వరుసగా రెండో సారి ఫైనల్లోకి న్యూజిలాండ్.. భారత్ ఆశలకు గండి కొట్టిన వరుణుడు..!

ICC Cricket World Cup 2019 | IND vs NZ | గురువారం జరగనున్న రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో గెలిచిన జట్టుతో ఆదివారం ఫైనల్ పోరులో న్యూజిలాండ్ బరిలోకి దిగుతుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 8:28 PM IST
వరుసగా రెండో సారి ఫైనల్లోకి న్యూజిలాండ్.. భారత్ ఆశలకు గండి కొట్టిన వరుణుడు..!
వరుసగా రెండో సారి ఫైనల్లోకి న్యూజిలాండ్
  • Share this:
5 విజయాలు.. 3 పరాజయాలు.. ఫలితం తేలనిది ఒకటి.. ఇదీ లీగ్ దశలో న్యూజిలాండ్ పరిస్థితి. 11 పాయింట్లతో సెమీస్‌లో అడుగు పెట్టి నాలుగో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఉన్న భారత్‌తో సెమీస్ పోరు. అందరూ టీమిండియానే హాట్ ఫేవరేట్ అని స్పష్టం చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో కోహ్లీ సేన పటిష్ఠంగా ఉన్న తరుణంలో కివీస్ జట్టు గెలవడం కష్టమే అనుకున్నారు. కానీ, న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. తొలిసారి ప్రపంచకప్ గెలవాలన్న కసితో బరిలోకి దిగిన విలియమ్‌సన్ బృందం.. సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. 239 పరుగులే చేసినా.. లక్ష్యాన్ని కాపాడుకుంది. ఆల్ రౌండ్ ప్రతిభతో టీమిండియాను ఇంటి బాట పట్టించింది. గత వరల్డ్ కప్‌లోనూ ఫైనల్ చేరిన బ్రెండన్ మెక్‌కల్లమ్ నేతృత్వంలోని కివీస్.. ఆస్ట్రేలియా చేతిలో కంగుతిన్నది. అయితే, ఈ సారైనా కప్పును ముద్దాడాలని పట్టుదలతో ఉంది.

గురువారం జరగనున్న రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో గెలిచిన జట్టుతో ఆదివారం ఫైనల్ పోరులో న్యూజిలాండ్ బరిలోకి దిగుతుంది. ఇంగ్లండ్ ఫైనల్ చేరితే.. ఈ రెండు టీమ్‌లలో ఏదో ఒకటి తొలిసారి ప్రపంచకప్ అందుకోనున్నాయి. ఆస్ట్రేలియా ఫైనల్‌కు వెళ్తే.. ప్రపంచకప్ ఫైనల్‌లో వరుసగా రెండోసారి కివీస్, ఆస్ట్రేలియా తలపడినట్లు అవుతుంది.

ఇదిలా ఉండగా, తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ విధించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్ పేక మేడలా కుప్పకూలిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా పిచ్, అవుట్ ఫీల్డ్ దెబ్బతిన్నాయి. ఆ పరిస్థితులు బౌలింగ్ టీమ్‌కు అనుకూలించాయి. న్యూజిలాండ్ బౌలర్ల స్వింగ్‌కు భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్, విరాట్ కోహ్లీ అల్లాడిపోయారు. తలో పరుగు చేసి వికెట్ సమర్పించుకున్నారు.

First published: July 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు