటి దురుసుతనంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చురుకు అంటించుకున్నాడు.

సంజయ్ మంజ్రేకర్ (ట్విట్టర్ ఫోటో)


అంతకు ముందు ధోని బ్యాటింగ్‌పై విమర్శలు గుప్పించిన ఈ కామెంటేటర్.. ఇంగ్లండ్ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకునే క్రమంలో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. అతడి స్థానంలో జడేజా సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. కాసేపటికి లాంగాన్‌లో జేసన్ రాయ్ ఇచ్చిన క్యాచ్‌ని అద్భుతంగా ముందుకు డైవ్ చేస్తూ జడేజా అందుకున్నాడు. ఆ క్యాచ్‌ను జడేజా తప్ప టీమిండియాలో ఎవరూ పట్టలేరని ఇంగ్లండ్ కామెంటేటర్ వ్యాఖ్యానించగా.. ‘అరకొర‌గా మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లని నేను పెద్దగా అభిమానించను. వన్డేల్లో జడేజా ఈ కోవకి చెందిన క్రికెటరే. టెస్టుల్లో జడేజా ప్యూర్ బౌలర్. కానీ.. వన్డేల్లో మాత్రం అతను బ్యాట్స్‌మెన్ కాదు.. అలా అని స్సిన్నర్ కూడా కాదు’ అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.

దీనిపై జడేజా ఘాటుగానే ప్రతి స్పందించాడు. ‘కెరీర్‌లో నువ్వు ఆడిన మ్యాచ్‌ల కంటే నేను రెట్టింపు మ్యాచ్‌లు ఆడాను. ఇంకా ఆడుతూనే ఉన్నా. ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో. నేను ఇప్పటికే నీ వెటకార కామెంట్లు చాలా విన్నా. నీ నోటి విరోచనాలు ఇకనైనా ఆపేయ్’ అని ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చాడు.మళ్లీ.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జడేజా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా చేశాడు. దీంతో బాగా ఆడావ్ జడేజా.. అంటూ ట్వీట్ చేశాడు. బ్యాటింగ్‌తో తనను పీస్ పీస్ చేసేశాడు అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మంజ్రేకర్‌పై విరుచుకుపడ్డారు. సందర్భాన్ని మాట మార్చుతావా? అంటూ మండి పడ్డారు. వరస్ట్ కామెంటేటర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, మాజీ కెప్టెన్ గంగూలీ, హర్ష బోగ్లే కూడా టీమిండియా అంటే ఏ మాత్రం ఇష్టం లేదన్నట్లు కామెంటరీ చేశారు. ఇప్పటికే ఒకసారి హర్ష బోగ్లే కామెంటరీపై టీమిండియా జట్టు బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో అతడ్ని తప్పించింది. దీంతో కాస్త కుదురుకున్నాడు. అయితే, టీమిండియా దేదీప్యమైన భవిష్యత్తుకు పునాది వేసిన గంగూలీ కూడా అలాగే కామెంటరీ చేయడం అభిమానులకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. ధోని సహా పలువురు క్రికెటర్లు బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో ఓ రకమైన కామెంటరీ చేయడం ఆయన అక్కసును తెలియజేస్తోందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గంగూలీని తప్పించడంలో ధోని పాత్ర ఉందని, అందుకే మిస్టర్ కూల్‌ను లక్ష్యంగా చేసుకొని గంగూలీ వ్యంగ్యంగా కామెంటరీ చేస్తున్నాడని ధోని అభిమానులు మండి పడుతున్నారు. ఏదేమైనా టీమిండియా జట్టుకు సహృద్భావ వాతావరణం కల్పించి, యువ క్రికెటర్లకు మార్గనిర్దేశనం చేయాల్సిన మాజీ క్రికెటర్లే ఇలా కామెంటరీ చేయడం ఏం బాగోలేదని అభిమానులు అంటున్నారు.
Published by:Shravan Kumar Bommakanti
First published: